Asianet News TeluguAsianet News Telugu

చల్లబడిన ఫైర్ బ్రాండ్: రేవంత్ రెడ్డి మౌనం వెనక...

తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. ఏ అంశం పైనైనా అనర్గళంగా మాట్లాడటమే కాదు ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి. మాటల తూటాలతో రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో సమర్థుడు. అదే టీఆర్ఎస్ పై అయితేనో, కేసీఆర్ కుటుంబంపై అయితేనో ఇక చెప్పనవసరం లేదు. 
 

Revanth Reddy became silent after Elections
Author
Hyderabad, First Published Dec 28, 2018, 3:55 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. ఏ అంశం పైనైనా అనర్గళంగా మాట్లాడటమే కాదు ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి. మాటల తూటాలతో రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో సమర్థుడు. అదే టీఆర్ఎస్ పై అయితేనో, కేసీఆర్ కుటుంబంపై అయితేనో ఇక చెప్పనవసరం లేదు. 

ఒంటికాలితో విరుచుకుపడతారు. నోటికి వచ్చింది తిట్టిపోస్తారు. కేసీఆర్ పైనా ఆయన కుటుంబంపైనా ఘాటు వ్యాఖ్యలు చెయ్యడంలో దిట్టగా ఆయన్ను చెప్పుకుంటారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సీఎం రేస్ వ్యక్తిగా కూడా ప్రచారం జరిగిపోయింది. ఆయన కూడా ఓ రేంజ్ లో కలగన్నారు. 

అయితే ముందస్తు ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ కావడంతో ఆయన ప్రస్తుతం ఎక్కడా కనబడటం లేదు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు నిత్యం మీడియాలో కనిపించే ఆయన ఫలితాల అనంతరం ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంతగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ.. ఇంకెవరో కాదు. 

తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఓటుకు నోటు కేసులో సానుభూతి పొందేందుకు కేసీఆర్ పై ఒంటికాలితో లేచేవారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపికవ్వడం చకచకా జరిగిపోయింది. ముందస్తు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలన్నీ రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ పైనే దృష్టి సారించాయి. 

టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కొడంగల్ లో తిష్టవేసింది. తీరా ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ గాలి వీచింది. ఆవేవ్ లో రేవంత్ రెడ్డి కొట్టుకుపోయారు. టీఆర్ఎస్ వ్యూహాల ముందు రేవంత్ దూకుడు కొడంగల్ లో ప్రభావం చూపలేకపోయింది.

ఇకపోతే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ మిశ్రమ ఫలితాలే వచ్చాయి. రెండు మూడు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల ఓటమిపాలయ్యారు. అయితే  ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి  పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 

ఎన్నికల ఫలితాల రోజు చివరి ఫలితం రాకముందే రేవంత్ తన ఓటమిని అంగీకరించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అంటూ కాస్త హుందాగా ఓటిమిని ఒప్పుకున్న ఆయన ఇక కనిపించలేదు. సుమారు 15 రోజులుగా రేవంత్ రెడ్డి జాడ కానరాకుండా పోయింది. 

దీంతో రేవంత్ రెడ్డి సైలెంట్ వెనుక కారణం ఏమైనా ఉందా, రేవంత్ నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

రేవంత్ ఓటమి నుంచి తేరుకోలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందువల్లే బయటకు రాలేకపోతున్నారని రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరం కారంటూ చెప్పుకొస్తున్నారు.  రేవంత్ రెడ్డి టార్గెట్ 2024గా అప్పుడే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.  

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి గట్టి వర్గం ఉండేది. అదే వర్గంతో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో తనకు మాంచి గుర్తింపు ఉంటుందని భావించారు. కానీ టిక్కెట్ల కేటాయింపు వచ్చేసరికి రేవంత్ వర్గానికి మెుండి చెయ్యి చూపించారు. 

రేవంత్ వర్గానికి చెందిన ముగ్గురుకి మాత్రమే టిక్కెట్ ఇప్పించుకోగలిగారు. వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒకరు. ఆమె ముందస్తు ఎన్నికల్లో మాజీమంత్రి చందూలాల్ పై ఘన విజయం సాధించారు. 

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కని రేవంత్ రెడ్డికి చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓవైపు ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం, మరోవైపు కేడర్ చెల్లా చెదురవ్వడంతో రేవంత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది.  

కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద రేవంత్ రెడ్డి మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఆ నమ్మకం ఎంతలా అంటే కాంగ్రెస్ సీనియర్ జాతీయ నేత అయిన గులామ్ నబీ ఆజాద్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పార్టీ ఓడినా రేవంత్ గెలిచి ఉంటే పరిస్థితి వేరులా ఉండేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. 

రేవంత్ అనుకున్నవి ఏ ఒక్కటి జరగకపోవడంతో రేవంత్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ఓటమి తర్వాత కనీసం తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయాల్లో దూకుడుగా ఉండే రేవంత్ ఇలా సైలెంట్ అయిపోవడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతుంది.  

మరోవైపు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపైనా స్పందించడం లేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన మామ జైపాల్ రెడ్డి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం పోటీకి సై అంటున్నారని అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారంటూ మరో ప్రచారం జరగుతుంది. మరి రేవంత్ మనసులో ఏముందో ఎవరికి అంతు చిక్కడం లేదు. రేవంత్ ఇంతకు ముందులానే దూకుడుగా వెళతారా..? లేదా కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉంటారా అన్నది వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios