Asianet News TeluguAsianet News Telugu

ఇది కేటీఆర్ టార్గెట్: 17 ఎమ్మెల్సీ సీట్లపై గురి

 తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే ఎమ్మెల్సీ స్థానాలను పెంచుకోవడమే ముందున్న లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మాంచి ఊపుమీద ఉన్నఆయన ఎమ్మెల్సీ పదవులపై కన్నేశారు.  
 

TRS will target 17 MLC seats soon
Author
Hyderabad, First Published Dec 14, 2018, 5:20 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే ఎమ్మెల్సీ స్థానాలను పెంచుకోవడమే ముందున్న లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మాంచి ఊపుమీద ఉన్నఆయన ఎమ్మెల్సీ పదవులపై కన్నేశారు.  

ఈసారి ఏ ఎమ్మెల్సీని ఇతర పార్టీలకు వదలకుండా ఉండేందుకు ముందస్తుగానే టీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. అందుకు గులాబీ దళపతి వ్యూహాలు రచిస్తున్నారు. 17 ఎమ్మెల్సీ స్థానాలే టార్గెట్ గా గులాబీ దళపతి ప్రణాళికలు రచిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో టికెట్లు ఆశించి పొందలేకపోయిన పార్టీ సీనియర్‌ నేతలకు, ఇతర పార్టీల నుంచి చేరిన మరికొంతమందికి ఈ పదవులు ఇవ్వాలని యోచిస్తోంది. 
 
అందులో భాగంగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు, శాసన సభ ద్వారా ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయా సంస్థల్లో 17 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నుకునే అవకాశం ఉంది. 

అందుకు తగ్గట్లుగా టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. తాజాగా శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్‌రెడ్డిలతో రాజీనామా చేయించింది. వారి రాజీనామాలను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెంటనే ఆమోదించేశారు కూడా.  

అటు మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం రాజీనామా చేయనున్నారు. ఈ ముగ్గురిలో మైనంపల్లి హన్మంతరావు శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా పట్నం నరేందర్ రెడ్డి రంగారెడ్డి స్థానిక సంస్థల కోటాలోనూ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ స్థానిక సంస్థల కోటాలోను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానాల్లో ఎన్నికలు అనివార్యం.   

అలాగే టీఆర్ఎస్ పార్టీలో పార్టీ మారిన నలుగురిపై అనర్హత వేటు వెయ్యాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన పార్టీ ఎమ్మెల్సీలు కొండా మురళి, రాములు నాయక్‌, యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయించి, తిరిగి వాటిని దక్కించుకోవాలని చూస్తోంది. 

అయితే ఆర్. భూపతిరెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థలో కోటాకింద, కొండా మురళి వరంగల్ నగర స్థానిక సంస్థల కోటా కింద, కె.యాదవరెడ్డి శాసన సభ్యుల కోటాలో, రాములు నాయక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. 

వీరి శాసన మండలి సభ్యత్వాలను రద్దు చెయ్యాలంటూ ఒకట్రెండు రోజుల్లో శాసన మండలి చైర్మన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేయనుంది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి వెంటనే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. మిగిలినవి ఎన్నికలు జరగాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే 2019 మార్చి నెలాఖరున 9 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ పొందనున్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, టి.సంతోష్ కుమార్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ,మహ్మద్ సలీం, ఎంఎస్ ప్రభాకర్ లు పదవీకాలం ముగియనుంది. 

వీటిలో ఐదుగురు శాసన సభ్యుల కోటా, పట్టభద్రలు నియోజకవర్గం నుంచి ఒకరు, ఉపాధ్యాయ నియోజవకర్గం నుంచి రెండు, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఒకరు ఉన్నారు. 

అలాగే టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి ని సైతం రాజీనామా చేయించి తిరిగి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కె.దామోదర్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికయ్యారు.   

మరోవైపు అనర్హత వేటుకు సాంకేతిక సమస్యలు అడ్డు రాకుండా ఉండేందుకు పావులు కదుపుతుంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో చేరిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చేత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి మళ్లీ అక్కడే పోటి చేయించాలని చూస్తోంది. 

మరోవైపు శాసనసభ్యుల కోటాలో వచ్చే ఏడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే మజ్లిస్‌ పార్టీతో ఎమ్మెల్సీ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎమ్మెల్సీలలో స్వామిగౌడ్, మాజీ శాసన సభ స్పీకర్లు కె ఆర్ సురేష్ రెడ్డి, మధుసూదనాచారిలకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వామిగౌడ్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చెయ్యాలని భావిస్తోంది టీఆర్ఎస్. 

మెుత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రులతో కలుపుకుని 90 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ ఈ 17 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని ముందస్తుగా రెడీ అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios