గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర్ ఘాట్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. కాగా, ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. గత నాలుగు రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. యువతిపై అత్యాచారం చేసిన కృష్ణ, వెంకట్ రెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు వారి కోసం జల్లెడ పడుతున్నారు.
ఇదిలావుంటే, ప్రధాన నిందితుడు కృష్ణ గత నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అకస్మాత్తుగా అతను తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యాడు.
తన ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అతను ప్రత్యక్షమయ్యాడు. స్థానికులు అతన్ని చూసి కేకలు వేశారు. దాంతో గూడ్స్ రైలు ఎక్కి కృష్ణ పరారయ్యాడు. దాంతో పోలీసులు అతని కోసం రైల్వే ట్రాక్, రైల్వే యార్డు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కృష్ణ రైల్వే వంతెనను నివాసం చేసుకుని ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలితో పాటు ఆమెతో ఉన్న యువకుడి సెల్ పోన్లు నిందితులు లాక్కున్నారు. వాటిని సీతానగరంలో తాకట్టు పెటటారు ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
గ్యాంగ్ రేప్ కేసులో వెంకటేష్ తో పాటు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని కోసం పోలీసులు వేటాడుతున్నారు.