Asianet News TeluguAsianet News Telugu

‘‘గూగుల్‌’’‌‌ను ఓ దొంగ ఎలా వాడాడో చూడండి

ప్రపంచంలోని ఏమూల, ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా.. ఎలాంటి సేవలు పొందాలన్నా అందరికి ఇప్పుడు గూగుల్ కావాల్సిందే. అది లేనిదే నిమిషం కూడా గడవని పరిస్థితికి లోకం తయారైంది. ఇప్పుడు అదే గూగుల్ సాయంతో ఆలయాలకు కన్నం వేశారు దొంగలు.

thieves used for google
Author
Hyderabad, First Published Nov 24, 2018, 10:37 AM IST

ప్రపంచంలోని ఏమూల, ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా.. ఎలాంటి సేవలు పొందాలన్నా అందరికి ఇప్పుడు గూగుల్ కావాల్సిందే. అది లేనిదే నిమిషం కూడా గడవని పరిస్థితికి లోకం తయారైంది. ఇప్పుడు అదే గూగుల్ సాయంతో ఆలయాలకు కన్నం వేశారు దొంగలు.

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపుపరం సమీపంలోని ఢాకూ తండాకు చెందిన కరమోత్ సంతోష్, షాద్‌నగర్‌కు చెందిన పండిత్ సూరజ్‌ ఇళ్లలో చోరీలకు పాల్పడుతుండేవారు. వీరికి సూర్యాపేట జిల్లా రామ్లా తండాకు చెందిన వంకుడోతు జాన్, ఢాకూ తండాకే చెందిన కరమోతు లచ్చీరామ్ దొంగతనాలకు సాయం చేసేవారు.

ఈ క్రమంలో ఆలయాల్లో దొంగతనం చేస్తే బాగా సంపాదించుకోవచ్చునని లచ్చీరామ్‌ ముఠా సభ్యులకు చెప్పాడు. అందుకు ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌ను వాడారు... పలు పురాతన ఆలయాలను గూగుల్ ద్వారా వెతికేవాడు.

దేవాలయాలను గుర్తించి అందులో పురాతన పంచలోహ విగ్రహాలు చోరీ చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకుంటే కోట్లు సంపాదించవచ్చని పథకం వేశాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గుండెపూడిలోని రామాలయంలో కాకతీయుల నాటి పంచలోహ విగ్రహాలున్నట్లు గుర్తించారు.

వాటిని అపహరించేందుకు గత నెల 27న సంతోష్, జాన్, లచ్చీరామ్ అక్కడికి వెళ్లారు. సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, 12 ఇంచుల సుదర్శనస్వామి, 2 ఆళ్వారులు, విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవి, కృష్ణుడు వంటి చిన్ని విగ్రహాలు, 3 వెండి కిరీటాలు చోరీ చేశారు.

దొంగతనమైతే చేశారు కానీ వాటిని అమ్మడం ఎలాగో వారికి తెలియలేదు. కాగా, మరుసటి రోజు రోజువారి పూజల నిమిత్తం ఆలయం తెరిచిన అర్చకుడు.. గుడిలో దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే గ్రామస్తుల సాయంతో మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే అబ్ధుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాలపై రాచకొండ పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో కొత్తగూడ చౌరస్తా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పండిత్ సూరజ్‌ సహా మరో పాత నేరస్థుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. నిందితుల వద్ద నుంచి రూ.3కోట్ల విలువచేసే పంచలోహ విగ్రహాలతోపాటు 16తులాల బంగారం, 1కిలో వెండి, 2 సెల్‌ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios