Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ ఎత్తుకు చిత్తయిన కాంగ్రెస్

  • కాంగ్రెస్ లిస్ట్ పై సర్వత్రా చర్చ
  • రెండేళ్ల కింద మరణించిన మిత్రసేనకు చోటు
  • గద్వాల జేజెమ్మ పేరు గల్లంతు
  • జాబితాలో లేని వారికి ఇంటెలిజెన్స్ అధికారుల ఫోన్లు
  • నష్ట నివారణ చర్యలకు దిగిన కాంగ్రెస్
telangana congress fake list viral in social media

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మైండ్ గేమ్ లో పోటీ పడుతున్నాయి. అయితే అన్ని వనరులున్న అధికార పార్టీ వేసిన ఒక్క ఎత్తుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చిత్తయిపోయింది. నష్ట నివారణ చర్యలకు దిగింది. అయినా.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి నష్టం బాగానే అయిందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఇంటెలిజెన్స్ దెబ్బ తగిలిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ ఇంటెలిజెన్స్ దెబ్బ కథా కమామిషూ ఏంటో చదువుదాం.

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే అని రెండు పేజీలతో కూడిన జాబితా ఒకటి చెక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో 60 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక వ్యక్తి పేరు మాత్రమే ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఆబ్లిక్ పేరుతో రెండు, మూడు పేర్లు కూడా ఉన్నాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్ రూపొందించిన జాబితా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం దుమ్ము రేగిపోతోంది.

telangana congress fake list viral in social media

ఈ లిస్టు ముచ్చట కాంగ్రెస్ పెద్దల దాకా పోయింది. అసలు అలాంటి లిస్టు ఏదీ తాము రూపొందించలేదని కాంగ్రెస్ నేతలు షాక్ అయ్యారు. అయితే గతంలో 60 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు ఫైనల్ అయ్యారంటూ పలు సందర్భాల్లో తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మిగతా నియోజకవర్గాల్లో సెర్చింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఉత్తమ్ చెప్పిన ఈ మాటలను సాకుగా తీసుకుని కొందరు అధికార పార్టీ తాలూకు మనుషులు 60 పేర్లతో ఒక జాబితా రూపొందించి సోషల్ మీడియాలో వదిలారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక ఆ జాబితాలో చోటు లేని ఆశావహులు లబోదిబోమంటున్నారట. లిస్ట్ నిజమేనా అంటూ ఒకటే నేతలకు ఫోన్లు చేసుకుని వాకబు చేస్తున్నారట.

ఇక ఇక్కడ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ట్విస్ట్ ఏమంటే..? లిస్ట్ లో పేరు లేని టికెట్ ఆశావహులు ఎవరైతే ఉంటారో.. వాళ్లకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు. ఆ లిస్టే ఫైనల్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ లిస్టులో చోటు లేనందున మీరు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ ఇంటెలిజెన్స్ అధికారులు బెదరగొడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. టికెట్ రాకపోతే కాంగ్రెస్ లో ఉండుడు ఎందుకు? వేరే చూసుకోవాలన్నట్లు వారికి హితబోధ చేస్తున్నారట. ఈ విషయంపై గాంధీ భవన్ వర్గాల్లో కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి.

లిస్ట్ లో పదనిసలెన్నో...

తమకు 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ అయ్యారని ఉత్తమ్ చెప్పినదాన్ని బేస్ చేసుకుని 60 నియోజకవర్గాల జాబితా రూపొందించారు ప్రత్యర్థులు. అయితే ఆ జాబితాలో 56వ సంఖ్యలో అశ్వరావుపేట అభ్యర్థిగా వి. మిత్రసేన పేరును వెల్లడించారు. అయితే వి.మిత్రసేన 2016 ఫిబ్రవరి 13వ తేదీన మరణించారు. (సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తి అయింది.) మరి రెండేళ్ల క్రిందట మరణించిన మిత్రసేన పేరు లిస్టులో ఉందంటే అది డిల్లక్ లిస్టు కాక మరేంటి అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి నుంచి సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఇప్పటికే బలమైన క్యాండిడెట్ గా పోదెం వీరయ్య ఉన్నారు. కానీ.. సీతక్క పేరు ఖరారు చేసేశారు. ఇక లిస్టులో గద్వాల నియోజకవర్గం ప్రస్తావన లేదు. అక్కడ డి.కె.అరుణ తప్ప కాంగ్రెస్ నుంచి ఇంకొకరు పోటీ చేసే చాన్సే లేదు. అలాగే నల్లగొండ సీటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆబ్లిక్ బొడ్డుపల్లి లక్ష్మి పేరును పేర్కొన్నారు. కోమటిరెడ్డి తాను పోటీ చేయనని ప్రకటించిన తర్వాత లక్ష్మి అభ్యర్థిత్వంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక యువకుడిని పోటీకి దింపుతానని ఆయన ప్రకటించడం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకును బరిలోకి దింపే అవకాశాలున్నట్లు చర్చలు సాగుతున్నాయి. ఇక పాలకుర్తిలో దుగ్యాల శ్రీనివాసరావు పేరు రాశారు. ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. యాక్టీవ్ పాలిటిక్స్ లో కూడా లేరు. అలాగే జహీరాబాద్ గీతారెడ్డి అక్కడ లేదా కంటోన్మెంట్ లో పోటీ చేస్తారని కూడా రాశారు.

ఏది ఏమైనా ఈ లిస్ట్ ప్రకటించి మిగతా ఆశావహులను గందరగోళానికి నెట్టేశారన్న ప్రచారం మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో సాగుతోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఆశావహులందరికీ ఫోన్లు చేసి ఆ పిచ్చి లిస్ట్ నమ్మొద్దని చెబుతున్నారు. మొత్తానికి అధికార పార్టీ వైపు నుంచి కావాలని ఆడిన మైండ్ గేమ్ నా లేక దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని చక్రం తిప్పారా అన్నది తెలియదు కానీ.. కాంగ్రెస్ ను ఈ మాత్రం బిత్తరపోయేలా చేశారన్న చర్చ జోరందుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios