Asianet News TeluguAsianet News Telugu

కేశవరావు ప్రకటనపై తీవ్ర అసంతృప్తి: కేసీఆర్ షాక్

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ తన వైఖరిని వీడడం లేదు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవని మరోసారి స్పష్టం చేశారు.ఈ పరిణామంతో ఆర్టీసీ కార్మికులకు నిరాశే మిగిలింది.

Telangana CM KCR not accepted trs mp Keshava rao proposal on Rtc strike
Author
Hyderabad, First Published Oct 17, 2019, 7:56 AM IST

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు ప్రకటన ఆయన వ్యక్తిగతమైందేననే సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో స్పష్టమైంది. కేశవరావు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఎందుకు స్పందించారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేశవరావు ఈ ప్రకటనను వ్యూహాత్మకంగా చేశారా.. లేదా ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు గాను చొరవచూపే ప్రయత్నం చేశారా అనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేశవరావు సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయనకు అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో ఈ విషయమై ముందడుగు పడలేదు. ఈ పరిణామంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆర్టీసీ కార్మికులు చర్చలతో సానుకూలమైన ప్రకటన చేయడం, సీఎం కేసీఆర్ మాత్రం చర్చలకు సానుకూలంగా లేకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం కన్పిస్తోంది.  ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును కోరారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు  ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్‌జీవోలు, విద్యుత్ కార్మికులు, రెవిన్యూ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు.విపక్షాలన్నీ కూడ ఆర్టీసీ సమ్మె విషయంలో సానుకూలంగా స్పందించాయి. ఈ సమ్మెకు మద్దతును ప్రకటించాయి.

ఈ నెల 14వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చించాలని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కోరారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆయన ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

ఈ ప్రకటనకు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చలకు కేశవరావు మధ్యవర్తిత్వం వహించాలని కేశవరావును కోరారు. ఈ నెల 14వ తేదీన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రకటన చేసిన కేశవరావు ఢిల్లీకి వెళ్లారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగివచ్చారు.

సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని కేశవరావు మీడియాకు చెప్పారు. ఈ నెల 15వ తేదీన కేశవరావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.

తాను సోషలిస్టునని చెప్పారు. కార్మికుల పక్షపాతిగా ఉండేందుకే తాను చర్చల ప్రతిపాదన తెచ్చినట్టుగా మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయమై తాను సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినట్టుగా మీడియాకు చెప్పారు. కానీ, తనకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ లభ్యం కాలేదన్నారు. సీఎం నుండి అనుమతి లభిస్తే తాను కార్మికులతో చర్చలకు సిద్దమేనని ప్రకటించారు.

సీఎం కేసీఆర్ మాత్రం కేశవరావుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కేశవరావు సీఎం కేసీఆర్ అనుమతి లేకుండానే ఈ ప్రకటన చేస్తారా అనే చర్చ కూడ ఉంది. సీఎం కేసీఆర్ అనుమతి లేకుండా కేశవరావు ఈ ప్రకటన విడుదల చేస్తే రాజకీయంగా అది సంచలనమే అవుతోంది. ఒకవేళ సీఎం కు తెలిసి జరిగితే  ఇదే విషయమై కేశవరావుకు సీఎం అపాయింట్ మెంట్ లభ్యం కాకపోవడం మాత్రం చర్చనీయాంశమే.

ఆర్టీసీ కార్మికులు ఇతర ఉద్యోగ సంఘాలను కూడ కూడగడుతున్నారు. ఇప్పటికే టీఎన్‌జీవోలు, రెవిన్యూ ఉద్యోగులు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చింది.ఈ పిలుపుకు రాజకీయపార్టీలు కూడ మద్దతును ప్రకటించాయి.

ఆర్టీసీ సమ్మె విషయమై కేశవరావు ప్రకటన చేయడంతో పాటు ఖమ్మం కూడ వెళ్లారు. ఈ పరిణామం టీఆర్ఎస్ నాయకత్వానికి కొంత అసంతృప్తికి గురిచేసినట్టుగా ప్రచారం సాగుతోంది. సీఎం నుండి ఆర్టీసీ సమ్మె విషయమై చర్చలు జరిపే విషయమై సమాచారం వస్తోందని కేశవరావు రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని మంగళవారం రాత్రి మరోసారి తేల్చిచెప్పారు.

ఈ పరిణామం కేశవరావుతో పాటు ఆర్టీసీ కార్మికులను అంతర్మథనంలో పడేసింది. కేశవరావు చేసిన ప్రకటన సీఎం కేసీఆర్ సమ్మతితో చేసింది కాదని స్పష్టమైంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కేశవరావు చేసిన ప్రకటన రాజకీయంగా టీఆర్ఎస్ తో పాటు, కేసీఆర్ ను దోషిగా నిలబెట్టిందనే అభిప్రాయాలను రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రాజకీయంగా ఈ పరిణామాలను విపక్షాలు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించే  సభలో ఇవాళ కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios