Asianet News TeluguAsianet News Telugu

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

ప్రజా కూటమి( మహాకూటమి)లోని కాంగ్రెస్, టీడీపీల మధ్య శేరి లింగంపల్లి టిక్కెట్టు విషయమై  గొడవలు ప్రారంభమయ్యాయి

tight fight for serilingampally seat between tdp and congress
Author
Hyderabad, First Published Nov 4, 2018, 3:57 PM IST


హైదరాబాద్: ప్రజా కూటమి( మహాకూటమి)లోని కాంగ్రెస్, టీడీపీల మధ్య శేరి లింగంపల్లి టిక్కెట్టు విషయమై  గొడవలు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లి టిక్కెట్టును టీడీపీకి కేటాయించకూడదంటూ మాజీ ఎమ్మెల్యే  బిక్షపతి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు  ఆదివారం నాడు   గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు.  మరో వైపు  టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు  టిక్కెట్టు కోసం పరస్పరం బాహ బాహీకి దిగారు.

2014ఎన్నికల్లో టీడీపీ తరపున  అరికెపూడి గాంధీ పోటీ చేసి విజయం సాధించారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు రాకపోవడంతో  టీడీపీ నుండి  మువ్వ సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు.  అయితే  మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  మువ్వ సత్యనారాయణ ఇటీవలనే టీడీపీలో చేరారు. శేరిలింగంపల్లి టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్నారు.

అయితే  భవ్య సిమెంట్  అధినేత  మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ శేరిలింగంపల్లి టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్నారు.   మువ్వ సత్యనారాయణ, మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌లు టీడీపీ టిక్కెట్టు కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

మువ్వ సత్యనారాయణ ఇటీవలనే అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి శేరిలింగంపల్లి టిక్కెట్టును  ఇవ్వాలని కోరారు. ఈ టిక్కెట్టు విషయమై ఇంకా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఆదివారం నాడు  మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు.  ఈ ప్రచారాన్ని మువ్వ సత్యనారాయణ వర్గీయులు అడ్డుకొన్నారు. మెనిగళ్ల పై చెప్పులు విసిరారు. మెనిగళ్ల ప్రచార వాహనాన్ని అడ్డుకొన్నారు. ప్రచారాన్ని విరమించుకోవాలని పోలీసులు మెనిగళ్లకు సూచించారు.

ఇదిలా ఉంటే  శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ఆశిస్తున్నారు. 2009లో ఈ స్థానం నుండి బిక్షపతి యాదవ్ విజయం సాధించారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి  కేటాయించకూడదని  బిక్షపతి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

తన అనుచరులతో  కలిసి బిక్షపతి యాదవ్ గాంధీభవన్ ఎదుట ఆదివారం నాడు  ధర్నా నిర్వహించారు.  ఈ సీటును  టీడీపీకి కేటాయించకూడదంటూ బిక్షపతి ఇద్దరు అనుచరులు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయమై అధిష్టానం నుండి స్పష్టమైన  హామీ ఇవ్వాలని కోరుతూ గాంధీభవన్ లో ఆందోళన సాగిస్తున్నారు.

నవంబర్ 9వ తేదీన  కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.పొత్తుల్లో భాగంగా ఈ సీటును కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ కోరుతున్న ఎక్కువ సీట్లలో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఉన్నవే.  దీంతో  శేరి లింగంపల్లిని టీడీపీ వదులుకోదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ కూడ ఈ సీటుపై  పట్టుబట్టడం కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది.

టీడీపీ బీసీల పక్షపాతిగా చెప్పుకొంటుందని... బీసీల సీటే టీడీపీ ఎందుకు కోరుతోందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ప్రశ్నిస్తున్నారు. అయితే అభ్యర్థులను ప్రకటిస్తే  పార్టీ కార్యాలయాల ముందు  ఎన్ని ఆందోళనలు జరుగుతాయో  చూడాల్సిందే.

 

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి

Follow Us:
Download App:
  • android
  • ios