Asianet News TeluguAsianet News Telugu

కొత్త సర్పంచ్‌లకు మరో కీలక బాధ్యత: తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అటవీ సంపద పరిరక్షణ కోసం కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్ లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని తెలంగాన ప్రభుత్వం భావిస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి...దాని ద్వారా అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ అటవీ రక్షణ దళాల బాధ్యత గ్రామ సర్పంచ్ కు అప్పగించి వారికి అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎస్ అటవీ అధికారులకు సూచించారు.
 

telangana forest protection committee decision
Author
Hyderabad, First Published Jan 22, 2019, 4:21 PM IST

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అటవీ సంపద పరిరక్షణ కోసం కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్ లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని తెలంగాన ప్రభుత్వం భావిస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి...దాని ద్వారా అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ అటవీ రక్షణ దళాల బాధ్యత గ్రామ సర్పంచ్ కు అప్పగించి వారికి అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎస్ అటవీ అధికారులకు సూచించారు.

ఇవాళ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ  సంపదను కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలపై చర్చించిన కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.    


తెలంగాణ రాష్ట్రంలో పులుల రక్షణ కోసం ప్రత్యేకంగా స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశం తీర్పానించింది. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో ఈ ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటు కానుంది. ఈ రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లు నిరంతరం పనిచేయనున్నారు. ఈ సాయుధ దళ నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున భరించనున్నాయి. 

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తగిన చర్యల కోసం రెండు కోట్లా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధుల విడుదలకు కూడా ఈ కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి సూచన మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం సమీకృత ప్రణాళికను సిద్దం చేసి, అమలు చేయాలని నిర్ణయించారు. అడవుల్లో చెట్ల నరికివేతను నియంత్రించటం, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండటంతో పాటు, పీడీ చట్టం కింద కేసులు పెట్టేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జంతువుల వేట కోసం విద్యుత్ ను వాడితే, కరెంట్ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని, అటవీ ప్రాంతాల్లో పనిచేసే విద్యుత్ ఉద్యోగులు కూడా సంబంధిత విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. 

అటవీ నేరాల్లో విచారణ వేగంగా చేయటం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా పనిచేసేందుకు అటవీ శాఖకు న్యాయ సహకారం అందించాలని నిర్ణయించారు. జిల్లాకు ఒక లీగల్ అడ్వయిజర్ ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. టాస్క్ ఫోర్స్ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట పోలీసుల సహకరించాలని నిర్ణయించారు. అటవీ శాఖ కోరిన చోట పోలీసులతో ఔట్ పోస్టును కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. 

ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యుత్, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయ శాఖ సెక్రటరీ నిరంజన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios