రూ.750 చెల్లిస్తే రూ.15 లక్షల ప్రమాద బీమా

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 10:13 AM IST
Highlights

రూ.750 చెల్లిస్తే రూ.15 లక్షల ప్రమాద బీమా 

ముంబై: సొంతంగా వాహనం నడుపుకొనే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని రూ.15లక్షలకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి వాహన యజమాని రూ.750 చెల్లించి ప్రమాద బీమా పథకం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం సంబంధిత వ్యక్తి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ద్విచక్ర వాహనాన్ని నడిపే వారి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. 

వాహనాన్ని డ్రైవరు నడుపుతున్నప్పుడు యజమాని పక్కన కూర్చున్నా ఈ పాలసీ వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడటం, మరణించిన సందర్భాల్లో ఈ పరిహారం అందనుంది. ఇప్పటివరకూ ఈ తప్పనిసరి వ్యక్తిగత పాలసీ కింద ద్విచక్ర వాహన యజమానులకు రూ.లక్ష, వ్యక్తిగత కార్లు, వాణిజ్య వాహనాలకు రూ.2లక్షల బీమా ఉండేది. కొన్ని బీమా సంస్థలు దీనికి అదనంగా అనుబంధ పాలసీల రూపంలో అధిక మొత్తానికి బీమా అందించేవి. దీనికోసం ప్రత్యేకంగా ప్రీమియం వసూలు చేస్తాయి. అయితే, ఈ వ్యక్తిగత బీమా పాలసీ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సాధారణ బీమా సంస్థలు గతంలోనే ఐఆర్‌డీఏకి తెలిపాయి. మద్రాస్ హైకోర్టు కూడా ఒక కేసు విషయంలో ఐఆర్‌డీఏకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 

వీటన్నింటినీ పరిశీలించిన నియంత్రణ మండలి తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని రూ.15 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం రూ.750 ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ ప్రీమియం అమల్లో ఉంటుందని తెలిపింది. అమల్లో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు ఉండి, బీమా పాలసీ కూడా ఉన్న వాహనాన్ని నడిపిన వారికే ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని పెంచుకునేందుకు కూడా వాహన యజమానికి అవకాశం ఉంది. 

దీనికోసం బీమా సంస్థలు అదనపు ప్రీమియం వసూలు చేస్తాయి. ‘రోడ్డు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడటం, మరణించిన సందర్భంలో ఆయా వ్యక్తుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రమాద బీమా మొత్తాన్ని పెంచాలని ఐఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమ’ని బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్‌ ఎండీ, సీఈఓ తపన్‌ సింఘల్‌ పేర్కొన్నారు.

click me!
Last Updated Sep 22, 2018, 10:13 AM IST
click me!