గుంటూరులో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ మహిళతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. వట్టుబడిన విటుల్లో అమెరికా వెళ్లడానికి సిద్ధపడిన బిటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టును నగరంపాలెం పాలెం పోలీసులు రట్టు చేశారు. యాప్ ద్వారా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఓ నకిలీ పోలీసుతో పాటు అమెరికాలో చదువుకు వెళ్లడానికి సిద్ధమైన ఓ విద్యార్థి కూడా ఉన్నాడు. గుంటూరు పశ్చిమ డీఎస్పీ కె. సుప్రజ అందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.
క్రోసూరు మండలానికి చెందిన ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోంది. ఓసారి ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయినా ఆమె బుద్ధి మారలేదు. ఏటీ అగ్రహారంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఆమె వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆమెకు పాత గుంటూరుకు చెందిన నాగేశ్వర రావు యాప్ ను ఉపయోగించి అమ్మాయిలను పంపిస్తున్నాడు.
భవానీపురానికి చెందిన పుట్టపాకుల నాగరాజు అలియాస్ పండు డ్రైవర్ గా పనిచేశాడు. ఐదేళ్ల క్రితం ఓ డిఎస్పీకి వ్యక్తిగత పనుల కోసం వెళ్తున్న క్రమంలో అతని కారుకు నాగరాజు నాలుగు రోజులు డ్రైవర్ గా వెళ్లాడు. అప్పుడు పోలీసుల వ్యవహారశైలిని గమనించాడు. ఏటీ అగ్రహారంలోని ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న నాగరాజు మహిళ వద్దకు వెళ్లి తాను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని చెప్పాడు.
తనకు నెలక రూ.5 వేలు ఇవ్వాలని, లేకుంటే అధికారులకు చెప్పి పట్టిస్తానని బెదిరించాడు. అలా మూడు సార్లు ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో విషయాన్ని పసిగట్టిన పోలీసులు సిఐ హైమారావు తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, ముగ్గురు మహిళలను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో నిర్వాహకురాలి వద్ద డబ్బు తీసుకోవడానికి వచ్చిన నకిలీ పోలీసులు నాగరాజును కూడా అరెస్టు చేశఆరు.
వ్యభిచార గృహానికి వచ్చిన విటుడు రేపల్లెకు చెందినవాడు. అతను బిటెక్ పూర్తి చేశాడు. కొద్ది రోజుల్లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. యాప్ ద్వారా యువతులను గుర్తించి గుంటూరు వచ్చి వ్యభిచార గృహంలో ఓ మహిళతో ఉండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నాగేశ్వర రావు పరారీలో ఉన్నాడు.