Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ యాజమాన్యంతో "చర్చలు ఫెయిల్": బయటకొచ్చేసిన జేఏసీ నేతలు

పూర్తి డిమాండ్లపై చర్చ జరపాలన్న యూనియన్ నేతల ప్రతిపాదనను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. కేవలం ఆర్థికభారం లేనటువంటి 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని మలివిడతగా మరో ఐదు డిమాండ్లపై చర్చిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెగేసి చెప్పింది. దాంతో యూనియన్ సంఘాల నేతలు అర్థాంతంగా బయటకు వచ్చేశారు.

RTC Strike: rtc management talks fail, rtc jac leaders walkout
Author
Hyderabad, First Published Oct 26, 2019, 4:54 PM IST

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో యూనియన్ సంఘాల నేతలు చేసిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు గంటపాటు యాజమాన్యంతో కార్మికులు చర్చలు జరిపారు. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని యూనియన్ సంఘాల నేతలు పట్టుబట్టారు.  

పూర్తి డిమాండ్లపై చర్చ జరపాలన్న యూనియన్ నేతల ప్రతిపాదనను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. కేవలం ఆర్థికభారం లేనటువంటి 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని మలివిడతగా మరో ఐదు డిమాండ్లపై చర్చిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెగేసి చెప్పింది. దాంతో యూనియన్ సంఘాల నేతలు అర్థాంతంగా బయటకు వచ్చేశారు. 

ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలమైనట్లు స్పష్టం చేశారు. సమావేశం నుంచి బయటకు వచ్చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు వెళ్లిపోయారు. ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అనంతరం భవిష్యత్ కార్యచరణ స్పష్టం చేయనుంది. 

ఆర్టీసీ కార్మికుల చర్చల సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కండీషన్లు అప్లై చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సామాన్యుడు దగ్గర నుంచి టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలపడంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. దీనంతటికి కారణం ఆర్టీసీ కార్మికుల సమ్మె. 

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, యూనియన్ నేతల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించాలంటూ అటు ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

హైకోర్టు ఆదేశంతో ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం దిగి వచ్చింది. చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ నేతృత్వంలో ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులను చర్చలకు రావాలని ఆదేశించారు. 

ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఉత్సాహంగా ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయానికి చేరుకున్న ఆర్టీసీ యూనియన్ నేతలకు ప్రభుత్వ అధికారులు పెట్టిన కండీషన్లు చుక్కలు చూపించాయట. 

ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు యూనియన్ సంఘాల తరపున 16 మంది కార్మిక నేతలు హాజరయ్యారు. అయితే వారందర్నీ చూసిన అధికారులు చర్చలకు నలుగురు మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధించారు. 

అధికారుల నిర్ణయంపై ఆర్టీసీ యూనియన్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ నేతలందరినీ చర్చలకు ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశిస్తే నలుగురినే చర్చలకు ఆహ్వానించడం ఏంటని టీజేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిలదీశారు. 

హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్చలకు యూనియన్ నేతలు అందరినీ ఆహ్వానించాలని అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం నలుగురే లోపలికి రావాలంటూ కండీషన్లు పెట్టారు. 

తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురు వెళ్లాల్సి వచ్చింది. టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు లోపలికి వెళ్లారు. 

చర్చలకు వెళ్లిన తర్వాత అక్కడ మరో కండీషన్ పెట్టారు అధికారులు. యూనియన్ నాయకుల జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాలని ఆదేశించారు. దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు యూనియన్ నేతలు.  

సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తేనే చర్చలు జరుగుతాయంటూ మెలిక పెట్టడంతో స్విచ్ ఆఫ్ చేయక తప్పలేదు ఆర్టీసీ అధికారులకు. చర్చలు జరుగుతున్న తరుణంలో కెమెరామెన్ రావడంతో మరో కండీషన్ మెుదలైంది. 

మెుత్తం చర్చల ఆద్యంతాన్ని వీడియోలో షూట్ చేయించారు అధికారులు. సమ్మె తర్వాత తొలిసారిగా చర్చలు జరుపుతున్న తరుణంలో చర్చల సారాంశాన్ని కోర్టుకు, అలాగే ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీడియో షూట్ చేశారు. 

చర్చల సారాంశం మెుత్తాన్ని తమకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీడియో షూట్ చేశారు. సుమారు గంటపాటు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపారు యూనియన్ సంఘాల నేతలు. 

21 డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటకీ ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్లను పరిశీలించారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. ఈడీల నివేదిక ఆధారంగా అంశాలపై చర్చలు జరిపారు. చర్చల అనంతరం యూనియన్ నేతలు బయటకు వచ్చేశారు.   
  

Follow Us:
Download App:
  • android
  • ios