ఆర్థిక మందగమనం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు డిమాండ్ పడిపోతోంది. దీనివల్ల ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. మూడు నెలల్లో దాదాపు అర లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ, స్థిరాస్తి రంగాల్లోనూ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
దేశీయంగా మందగమన పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో ఆయా పరిశ్రమల అమ్మకాలు కుదేలవుతున్నాయి. దీంతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి.
ఉత్పత్తి తగ్గించుకున్న కంపెనీలు, పరిశ్రమలు తమ నిర్వహణ భారాన్ని తగ్గించుకొనేందుకు ఉద్యోగులను ఇంటికి పంపే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో కొలువులు కొండెక్కుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా నిలిచే ఆటోమొబైల్, రియాల్టీ, ఐటీ, ఆర్థిక సంస్థల విభాగాల ఉద్యోగాలు భారీగా కుదించుకుపోతున్నాయి.
undefined
డిసెంబర్ నెలతో ముగిసిన సంవత్సరంలో దేశంలో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు దాదాపు 12.75 శాతం మేర పడిపోయి 29,62,052గా నమోదయ్యాయి. ఇది దాదాపు రెండు దశాబ్దాల కనిష్టం కావడం విశేషం.
Also Read:ల్యాండ్ రోవర్ నుంచి రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త వెర్షన్.... అదిరిపోయే టెక్నాలజి ఫీచర్స్....
నిర్వహణ వ్యయం పెరుగుదలతోపాటు వాహన ధరలు పెరగడం, వాహనాల కొనుగోలుకు గతంలో మాదిరిగా బ్యాంకింగేతర విత్త సంస్థల నుంచి విరివిగా రుణాలు లభించకపోవడం, రుణాల జారీ విషయంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రజలు ఎక్కువగా కొత్త వాహనాలను కొనేందుకు మక్కువ చూపకపోవడం తదితర కారణాలతో వాహన అమ్మకాలు గణనీయంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. దీంతో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలతో పాటుగా వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయి.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన తాజా గణానంకాల మేరకు దేశంలో వాణిజ్య వాహనాల సేల్స్ దాదాపు15% మేర పడిపోయి.. 8,54,759గా నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 16% వరకు కుంగిపోయాయి. దీంతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగ కోతలు జోరందుకున్నాయి.
తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక కాలంలో దాదాపు 15 వేల మందికి పైగా ఆటోమొబైల్ రంగం నుంచి ఉద్వాసనకు గురైనట్టుగా తెలుస్తోంది.
దీనికి తోడు ఆటోమొబైల్ పరిశ్రమల అనుబంధ పరిశ్రమలుగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి కోల్పోయిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఉద్యోగ కోతలు అర లక్ష దాటేసి ఉంటుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
దీనికి ముందు 19 నెలల్లో దాదాపు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయి. వీటిల్లో కూడా దాదాపు పదివేల వరకు జాబ్స్ కొండెక్కినట్లు తెలుస్తోంది.
మందగమనంతో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఓయో హౌటల్స్ సంస్థ భారీగా ఉద్యోగాల కోతలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ సంస్థ భారత్‌లో దాదాపు 10వేల మంది సిబ్బందిని కలిగి ఉంది. ఇందులో దాదాపు దాదాపు 12% మంది ఉద్యోగులను సంస్థ డిస్మిస్ చేసే పనులను ప్రారంభించింది.
దీనికి తోడు వచ్చే 3,4 నెలల్లో మరో 1200 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని కూడా సంస్థ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఆతిథ్య రంగంలో ప్రముఖంగా నిలిచే ఓయోలో ఉద్యోగ కోతలు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనమని.. ఇలా చాలా హౌటల్స్‌లో ఉద్యోగాల తీసివేత భారీగా సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మందగమనంతో ఆతిథ్య రంగంలో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య దాదాపు అయిదు లక్షలకు పైబడే ఉంటుంది. దీనికి తోడు బ్యాంకులు గతంలో మాదిరిగా రుణాలను జారీ చేయలేకపోతున్నాయి. ఫలితంగా చాలా చిన్న సంస్థలు నిర్వహణ మూలధనం లేక మూత పడ్డాయి. ఈ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటే గడిచిన మూడు నెలల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు నమోదు అయ్యాయి.
మందగమనం ప్రభావం దేశ ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీలు ప్రాజెక్టులు లేక బెంచ్‌పై ఉన్న వారే లక్ష్యంగా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయి. కొన్ని కంపెనీలైతే సీనియర్, మిడ్ లెవల్ అధికారులు లక్ష్యంగా ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నారు.
Also Read:మళ్ళీ పడిపోయిన వాహన అమ్మకాలు...కారణం బిఎస్ 6...?
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ దాదాపు 7000 మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సంస్థ ఇప్పటికే దశల వారీగా కాగ్నిజెంట్ దాదాపు 6000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే.
ఐటీకి తోడు స్థిరాస్తి రంగంలోకూ వేలల్లో కొలువుల కోతలు ఉంటున్నాయి. గృహ ప్రాజెక్టుల అమ్మకాలు నిలిచిపోవడం కొత్త ప్రాజెక్టులు ఆగిపోయిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.
ఈ రంగంలో స్తబ్దతతో గత మూడు నెలల్లో దాదాపు 20వేల మంది కొలువులు కోల్పోయారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య మాత్రమేనని.. పరోక్షంగా కొలువులు నష్టపోయిన వారిని కూడా లెక్కలోకి తీసుకుంటే దాదాపు ఈ సంఖ్య లక్షల దాటేసే అవకాశం ఉందని ఈ రంగంలోని విశ్లేషకులు చెబుతున్నారు.