Asianet News TeluguAsianet News Telugu

తల పగులగొడుతారా: పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ మీద చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు స్వాగతం చెప్పడానికి వస్తే తలపగులగొడుతారా అని అడిగారు.

Chandrababu expresses anguish at police
Author
Chittoor, First Published Nov 7, 2019, 8:22 AM IST

చిత్తూరు: తిరుపతి పర్యటన సందర్భంగా తాను ఎయిర్ పోర్ట్ నుంచి సభా వేదిక వద్దకు బయల్దేరినప్పుడు స్వాగతం చెప్పేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రగిరి సమీపంలోని ఐతవోలు వద్ద పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, 

‘‘మేము యుద్ధానికి పోవడంలేదు, ప్రభుత్వంపై దాడికి రాలేదు. నాపై అభిమానంతో స్వాగతం చెప్పేందుకు వచ్చిన యువకుడి తల పగులకొడతారా..? ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా యువతరం వస్తే అక్కసుతో రభస చేస్తారా..? చినబయలుపల్లి యువకుడు పాకాల హేమంత్ ను తీవ్రంగా గాయపరుస్తారా..?నా పాలనలో పోలీసులకు, వైసిపి పాలనలో పోలీసులకు ఎంత తేడా ..?’’ అని చంద్రబాబు అన్నారు. 

‘‘చాలామంది సీఎంలను, డిజిపిలను చూశాం. హద్దుమీరి ప్రవర్తిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. 24క్లెమోర్ మైన్ లు పేలినప్పుడే నేను భయపడలేదు. వెంకటేశ్వర స్వామే అప్పుడు నన్ను కాపాడారు. ఇప్పుడు కూడా దేనికి, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. నా పోరాటం పోలీసులపై కాదు, వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపైనే మా పోరాటం అంతా.సీఎం జగన్మోహన్ రెడ్డి మొదట్లో  ‘‘సుబ్రమణ్యం అన్నా నువ్వే సీఎస్, గౌతమ్ అన్నా నువ్వే డిజిపి, మీరే నడిపించాలి నన్ను’’ అన్నారు..

‘‘5నెలల్లోనే సుబ్రమణ్యం అన్నను గంగలో కలిపేశారు. రేపు కూడా మీ పరిస్థితి అదే..ఆయన మనస్తత్వమే అంత..మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ రాష్ట్రం కోసం ఢిల్లీలో రాజీలేని పోరాటం చేశారు. నాకు బాల్య స్నేహితుడు, కలిసి చదువుకున్నాం, నా పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాలకే గౌరవాన్ని పెంచారు. ఇన్నాళ్లు మనకు స్పూర్తి ఇచ్చారు, ఇప్పుడాయన స్ఫూర్తితో మనం పార్టీ కోసం పనిచేయాలి’’ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

‘‘పల్నాడు టైగర్ గా ప్రజల్లో ఆదరణ ఉన్న కోడెల శివ ప్రసాదరావును అక్రమ కేసులు పెట్టి పొట్టన పెట్టుకున్నారు. టిడిపి కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. భౌతికదాడులు, ఆర్ధికదాడులు చేస్తున్నారు.బాధితులపైన నాన్ బెయిలబుల్ కేసులు, నిందితులపై బెయిలబుల్ కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం.ఛలో ఆత్మకూరుకు వెళ్తుంటే నా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు. ఈ తాళ్లే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించాను’’ అని చంద్రబాబు అన్నారు. 

‘‘నేను అడిగాననే అక్కసుతోనే ప్రజావేదికను కూల్చేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ప్రతిచోటా పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు.ఇలాగే చేస్తే పులివెందుల పంపడం మిమ్మల్ని ఖాయం.తొలి 6నెలల్లనే మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి 5నెలల్లోనే ఇంతకంటే చెత్త సీఎం ఉండడనే పేరు తెచ్చుకున్నారు’’ అని ఆయన అన్నారు.

గతంలో చేసిన సీఎంలకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చాయా..? ప్రజలకు సేవలు చేసే సీఎంలనే ఇప్పటిదాకా చూశాం. ప్రజలను బాధలు పెట్టే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ప్రత్యర్ధి పార్టీలను అంతం చేయాలనే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం’’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు .

Follow Us:
Download App:
  • android
  • ios