మరింత రూపీ పతనమైతే.. కార్ల ధరలు పైపైకే

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 10:27 AM IST
Highlights

రూపాయి మారకం ఆటోమేకర్లను పదేపదే ఇబ్బందుల పాల్జేస్తున్నది. మరింత పతనమైతే కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని టయోటా కిర్లోస్కర్, మెర్సిడెస్ - బెంజ్ తేల్చేశాయి. 

న్యూఢిల్లీ: జపాన్ ఆటో మేకర్ టయోటా, జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్‌ మరోసారి ధరలను పెంచడానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అమెరికా డాలర్ పై రూపాయి విలువ 72 వద్ద స్థిరపడింది. దీని ప్రభావం ఆటోమొబైల్ సంస్థలకు ప్రతికూల ప్రభావం చూపనున్నది. 

అమెరికా డాలర్‏పై రూపాయి మారకం పతనం అవుతున్న నేపథ్యంలో పడుతున్న భారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు టయోటా డిప్యూటీ ఎండీ ఎన్ రాజా తెలిపారు. ప్రస్తుతానికి జరిగిన రూపాయి పతనంతో పెరిగిన వ్యయాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా కిర్లోస్కర్ (టీకేఎం) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా చెప్పారు. ఇక ముందు రూపాయి విలువ మరింత పతనమైతే పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపక తప్పదని స్పష్టం చేశారు.

కార్ల విడి భాగాల దిగుమతి భారాన్ని, ఎగుమతులను విస్తరించడం ద్వారా సరి చేసేందుకు ప్రయత్నించే విషయమై ఇప్పటికిప్పుడేమీ చెప్పలేమని  టయోటా కిర్లోస్కర్ (టీకేఎం) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. అయితే దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలకు ఎటోస్ మోడల్ కార్లను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. సంపన్న దేశాలతో భారత్ పోటీ పడుతున్నదని అయితే అంతర్జాతీయ ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. 

భారతదేశం నుంచి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన 10 శాతం వాహనాలను ఎగుమతి చేసినట్లు చెప్పారు. టయోటా క్లిరోస్కర్ ఒక జాయింట్ వెంచర్. జపాన్ ఆటో మేజర్, కిర్లోస్కర్ గ్రూపుల సమ్మేళనం. అయితే కొన్ని ప్రత్యేక విడి భాగాల కోసం ఇప్పటికి విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన హ్యాచ్ బ్యాక్ ఎటోస్ లివా, ఎస్ యూవీ లాండ్ క్రూయిసర్ కార్లకు విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

రూపాయి పతనం ఆందోళన కల్గిస్తున్నదని, ఇటీవల ధరలను పెంచినట్లు, రూపాయి పతనంతో మరోసారి పెంచకతప్పదని మెర్సిడెస్ బెంజ్ ఉపాధ్యక్షుడు మైఖేల్ తెలిపారు. ఎప్పటిలోగా ధరలు పెంచుతారన్న సంగతి మాత్రం ఆయన వివరించలేదు. ఈ నెలలోనే సంస్థ కార్ల ధరను నాలుగు శాతం వడ్డించింది. అయితే రెండు, మూడు నెలల్లో మెర్సిడెస్ - బెంజ్ కార్లధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదని తేలిపోయింది. ఒకవేళ రూపాయి మరోసారి పతనమైతే మాత్రం ధరల పెరుగుదల అనివార్యమని మైఖేల్ జోప్ వివరించారు. ఈ నెల ప్రారంభంలోనే హోండా కార్స్ మేనేజ్మెంట్ కూడా రూపాయి మరింత పతనమైతే ధరలు పెంచాల్సి వస్తుందని తేల్చేసింది.

click me!