ఉత్సాహ వంతులంతా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభించొచ్చు!

By sivanagaprasad kodati  |  First Published Nov 11, 2018, 3:54 PM IST

ఆసక్తి, ఉత్సాహం కల వారంతా తమ పరిధిలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వం కూడా తొమ్మిది నగరాల పరిధిలో ప్రతి మూడు కిలో మీటర్లకు ఒకటి చొప్పున, 11 హైవేలపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది.


ప్రభుత్వ విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఎవరైనా ప్రారంభించొచ్చు. చార్జింగ్ స్టేషన్ ప్రారంభించడానికి లైసెన్సు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనవసరం లేదు. కాకపోతే విద్యుత్ వాహనదారులపై విధించే చార్జిపై మాత్రం పరిమితి ఉంటుంది.

కాలుష్య నియంత్రణ లక్ష్యంగా విద్యుత్ వినియోగ వాహనాలను ప్రోత్సహించ తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ప్రారంభ దశలో విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు నిబంధనలు గానీ, అర్హతలు గానీ ఖరారు చేయలేదు.

Latest Videos

కానీ ఆయా చార్జింగ్ స్టేషన్ల నిర్వహణలో విద్యుత్ మంత్రిత్వశాఖ రూపొందించిన ప్రమాణాలను పాటిస్తే సరి. ఆయా ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే చాలు సదరు చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించుకోవచ్చు.

ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఓలా అండ్ ఉబేర్ క్యాబ్ సర్వీస్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్టార్టప్‌లు దేశంలో విద్యుత్ ఇంధన చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కనెక్టివిటీ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. తద్వారా అవసరమైన మేరకు విద్యుత్ పొందే వెసులుబాటు కలిగి ఉండాలని పేర్కొన్నారు. 

విద్యుత్ వాహనాల చార్జీంగ్ స్టేషన్లలో విద్యుత్ వాడకాన్ని బట్టి విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ల ఆదేశాల మేరకు విద్యుత్ చార్జీలు ఖరారు చేస్తాయి. సగటున సరఫరా చేస్తున్న విద్యుత్ చార్జిలపై 15 శాతం రాయితీ కల్పించాల్సి ఉంటుంది. విద్యుత్ వాహనాల యజమానులకు కూడా చార్జింగ్‌లో ఇదే రాయితీని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి. 

ఈ ఏడాది ప్రారంభంలోనే 2003 విద్యుత్ చట్టానికి అనుగుణంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా లైసెన్స్ అవసరం లేదంటూ కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ప్రతినిధి అలేఖ్య దత్తా స్పందిస్తూ విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం ధ్రువీక్రుత చార్జీలపై సర్వీస్ చార్జీలు 30 నుంచి 40 శాతం వరకు వసూలు చేయగలిగితేనే వ్యాపారం లాభసాటిగా ఉంటుందన్నారు. 

శరవేగంగా వాహనాల వినియోగదారులు విద్యుత్ ఆధారిత వాహనాలకు మళ్లేలా విద్యుత్ ఆధారిత వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాదాన్యం ఇస్తున్నది. చిన్న పారిశ్రామికవేత్తలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వెసులుబాటు లభిస్తుంది.

ఢిల్లీ, పుణె, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ తోపాటు తొమ్మిది నగరాల పరిధిలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను కూడా కేంద్రం ఎంపిక చేసింది. ఆయా స్థలాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పైలట్ ప్రాతిపదికన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తాయి. 

ఇంకా 11 బిజీ హైవేలపై ప్రతి 25కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం స్థలాలను ఎంపిక చేసింది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర సంస్థలు ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది నగరాల పరిధిలో విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభించనున్నాయి.

click me!