లక్ష విద్యుత్ వెహికల్స్ సేల్స్ పక్కా: కానీ ‘ఫేమ్-2’పై కన్‌ఫ్యూజన్

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 12:13 PM IST
Highlights

రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కార్లు, బైక్‌ల యజమానులు ఠారెత్తిపోతున్నారు. విద్యుత్ వాహనాల కొనుగోళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్రం ‘ఫేమ్-2’ విధానం ప్రకటిస్తే విద్యుత్ వినియోగ వాహనాల విక్రయాలు లక్ష దాటతాయని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ పేర్కొన్నారు. కానీ కేంద్రం మాత్రం విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన.. ‘ఫేమ్2’ ప్రకటనపై మీనమేషాలు లెక్కిస్తోంది. 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 74 వేల విద్యుత్ వాహనాల విక్రయాలు జరుగుతాయని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫేమ్-2’పై గందరగోళం నెలకొన్నదని ఎస్ఎంఈవీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ గందరగోళాన్ని తొలగిస్తే డిమాండ్‌కు కొదవ లేదని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 56 వేల విద్యుత్ వాహనాలు విక్రయిస్తే, 2016 - 17లో కేవలం 25 వేల విద్యుత్ వాహనాలే విక్రయించామని ఎస్ఎంఈవీ పేర్కొన్నది. 

ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఒకవేళ ఫేమ్-2 స్కీం అమలులోకి వస్తే ఏప్రిల్ నుంచి విద్యుత్ వాహనాల తయారీపై ఆటోమొబైల్ సంస్థలు ద్రుష్టిని కేంద్రీకరించే వారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాల విక్రయం లక్ష యూనిట్లు దాటుతాయి’ అని చెప్పారు. కానీ ‘ఫేమ్-2’పై గందరగోళం వల్ల విద్యుత్ వాహనాల విక్రయం 74 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు.

విద్యుత్ వాహనాల తయారీ, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘ఫేమ్-2’ విధానం అమలులోకి తెస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. ఈ నెలాఖరుతో భారతదేశంలో ‘ఫేమ్-1’ స్కీమ్ గడువు ముగిసిపోతుంది. ఈ నెల 7,8 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘మూవ్’ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్’లో ఫేమ్ -2 పథకాన్ని ప్రకటిస్తారని యావత్ ఆటోమొబైల్ సంస్థలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 

వాస్తవంగా ఫేమ్ మొదటి విడుత స్కీమ్ గత ఏప్రిల్ నెలాఖరుతోనే ముగిసింది. కానీ ప్రభుత్వం రెండోదశ ఫేమ్ పథకం విధి విధానాలను రూపొందించే వరకు సెప్టెంబర్ నెల వరకు ఆరు నెలల పాటు ఫేమ్ ఫేజ్ 1 గడువును పొడిగించారు. తొలుత ఫేమ్ ఫేజ్ 1 పథకాన్ని గతేడాది మార్చి వరకు రెండేళ్ల కోసం పొడిగించారు. కానీ తర్వాత రెండుసార్లు పొడిగించడంతో మార్చి నెలాఖరు వరకు స్కీంను పొడిగించింది కేంద్రం.

ఆటోమొబైల్ పరిశ్రమ రెండోదశ ‘ఫేమ్’ స్కీం అమలు కోసం ఐదేళ్ల పాటు అన్ని రకాల విద్యుత్ వాహనాల (కార్లు, మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు) కొనుగోలుపై ప్రభుత్వం సబ్సిడీ ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో నడిపే విద్యుత్ బస్సుల కోసం పన్నులతోపాటు అన్ని రకాల రాయితీలు కల్పిస్తుందని భావించారు. పర్యావరణాన్ని దెబ్బ తీసే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు గ్రీన్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సుమారు 35 వేల విద్యుత్ వాహనాలను విక్రయించామని చెప్పారు. అత్యధికంగా ద్విచక్ర విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయగా, 700 కార్లు అమ్ముడు పోయాయి. 

గత రెండేళ్లలో పలు ఆటోమొబైల్ సంస్థల విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాల్లో చార్జీంగ్ నాణ్యత పెంపొందించేందుకు  యాసిడ్ ఆధారిత బ్యాటరీలకు బదులు లిథియం ఐకాన్ బ్యాటరీలను వినియోగించడం ప్రారంభించారని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ఇది కార్లు, మోటార్ బైక్ ల కొనుగోళ్లలో వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించిందని చెప్పారు. 

అయితే పెట్రోల్ వేరియంట్ మోటార్ బైక్ లతో పోలిస్తే విద్యుత్ వాహనాల కొనుగోలు వ్యయ భరితం అన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఇంధన డిమాండ్ నేపథ్యంలోనైనా విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం స్వల్పకాలికంగానైనా ఇన్‌సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ స్పష్టం చేశారు.  
 

click me!
Last Updated Sep 24, 2018, 12:13 PM IST
click me!