వచ్చే నెల్లో భారత విపణిలోకి‘హోండా సివిక్‌’

By rajesh yFirst Published Feb 23, 2019, 12:41 PM IST
Highlights

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా భారత దేశ మార్కెట్లోకి పదో తరం మోడల్ కారు ‘సివిక్’ సెడాన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రీ బుకింగ్స్ కోసం వస్తున్న స్పందన తమను ఆనందింప జేస్తున్నదని హోండా కార్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు. 

న్యూఢిల్లీ: కార్ల ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరం కమ్ సెడాన్ మోడల్‘హోండా సివిక్‌’కారును వచ్చేనెల ఏడో తేదీన మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది. గ్రేటర్‌ నోయిడాలోని సంస్థ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి జరుగుతుందని తెలిపింది. పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లలో ఈ కొత్త సివిక్‌ అందుబాటులోకి రానున్నది. దీని ధర సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

1.8 లీటర్‌ ఐ–వీటీఈసీ పెట్రోల్‌ ఇంజిన్, 1.6 లీటర్‌ ఐ–డీటీఈసీ డీజిల్‌ ఇంజిన్లతో నూతన కారు విడుదల కానున్నది. సిక్స్ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్, లీటర్‌కు 26.8 కిలోమీటర్ల మైలేజీ ఈ కారు ప్రత్యేకతలని పేర్కొన్నది. తొలిసారి భారతదేశంలో డీజిల్ వేరియంట్ కారును మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. 

హోండా కార్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రీ–లాంచ్‌ దశలోనే ఈ కారుకు ఊహించని స్పందన లభిస్తోంది. అంచనాల కంటే అధిక స్థాయిలో ప్రీ–బుకింగ్స్‌ జరిగాయి. అసాధారణ స్థాయిలో ప్రీ బుకింగ్ దశలో వస్తున్న రెస్సాన్స్ ఉబ్బి తబ్బిబ్బు చేస్తోంది. వచ్చే నెల 7న కారును మార్కెట్లో విడుదల చేస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

కొత్త హోండా సివిక్ కారు కోసం బుకింగ్ చేసుకున్న వారు మూడు వారాలు వేచి ఉండాల్సి ఉంటుందని హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. నూతన తరం హోండా సివిక్ పూర్తిగా రిఫైన్డ్ డిజైన్‌తో ‘యూత్’ఫుల్‌గా క్యారీ ఫార్వార్డ్ చేసేందుకు, స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. పాత తరం హోండా సివిక్ కారు డిజైన్ మొత్తం మార్చేశారు. 

హోండా సివిక్ కారులో డ్రిల్స్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు అదనంగా ఉన్నాయి. సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఐవరీ లెథర్ సీట్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ ఇగ్నిషన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. సిక్స్ ఎయిర్ బాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఏజిల్ హాండ్లింగ్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ క్లైంబ్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ప్యాసింజర్ లేన్ వాచ్ కెమెరా కూడా అమర్చారు. 

click me!