Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్! మార్క్ రాజకీయం: తొలి ఎంపీ అభ్యర్థి ప్రకటన

టీఆర్ఎస్ పార్టీలో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించేందుకు ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటూ దూసుకుపోతున్నారు. 
 

trs working president ktr announced first mp candidate
Author
Rajanna Sircilla, First Published Jan 3, 2019, 3:49 PM IST

రాజన్న సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీలో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించేందుకు ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటూ దూసుకుపోతున్నారు. 

ముందస్తు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఆశావాహుల నుంచి వచ్చిన అసంతృప్తిని బుజ్జగిస్తూ తనదైన శైలిలో దూసుకుపోయిన కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు.  

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ ఎంపీగా బోయిన్ పల్లి వినోద్ ను ప్రకటించారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన రాబోయే ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు. వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

మరోవైపు పంచాయితీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త పనిచెయ్యాలని కేటీఆర్ కోరారు. 2019 ఎన్నికల నామ సంవత్సరమన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు అవి ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ప్రాణవాయువులాంటి వారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 71 శాతం ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే పడ్డాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి, తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని తెలియజేశారన్నారు.  

ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు.  

ట్రక్కు గుర్తు వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. 4 వేల ఓట్ల తేడాతో 10 సీట్లు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పలు  రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.  రైతుల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా పుట్టగతులుండవని ప్రధాని మోదీకి అసెంబ్లీ ఎన్నికల దెబ్బతో అర్థమైనట్లుందన్నారు. రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.   

మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు కానుకగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. 

పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలని కోరారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  

Follow Us:
Download App:
  • android
  • ios