‘ఫేమ్-2’చట్రంలోకి హైబ్రీడ్ వెహికల్స్.. మొత్తం స్కీం కింద రూ.5500 కోట్లు

By rajesh y  |  First Published Feb 18, 2019, 2:19 PM IST

విద్యుత్ వాహనాలతోపాటు హైబ్రీడ్ వాహనాలకూ ఫేమ్-2 స్కీమ్ కింద ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఒక కిలోవాట్ హవర్‌పై రూ.10000 చొప్పున రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ద్విచక్ర వాహనాలపై ఫేమ్ తొలిదశలో ఇచ్చిన రూ.22 వేలను రూ.11 వేలకు తగ్గించడంతో వాటి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 


న్యూఢిల్లీ: గ్రీన్ మొబిలిటీని ప్రమోట్ చేసి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించి.. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతిని కనిష్ట స్థాయికి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఇంతకుముందు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ( ఫేమ్‌ ఇండియా) రెండో దశలో హైబ్రీడ్ వాహనాలనూ చేర్చింది. 

ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైబ్రీడ్ వాహనాల్లో అమర్చే బ్యాటరీ సైజ్ ఆధారంగా ఫేమ్ ఫేస్ 2 కింద ఇన్సెంటివ్‌లు పొందే వాహనాల జాబితాలోకి హైబ్రీడ్, విద్యుత్ వాహనాలను చేర్చాలన్నదే ఈ ప్రతిపాదన. 

Latest Videos

కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) సామర్థ్యానికి రూ.10 వేల చొప్పున ఇన్సెంటివ్ అమలులోకి తేవాలని ప్రతిపాదన రూపుదిద్దుకున్నది. స్ట్రాంగ్ హైబ్రీడ్ వాహనాలతోపాటు ఫ్లగ్ ఇన్ హైబ్రీడ్ సహా అన్ని విద్యుత్ వాహనాలకు ఈ సూత్రం అమలులోకి వస్తుంది. 

బస్సులు మినహా ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) అమర్చే హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని భారీ పరిశ్రమలశాఖ అధికారి ఒకరు తెలిపారు. భారీగా ఇన్సెంటివ్ లు ఇచ్చినా ఆపరేషనల్ సేవింగ్స్ ద్వారా మూడేళ్లలోనే భర్తీ చేసుకోవచ్చునని ప్రభుత్వం భరోసాతో ఉంది. 

ఇంతకుముందు 2017లో హైబ్రీడ్ వాహనాలపై రాయితీలు ఎత్తేసిన కేంద్రం వాటిని 28 శాతం శ్లాబ్ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. అంతటితో ఆగక 15 శాతం అదనపు సస్ విధించడంతో మొత్తం పన్ను 43 శాతానికి పెరిగింది. దీనికి భిన్నంగా విద్యుత్ వాహనాలపై పన్ను కేవలం 12 శాతం మాత్రమే విధిస్తోంది. 2030 నాటికి పూర్తిగా విద్యుత్ వినియోగ కార్లను మాత్రమే తయారు చేయడాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సర్కార్ ముందుకెళ్లింది. 

ఈ క్రమంలో జపాన్ ఆటోమేజర్లు సుజుకి, టయోటా, హోండా సంస్థల యాజమాన్యాలు కేంద్రాన్ని కలిసి హైబ్రీడ్ వాహనాలను, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను విద్యుత్ వాహనాల జాబితాల పరిధిలో ప్రోత్సహించాలని కోరారు. 

జపాన్ సంస్థల ప్రతిపాదనలను కానీ దేశీయ ఆటో దిగ్గజాలు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వ్యతిరేకించాయి. ఇది పూర్తిగా విద్యుత్ వాహనాల్లోకి మార్చాలన్న ప్రతిపాదనకు భిన్నమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 

ప్రభుత్వ పాలసీ ప్రకారం విద్యుత్ బస్సుల్లోని బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్)పై రూ.20 వేల రాయితీ కల్పించాల్సి ఉంటుంది. దీన్ని ఆరేళ్లలో రికవరీ చేసుకోవచ్చునని ప్రభుత్వ అంచనా. ఇది కాంపిటీటివ్ బిడ్డింగ్ గెలుచుకున్న వారికే కేటాయించాలన్నది ప్రభుత్వ అభిమతం. 

ఇటువంటి ప్రతిపాదన విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాలపై తీవ్రంగా ఉంటుందని పరిశ్రమ వర్గాల కథనం. ద్విచక్ర వాహనాల స్పీడ్ 40-45 కిమీ పర్ అవర్ ఉంటుంది. కొన్నింటి స్పీడ్ 60-70 కిమీ పర్ అవర్ ఉంటుంది.

లిథియం బ్యాటరీ వినియోగించే బైక్‌లు, స్కూటర్లకు ఒక కిలోవాట్ హవర్‌పై రాయితీ రూ.22 వేలు కల్పించింది. కానీ ఫేమ్-2లో రూ.11 వేలకు తగ్గించడంతో విద్యుత్ వినియోగ బైక్‌లు, స్కూటర్ల ధరలు పెరుగుతాయి. 


ఇదిలా ఉంటే కాలుష్య రహిత విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తలపెట్టిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌ ఇండియా) రెండో దశ పథకానికి ఈ నెలలో కేంద్ర మంత్రి వర్గ ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం.

పర్యావరణ హితం కోసం ఐదేళ్ల కాలానికి రూ.5,500 కోట్ల వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. వివిధ విభాగాల్లోని విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాలకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు, పార్కింగ్‌ ఫీజుల్లో మినహాయింపు ఇవ్వనున్నారు. 

‘సంప్రదాయ వాహనాలపై రూ.500-25,000 వరకు పన్ను విధిస్తామనే వివాదాస్పద ప్రతిపాదనతో పాటు ఫేమ్‌-2 పథకం అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ద్విచక్రవాహనాలపై రూ.25వేలు, త్రిచక్ర వాహనాలపై రూ.40 వేలు, కార్లపై రూ.50 వేల వరకు సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది’అని సదరు అధికారి తెలిపారు. ఈ పథకాన్ని భారీ పరిశ్రమల శాఖ అమలు చేయబోతోంది.
 

click me!