Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్: పొత్తులూ ఎత్తులూ... కేసీఆర్ భవిష్యత్తు వూహానికి పునాది

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు విపక్షాలకు షాకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ తప్ప ఇతర పార్టీలు మద్దతును ఇవ్వలేదు. 

huzurnagar bypoll:kcr strategies for telangana future politics
Author
Hyderabad, First Published Oct 6, 2019, 9:07 AM IST

హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21 జరిగే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఇతర పార్టీల మద్దతును కూడగడుతూ దూసుకుపోతోంది. కాంగ్రెస్ మాత్రం ఈ విషయం ఒక్క అడుగు వెనుకపడింది.

ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.ఇదిలా ఉంటే ఈసీ మాత్రం టీఆర్ఎస్ కు షాకిచ్చింది. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్ ను నియమించింది.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ వారంలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు భవిష్యత్తు సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సీపీఐ, వైఎస్ఆర్‌సీపీ మద్దతును టీఆర్ఎస్ కూడగట్టింది. టీజేఎస్ మద్దతు మాత్రమే కాంగ్రెస్‌కు లభించింది. ఈ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురైన సీపీఎం మద్దతును టీడీపీ కోరింది. అయితే ఈ విషయమై సీపీఎం తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వామపక్షాలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ నియోజకవర్గంలో సీపీఐ పోటీకి దిగలేదు. దీంతో సీపీఐ మద్దతును టీఆర్ఎస్ కోరింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై ఆ పార్టీ చర్చించి  టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించింది. భవిష్యత్తులో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడం కోసం పావులు కదుపుతోంది.ఈ తరుణంలోనే రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిష్టులతో పొత్తు కుదుర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతును కోరినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గం కూడ టీఆర్‌ఎస్ కు మద్దతు ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడ చివరికి సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించాల్సి వచ్చింది. దీని వెనుక రాజకీయ కోణం కూడ ఉందని సమాచారం. 

మున్సిఫల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు కారణంగా కొన్ని స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం దక్కుతోంది. అంతేకాదు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లాంటి పదవులు దక్కే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి గట్టు శ్రీకాంత్ రెడ్డికి గణనీయమైన ఓట్లు లభించాయి. సుమారు 25 వేలకు పైగా ఓట్లు శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య స్నేహా సంబంధాలు విస్తరించాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ తరుణంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ స్నేహా హస్తాన్ని టీఆర్ఎస్ కోరింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా వైసీపీ శనివారం నాడు ప్రకటించింది. వైసీపీ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించారు. 

2018 ఎన్నికల్లో వైసీపీ మాత్రం బహిరంగంగా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించలేదు. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ మాత్రం టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించింది.ఈ పరిణామం రాజకీయంగా టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మాత్రమే మద్దతు దక్కింది. సీపీఐ, టీజేఎస్, టీడీపీ, సీపీఎం, జనసేన పార్టీల మద్దతును కాంగ్రెస్ కోరింది. టీజేఎస్ మాత్రమే కాంగ్రెస్ కు మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలను వేదికగా చేసుకొంటామని ఆ పార్టీ ప్రకటించింది.

సీపీఎం తన అభ్యర్ధిని బరిలోకి దింపింది. ఆ పార్టీ అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై సీపీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో తమ అభ్యర్ధి చావా కిరణ్మయికి మద్దతివ్వాలని తమ్మినేని వీరభద్రాన్ని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కోరారు. అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని రమణకు వీరభద్రం చెప్పారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు భేటీ అయ్యారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి పద్మావతికి మద్దతివ్వాలని హనుమంతరావు కోరారు. అయితే ఈ విషయమై జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈసీ వెంటనే స్పందించింది. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును రెండు రోజుల క్రితం హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసింది. భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ను సూర్యాపేట జిల్లా ఎస్పీగా  బదిలీ చేసింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వ్యయ పరిశీలకుడిగా సురేష్ కుమార్ ను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మరునాడే ఈసీ ఈ నిర్ణయాలు తీసుకొంది. ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ కు షాక్ ను కలిగించాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మె
ప్రభుత్వంలో ఆర్టీసీని వీలీనం చేసుకోవాలనే ప్రదాన డిమాండ్ సహా మరో 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నెల 5వ తేదీ ఉదయం నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం వరకు విధుల్లో చేరని కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కార్మికులు విధుల్లో చేరలేదు.

ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడుపుతోంది. మెట్రో ఎక్కువ ట్రిప్పుల్లో రైళ్లను నడుపుతోంది. ప్రభుత్వం బెదిరింపులకు తాము భయపడేది లేదని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.

ఆర్టీసీ జేఎసీ నేతలు కూడ తమ కార్యాచరణను ప్రకటించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios