Asianet News TeluguAsianet News Telugu

rtc strike: అలా అయితే ఆర్థిక శాఖను కూడా ప్రైవేట్ పరం చేయాలి: విజయశాంతి

నష్టాలలో ఉన్న రూట్‌లను ప్రైవేటు ట్రావెల్స్‌కు అప్పగిస్తానని దాని ద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి ఆరోపించారు. అంటే నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం ప్రస్తుత యాజమాన్యానికి సాధ్యం కాదని కేసీఆర్ పరోక్షంగా చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

telangana congress leader vijayashanthi slams cm kcr decision over rtc
Author
Hyderabad, First Published Nov 4, 2019, 9:05 AM IST

హైదరాబాద్: ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. నష్టాల్లో ఉన్న రూట్లను ప్రైవేటు పరం చేస్తున్న కేసీఆర్, ఆర్థిక కష్టాలకు కారణమైన తెలంగాణ ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. 

ఆర్థిక శాఖ పతనానికి వర్తించని ఆర్థిక సూత్రాలు ఆర్టీసీకి వర్తించాలని అనుకోవడం దొరల నిరంకుశత్వానికి నిదర్శనమంటూ విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ తన కుట్రను కప్పిపుచ్చుకోవడానికి కొత్త నాటకం మొదలుపెట్టారంటూ ధ్వజమెత్తారు. 

నష్టాలలో ఉన్న రూట్‌లను ప్రైవేటు ట్రావెల్స్‌కు అప్పగిస్తానని దాని ద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి ఆరోపించారు. అంటే నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం ప్రస్తుత యాజమాన్యానికి సాధ్యం కాదని కేసీఆర్ పరోక్షంగా చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

ఆర్టీసీ యాజమాన్యం నష్ట నివారణకు చర్యలు తీసుకోలేకపోతోందని పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణపై చేసిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ కేవలం ఆర్టీసీకే పరిమితం కాదని, ఇదే విషయం తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందంటూ విజయశాంతి సెటైర్లు వేశారు. 

ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్‌ను కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ అంగీకరించింది వాస్తవం కాదా అని నిలదీశారు. దానిపై కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని విశ్లేషకులు తేల్చేశారు. మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విజయశాంతి ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అనాలోచిత, అసంబంద్ధ నిర్ణయాలే కారణమని విజయశాంతి ఆరోపించారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు విజయశాంతి.  

 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

Follow Us:
Download App:
  • android
  • ios