Asianet News TeluguAsianet News Telugu

నాపై కేసులు పెట్టించిందెవరో తెలుసు: కేసీఆర్ కు అశ్వత్థామ సవాల్

తనపై కేసు విషయమై  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పందించారు. ఈ కేసులకు తాను భయపడేది లేదన్నారు. ఈ కేసు వెనుక ఎవరో ఉన్నారో తనకు తెలుసునన్నారు. ఈ కేసుతో తన  ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.

RTC JAC Leader Ashwathama Reddy Challenges To KCR Over RTC Strike
Author
Hyderabad, First Published Oct 25, 2019, 4:02 PM IST


హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై ఆర్టీసీ కార్మికులతో రెఫరెండం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి సవాల్ విసిరారు.

ఈ రెఫరెండంలో ఆర్టీసా కార్మికులు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయకూడదని కోరుకొంటే తాము కూడ  ఈ డిమాండ్‌ను వెనక్కు తీసుకొంటామని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 30వ తేదీన నిర్వహించతలపెట్టిన సకల జనుల సమర భేరి .సభకు మద్దతివ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఎసీ నేతలు శుక్రవారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను కలిశారు.

Also Read:RTC strike: అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు...

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. 2012లో ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని  ఆశ్వత్థామ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై ఆర్టీసీ కార్మికులతో రెఫరెండం నిర్వహించాలని ఆయన సీఎంను కోరారు.  రెఫరెండం‌పై మెజారిటీ కార్మికులు వద్దని చెబితే తాము ఈ డిమాండ్‌ విషయంలో వెనక్కు తగ్గుతామని ఆయన స్పష్టం చేశారు.హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు తమ సమ్మెకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read::ఆ చట్టం ఏమిటో తెలుసుకో: కేసీఆర్ వ్యాఖ్యలపై ఆశ్వత్థామరెడ్డి

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందన్నారు. తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకె ఘన విజయం సాధిస్తే, ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయం సాధించిన విషయాన్ని ఆశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు.

ఉప ఎన్నికల్లో ఫలితాలు పాలక పార్టీలకు అనుకూలంగా ఉంటాయని ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూల ఫలితం రావడాన్ని ఆయన తేలికగా కొట్టిపారేశారు.

నాపై కేసు వెనుక ఎవరున్నారో తెలుసు

కూకట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు తనపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పందించారు. ఈ కేసు వెనుక ఎవరున్నారో కూడ తెలుసునని ఆయన చెప్పారు.

కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో తాము ఎప్పుడూ కూడ రాజు అనే డ్రైవర్ ను చూడలేదని ఆ డిపోకు చెందిన ఆర్టీసీ జేఎసీ నేతలు తనకు చెప్పారని ఆయన చెప్పారు. కేసులకు తాను భయపడేది లేదన్నారు.

తన మీద కేసు పెట్టడంతో తాను ఇంకా గట్టిగా  ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడ కోదండరామ్, కేసీఆర్‌పై కూడ ఇలానే కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు.ఈ కేసులు తన ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయవని ఆయన తేల్చి చెప్పారు.ఈ కేసు వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని ఆయన పరోక్షంగా టీఆర్ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios