అనస్థీషియా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు .. బెంగాల్‌ నుంచి విశాఖకు, ఒక్కొక్కటి రూ.300

By Siva Kodati  |  First Published May 18, 2023, 9:33 PM IST

విశాఖలో అనస్థీషియా ఇంజెక్షన్లు పట్టుబడటం కలకలం రేపింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 3300 పెంటజోన్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు


విశాఖలో అనస్థీషియా ఇంజెక్షన్లు పట్టుబడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలను విశాఖ నగర పోలీస్ కమీషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరించారు. అనస్థీషియా ఇంజక్షన్లు, గంజాయి విక్రయిస్తున్న ముఠాలను అదుపు తీసుకున్నామని సీపీ తెలిపారు. వీరి వద్ద నుంచి ఇంజెక్షన్లు , గంజాయితో పాటు మొబైల్ రికవరీ యాప్ ద్వారా వంద స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. సెబ్, టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల దాడుల్లో ఈ వ్యవహారం బయటపడిందన్నారు. 

గడిచిన రెండు రోజుల్లో మూడు కేసుల్లో పెంటజోన్ లేక్ టోట్ (60 బాక్సులు) 7 వేలు ఏంపిల్స్  స్వాధీనం చేసుకున్నామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. పట్టుబడ్డ అనస్తటిక్ డ్రగ్ పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్  నుంచి తీసుకు వచ్చి అమ్ముతున్నారని సీపీ తెలిపారు. అయితే ఇవి అనధికారికంగా అమ్మడానికి వీలులేదని, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరాదని, ఆ మత్తును  తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని  కమీషనర్ చెప్పారు. సీతమ్మధార, పెందుర్తి పరిధిలలో పెంటజోన్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న జి ఉమా మహేష్, బి వెంకటేష్‌లను సెబ్ అధికారులు  అదుపులోకి తీసుకొని  3300 పెంటజోన్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారని సీపీ తెలిపారు. 

Latest Videos

నిందితుడు  ఉమామహేష్ ఇంట్లో సోదాలు చేస్తే ఇవి లభించాయన్నారు. ఒక్కోక్కటి రూ.30కి కొని రూ.300కు అమ్ముతున్నారని, ఈ కేసుల్లో 10మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అలాగే అల్లిపురం ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు  దాడులు చేసి రెండు కేసుల్లో  ఆరుగురిని అదుపులోకి తీసుకొని భారీగా పెంటజోన్ ఇంజక్షన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు త్రివిక్రమ్ వర్మ చెప్పారు. మొబైల్ రికవరీ యాప్ ద్వారా సుమారు రూ.20 లక్షల విలువగల స్మార్ట్ ఫోన్ లను (చోరీ, పోగొట్టుకున్న) సిసిఎస్ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారని సీపీ తెలిపారు. పై కేసుల దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన అధికారులను, సిబ్బందిని త్రివిక్రమ్ వర్మ అభినందించారు.

click me!