Latest Videos

ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేదా..? చంద్రబాబు, పవన్‌, జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ని ఏం చేద్దామనుకుంటున్నారు..?

By Galam Venkata RaoFirst Published Jun 17, 2024, 10:43 PM IST
Highlights

‘‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి మంచి సమయం. చంద్రబాబు తలచుకుంటే ప్రత్యేక హోదా కూడా సాధించడం సులువే. సులభంగా ప్రత్యేక హోదా సాధించేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి దొరకదు. కేబినెట్  పదవుల కోసం కాకుండా ప్రత్యేక హోదా సాధన కోసం ఈ అవకాశాన్ని వాడుకోవాలి’’

ఈసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. దీంతో ఎన్‌డీయే కూటమిలోని తెలుగుదేశం, జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీల మద్దతు అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో 32 సీట్ల కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. 

‘‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి మంచి సమయం. చంద్రబాబు తలచుకుంటే ప్రత్యేక హోదా కూడా సాధించడం సులువే. సులభంగా ప్రత్యేక హోదా సాధించేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి దొరకదు. కేబినెట్  పదవుల కోసం కాకుండా ప్రత్యేక హోదా సాధన కోసం ఈ అవకాశాన్ని వాడుకోవాలి’’

- వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డిలాంటి వారు ఇటీవల తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 

గతంలో వైసీపీకి 22 ఎంపీల బలం ఉన్నా.. బీజేపీకి 300 స్థానాలు రావడంతో ఏపీకి ప్రత్యేక హోదా అడగలేకపోయామని జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు పదేపదే చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చినట్లు తమకుగానీ అవకాశం వచ్చి ఉంటే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసి సాధించేవారమని చెబుతున్నారు. 

 

వైసీపీ భవిష్యత్తు అజెండా ఇదేనా...
ప్రత్యేక హోదాపైనే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి తెచ్చేలా కనిపిస్తోంది. గత ఐదేళ్లూ ప్రత్యేక హోదాపై నోరెత్తని జగన్‌ ప్రభుత్వం... ఓటమి పాలై అధికారం కోల్పోయాక హోదాపైనే ప్రధానంగా రాగం వినిపిస్తోంది. హక్కులపైనే మాట్లాడుతోంది. వైసీపీ తీరు చూస్తుంటే.. రానురాను హోదానే ప్రధాన అజెండాగా పోరాటానికి సిద్ధమయ్యేలా ఉంది.

ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన వైసీపీ... ఇప్పటికీ తన తప్పులను గ్రహించండం లేదు. అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమికి తమ తప్పిదాలే కారణమని ఆ పార్టీ అగ్రనాయకత్వం, అధినేత జగన్‌ రియలైజ్‌ కానట్లే కనిపిస్తోంది. ప్రజలు పొరపాటున కూటమిని ఎన్నుకున్నట్లుగా మాట్లాడుతున్నారు.  

2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సాధనే తమ ప్రధాన అజెండా అని వైసీపీ మాట్లాడింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై తీవ్రమైన ఒత్తిడి చేసింది. తమను 25కి 25 పార్లమెంటు స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని వైసీపీ ప్రగల్బాలు పలికింది. అయితే, ప్రజలు 22 లోక్‌సభ స్థానాలు, 151 అసెంబ్లీ స్థానాల్లో అఖండ విజయాన్ని వైసీపీకి కట్టబెట్టినా చేసిందేమీ లేదు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం, అదే సంక్షేమం, అభివృద్ధి అన్నట్లు మాట్లాడటం, ప్రభుత్వం కార్యాలయాలకు రంగులు వేయడం, కేంద్ర నిధులతోచేపట్టిన పథకాలకు, ప్రజల ఇళ్లకు స్టిక్కర్లు వేయడం తప్ప మరొకటి చేసింది లేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు (2019-2024) పార్లమెంటులో బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా మద్దతు తెలిపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ అనేకసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా సొంత అజెండా కోసం సాగిలపడటం తప్ప... రాష్ట్రానికి సాధించిందేమీ లేదు. ఇన్నాళ్లు గమ్మున ఉన్న వైసీపీ ఇప్పుడు హోదా రాగం అందుకోవడం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఇరుకున పెట్టడానికే తప్ప వేరొకటి కాదు. 

ఏపీకి హోదా తెరపైకి వచ్చిందిలా...

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపగా.. జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 

అప్పటివరకు 23 జిల్లాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్... 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాలతో కూడిన తెలంగాణగా ఏర్పడ్డాయి. విభజన నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే, తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం హోదాను అమలు చేయలేదు. ఇటు నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా పోరాటం చేయలేదు. తొలుత ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. ప్రత్యేక హోదాకి, ప్యాకేజీకి పెద్ద తేడా ఏమీ లేదన్నట్లు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. అప్పట్లో బీజేపీ, జనసేనతో టీడీపీ కూటమిగా ఉంది. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోదా హామీని నెరవేర్చలేదు. 
ఇదే అంశాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ పూనుకోవడంతో టీడీపీ రివర్స్‌ అయింది. కూటమిలో నుంచి బయటకు వచ్చింది. కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా  వైదొలిగింది. మోదీకి, అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రత్యేక హోదా కల్పించకపోతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామంది. అయితే, ఏం చేసినా ఆ ఐదేళ్లు హోదాపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 

ఆ తర్వాత 2019లో హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. అప్పటికే హోదాపై బలంగా గళం వినిపించిన వైసీపీ కూడా అదే అంశాన్ని ప్రజల ముందుంచింది. అనూహ్యంగా ఏపీ ప్రజలు 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో వైసీపీని గెలిపించారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లిన టీడీపీ 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు 2019లో పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిందే కానీ వైసీపీ ఎప్పుడూ ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో బలంగా మాట్లాడింది లేదు. పైపెచ్చు కేంద్రం మద్దతుతో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రాజధానిని నీరుగార్చింది. అమరావతిని పక్కనపెట్టేసి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇలాంటి పిచ్చి పనులే 2024 ఎన్నికల్లో వైసీపీ పతనానికి కారణమయ్యాయి. 

జనసేన పోరాటం...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జనసేన కూడా గళం వినిపించింది. 2014 నుంచి 2019 వరకు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన... ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో స్పందించింది. హోదా సాధాన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వామపక్షాల మద్దతుతో పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. హోదాపై బీజేపీ మోసం చేసిందని.. హోదా సాధించలేనప్పుడు కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు కొనసాగుతోందని జనసేన ప్రశ్నించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఒక్క అసెంబ్లీ స్థానానికే జనసేన పరిమితమైంది. ఆ తర్వాత బీజేపీతో బంధాన్ని కొనసాగించిన జనసేన.. హోదా గురించి మళ్లీ మాట్లాడలేదు. 2024లో ఏపీలో ఎన్‌డీయే కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించారు పవన్‌ కల్యాణ్‌. టీడీపీ 2 కేంద్ర కేబినెట్‌ పదవులు తీసుకున్నా.. జనసేన ఎలాంటి పదవులు తీసుకోలేదు. ఇప్పటివరకు హోదాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

ఈసారైనా సాధ్యమేనా..?

మరి, ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ 3.0 సర్కార్‌లో కీలకమైన చంద్రబాబు... ఈసారైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారా..? అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురాగలరా..? ఎన్నికలకు ముందు చెప్పినట్లు ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను పరుగులు పెట్టించగలరా..? అనే ప్రశ్నలు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అదే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే పదేళ్లు ఏపీకి హోదా ఇస్తామని ప్రకటించింది. అయితే, ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌, దాని కూటమి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కడప పార్లమెంటు నుంచి పోటీ చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా ఇండి కూటమి అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు.

click me!