Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు బోల్తా: అసలుకే ఎసరు

నాతో పెట్టుకోకు, పెట్టుకుంటే చుక్కలే అనే డైలాగ్ సినిమాల్లో చాలా ఫేమస్. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ తెగ పాపులారిటీ అయిపోతుంది. ఏనాయకుడైనా  ప్రత్యర్థి నాయకుడిపై పై చేయి సాధిస్తే వాళ్లు ఇచ్చే వాడే మెుదటి పదం నాతో పెట్టుకోకు అన్నానా...పెట్టుకున్నావ్ ఏమైంది అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.

Telangana results: TDP may lose national party status
Author
Hyderabad, First Published Dec 19, 2018, 12:45 PM IST

హైదరాబాద్: నాతో పెట్టుకోకు, పెట్టుకుంటే చుక్కలే అనే డైలాగ్ సినిమాల్లో చాలా ఫేమస్. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ తెగ పాపులారిటీ అయిపోతుంది. ఏనాయకుడైనా  ప్రత్యర్థి నాయకుడిపై పై చేయి సాధిస్తే వాళ్లు ఇచ్చే వాడే మెుదటి పదం నాతో పెట్టుకోకు అన్నానా...పెట్టుకున్నావ్ ఏమైంది అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.

ఇదే డైలాగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తగిలింది. అది తెలంగాణ విషయంలో. తెలంగాణ రాష్ట్రం ఏకంగా చంద్రబాబుకు వార్నింగ్ లు ఇస్తుంది. రాష్ట్రవిభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాలను ప్రదర్శించి రెండు రాష్ట్రాల్లో మార్కులు కొట్టేద్దామని ప్రయత్నించిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. 

2014 ఎన్నికల్లో టీడీపీ కాస్తో కూస్తో స్థానాలు సంపాదించుకున్నప్పటికీ చంద్రబాబు సిద్ధాంతాలను, ఓటుకు నోటు కేసులతో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఆయనకు హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలంటే చెయ్యలేని పరిస్థితిగా తయారైంది చంద్రబాబుది. 

ఇక ఓటుకు నోటు కేసు చంద్రబాబు రాజకీయ అనుభవంపై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ రాజకీయాల్లో సైతం పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో చేసేది లేక చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వదిలి మూట ముళ్లు సర్ధుకుని అమరావతిలో వాలిపోయారని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. 

తెలంగాణలో వరుస పరాభవాలతో ఉన్న చంద్రబాబు రివేంజ్ కు ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమితో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్  పరిధితోపాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు చంద్రబాబు. 

చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించినా తెలంగాణ సమాజం చంద్రబాబును నమ్మలేదు. చంద్రబాబుకు గుర్తుండిపోయేలా తీర్పునిచ్చారు. తొలిసారిగా  రాజకీయాల్లోకి తీసుకు వచ్చిన తన మేనకోడలు ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు పరిస్థితి తెలంగాణలో తేలిపోయింది. 

అంతేకాదు 12 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బద్దశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో  పొత్తు పెట్టుకుని తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఓటుతో తీర్పునిచ్చారు. 

అంతేకాదు చంద్రబాబుతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందని అపవాదును కూడా మూటకట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో ప్రజాకూటమికి డబ్బు స్పాన్సర్ చేసింది చంద్రబాబేనని ఆఖరికి రాహుల్ గాంధీ తిరిగేందుకు ఫ్లైట్ ఖర్చులు కూడా చంద్రబాబే సమకూర్చారంటూ వచ్చిన వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. 

చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఘోర తప్పిదం చేశామని నేతలు చెప్తున్నారు. అంతేకాదు ఈ పొత్తు కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకేనని పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదంటూ కుండబద్దలు కొడుతున్నారు. 

ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణలో మరో గట్టి షాక్ తగిలేలా ఉంది చంద్రబాబుకు. ఏకంగా పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిపడేలా ఉంది. జాతీయ హోదాకు ఎసరు వచ్చే అవకాశాలు  కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. అప్పుడు అంత సంఖ్యా బలం కూడా ఉంది. 

అయితే ముందస్తు ఎన్నికల్లో టీడీపీ అనుకున్న ఓట్ల శాతం రాకపోవడంతో ఈసారి జాతీయ హోదా కష్టమేనని ప్రచారం జరుగుతోంది. జాతీయ హోదా గుర్తింపు దక్కాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనీసం 6శాతం ఓట్లు సాధించాలి. కానీ తెలుగుదేశం పార్టీ కేవలం 3.5శాతం ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో టీడీపీకి జాతీయ హోదా గల్లంతు అవ్వడం ఖాయమేనని తెలుస్తోంది. 

ఇకపోతే రాష్ట్ర విభజన జరిగిన అనంతరం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చంద్రబాబును అంతగా విమర్శించిన దాఖలాలు లేవు. అయితే ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో పర్యటించి కేసీఆర్ పైనా వారి వారసులైనా విపరీతమైన కామెంట్లు చెయ్యడంతో వాళ్లకి మండింది. మరీ నాపుట్టులో వేలు పెడితే నేను కుట్టనా అన్న చందంగా ఏపీలో అడుగుపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఇలా లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నారు. అంతేకాదు తెలంగాణలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపైనా విమర్శలు చేశారు. దీంతో ఆయన ఊరుకుంటారా..చంద్రుడు అయాం కమింగ్ అంటూ హింట్స్ ఇచ్చారు. 

జగన్ కు మద్దతు ఇస్తా ఆంధ్రాలో ప్రచారం చేస్తా అంటూ చెప్పారు. ఇప్పుడిప్పుడే మైనారిటీలను దగ్గర చేసుకుంటున్న చంద్రబాబు హైదరాబాద్ లో అసదుద్దీన్ ను గెలికి వారిని కాస్త మళ్లీ దూరం చేసుకునేలా చేజేతులా చేసుకున్నారు చంద్రబాబు. 
 
ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా, బీజేపీ యేతర ఫ్రంట్ కు నడుంబిగిస్తున్నా అని పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడుకు ఆదిలోనే హంసపాదు తగిలింది. ఇప్పటికే రెండుసార్లు కలిసి మద్దతు కోరిన దీదీ ఆఖరికి హ్యాండ్ ఇచ్చింది.  

కేసీఆర్‌ చెప్తున్న నాన్ బిజెపి, నాన్ కాంగ్రెస్ కూటమికి దీదీ జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబుకు జాతీయ రాజకీయాల్లో కూడా దెబ్బతగిలేలా ఉంది. ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి బాబుకు ఇంకెన్నీ పరాభవాలు ఎదురవుతాయో ఏమో మరి చూడాలి. 

ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంతో పెట్టుకున్న ప్రతీసారి చిక్కులు తప్పడం లేదు. ఆనాడు ఓటుకు నోటు కేసు, ఈనాడు ఏకంగా పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిపడేలా ఉంది. ఇలా వరుస పరాభవాలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios