Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరా హోరీ: రెడ్డి వర్సెస్ రెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.రాష్ట్రంలోని మూడు స్థానాలను  కైవసం చేసుకొనేందుకు ఈ రెండు పార్టీలు వ్యూహలను రచిస్తున్నాయి.
 

reddy candidates gets tickets from trs and congress for local body mlc elections
Author
Hyderabad, First Published May 13, 2019, 4:25 PM IST


హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.రాష్ట్రంలోని మూడు స్థానాలను  కైవసం చేసుకొనేందుకు ఈ రెండు పార్టీలు వ్యూహలను రచిస్తున్నాయి.

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో మునుగోడు నుండి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి గతంలో గెలుపొందిన పట్నం నరేందర్ రెడ్డి గత ఏడాది జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్ధానానికి కొండా మురళి గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొండా దంపతులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో  ఎన్నికల తర్వాత కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 14 వతేదీ చివరి రోజు.  ఈ మూడు స్థానాల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ ఆదివారం నాడు అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ స్థానానికి తేర చిన్నపరెడ్డి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ఆ పార్టీ తన అభ్యర్థులుగా బరిలోకి దింపింది.

కాంగ్రెస్ పార్టీ కూడ సోమవారం నాడు తన అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి టిక్కెట్టు ఇప్పించుకొన్నారు. వరంగల్ నుండి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నుండి ఉదయ మోహన్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది.

రంగారెడ్డి జిల్లా స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే చివరకు ఉదయ మోహన్ రెడ్డి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపింది.వరంగల్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొండా దంపతులు మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో వెంకట్రామిరెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది.

 ఎమ్మెల్సీ  ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయా జిల్లాల్లో మంత్రులకు టీఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది.  వరంగల్ లో దయాకర్ రావుకు, నల్గొండలో జగదీష్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. గతంలో నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

నల్గొండ నుండి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా తేర చిన్నపరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి లక్ష్మీ బరిలోకి దిగారు. కోమటిరెడ్డి లక్ష్మీ స్థానంలో  గతంలో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పేరు కూడ విన్పించింది. కానీ, చివరకు కోమటిరెడ్డి లక్ష్మీకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉప ఎన్నికలను పాత ఓటర్లతోనే నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. ఈ విషయమై పీసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటరు లిస్టు లేకుండానే ఎన్నికలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ తప్పు బట్టింది.

ఈ విషయమై ఈసీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.అవసరమైతే ఇదే విషయమై కోర్టును కూడ ఆశ్రయిస్తామని ఆయన గతంలోనే ప్రకటించారు.తమకు ఓటేసే అభ్యర్థులతో క్యాంపులు నిర్వహించేందుకు అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్యాంపుల నిర్వహణకు ఆయా పార్టీల నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios