Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బంద్ ఉద్రిక్తం: ప్రైవేట్ డ్రైవర్ పై కార్మికుల దాడి

తెలంగాణ బంద్ ఉద్రిక్తంగా మారింది. నాగోల్ లోని బండ్లగూడ డిపో నుండి బస్సును బయటకు తీసేందుకు యత్నించిన తాత్కాలిక డ్రైవర్ ని అక్కడే ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని దాడి చేసారు. ఇంతలోనే కల్పించుకున్న పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించివేశారు

telangana bandh: rtc employees attack temporary driver in hyderabad
Author
Hyderabad, First Published Oct 19, 2019, 11:26 AM IST

హైదరాబాద్: తెలంగాణ బంద్ ఉద్రిక్తంగా మారింది. నాగోల్ లోని బండ్లగూడ డిపో నుండి బస్సును బయటకు తీసేందుకు యత్నించిన తాత్కాలిక డ్రైవర్ ని అక్కడే ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని దాడి చేసారు. ఇంతలోనే కల్పించుకున్న పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించివేశారు. తాను పేదవాడినని, దినసరి వేతనం కోసమే వచ్చాను తప్ప కార్మికులకు వ్యతిరేకంగా కాదని డ్రైవర్ వేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. దాడి చేసిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసారు. 

 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బంద్ కు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది కూడా. బంద్ ప్రభావాన్ని సాధ్యమైనంతమేర తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. 

ఇందాక కొద్దీ సేపటి కింద నారాయణగూడ వద్ద సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. నేటి ఉదయం జూబిలీ బస్సు స్టాండ్ ముట్టడికి యత్నించిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు రాష్ట్రవ్యాప్తంగా పొద్దటి నుండి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ధర్నాలకు దిగిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. 

కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం,బీజేపీ ఇలా అన్ని పార్టీల కార్యకర్తలను నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ అరెస్టులు తోపులాటలకు, ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. 

సమ్మెకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కూడా భారీగా మోహరించారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు.నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

ఇదిలా ఉండగా...బంద్ నేపథ్యంలో... డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత.. అరకొరగా నడుస్తున్న బస్సులను రోడ్డుమీదకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులనుకూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios