ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాటి నుండి యాప్ ఆధారిత హాజరు విధానం అమలు చేసింది ప్రభుత్వం. అయితే ఈ యాప్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో యాప్ డౌన్ లోడ్ కావడం లేదని కూడా ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాటి నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి వచ్చింది. ఈ యాప్ ఆధారిత హాజరు విషయమై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటలలోపు ఉపాధ్యాయులు స్కూల్ కు హాజరు కావాలి. స్కూల్ కు హాజరైన వెంటనే ఫేస్ రికగ్నజేషన్ తో పాటు పోటోను కూడా విద్యా శాఖ సూచించిన యాప్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయులు వెంటనే ఈ యాప్ లో లాగిన్ కావాలని విద్యాశాఖ కోరింది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా సగం వేతనం కట్ చేస్తామని కూడా విద్యాశాఖ తేల్చి చెప్పింది.
undefined
ఈ యాప్ ఆధారంగానే ఉపాధ్యాయుల హాజరును విద్యాశాఖ పరిగణించనుంది. అయితే స్మార్ట్ ఫోన్లు లేని ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యా శాఖ సూచించిన యాప్ ను ఉపాధ్యాయులు డౌన్ లోడ్ చేసుకొన్న కూడా టెక్నికల్ సమస్యలతో ఈ యాప్ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మిడ్ డే మీల్స్ తో పాటు ఇతర విషయాలపై యాప్ లను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచే క్రమంలోనే ఈ తరహా విధానాన్నిఅమలు చేస్తుందని ఏపీటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.
ప్రభుత్వమే బయోమెట్రిక్ ను స్కూళ్లలో ఏర్పాటు చేస్తే ప్రయోజనంగా ఉంటుందని కూడా ఉపాధ్యాయులు కోరుతున్నారు స్టార్ట్ ఫోన్లలో ఈ తరహాలో యాప్ ను డౌన్ లోడ్ చేసకోని హాజరు నమోదు చేసుకోవాలని కోరడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను కోరుతున్నాయి. అయినా కొందరు ఉపాధ్యాయులు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొంటే సాంకేతిక సమస్యలు వస్తున్నట్టుగా ఉపాధ్యాయులు చెబుతున్నారని ఆ కథనం ప్రసారం చేసింది. మరో వైపు ఇప్పటికే విద్యార్ధుల హాజరుపై కూడ యాప్ ను కొనసాగిస్తున్న విషయాన్ని ఉపాధ్యాయలు గుర్తు చేస్తున్నారు.