Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు: హంగ్ పైనే ఆ ముగ్గురి ఆశలు, కీ రోల్ కు ప్లాన్

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హంగ్ ఏర్పడబోతుందా.?టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసినప్పుడు ఉన్న పరిణామాలు ప్రస్తుత పరిణామాలు వేరుగా ఉన్నాయా..? తమకు ఎదురే లేదు అనుకున్న పార్టీకి ప్రజాకూటమి టఫ్ ఫైట్ ఇస్తుందా.? ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధుల గెలుపు కీలకంగా మారనుందా.?

Predict hung assembly in Telangana
Author
Hyderabad, First Published Dec 4, 2018, 4:01 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హంగ్ ఏర్పడబోతుందా.?టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసినప్పుడు ఉన్న పరిణామాలు ప్రస్తుత పరిణామాలు వేరుగా ఉన్నాయా..? తమకు ఎదురే లేదు అనుకున్న పార్టీకి ప్రజాకూటమి టఫ్ ఫైట్ ఇస్తుందా.? ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధుల గెలుపు కీలకంగా మారనుందా.?

కారు స్టీరింగ్ మనచేతుల్లోనే, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోగా 8 సీట్లున్న పార్టీ ముఖ్యమంత్రి కాలేదా అంటున్న ఎంఐఎం పార్టీ ఉద్దేశం ఏంటి.? తెలంగాణ ఎన్నికల్లో తామే కీలకం కాబోతున్నామని తమ మద్దతు టీఆర్ఎస్ కు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న బీజేపీ వ్యాఖ్యలు వెనుక అసలు గుట్టు ఏంటి.?

తెలంగాణలో హంగ్ ఏర్పుడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందా.? హంగ్ ఏర్పడితేనే బీజేపీ, ఎంఐఎం పార్టీలే కీలకం కానున్నాయా. ముందస్తు ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని ఆ పార్టీలు ఎలా భావిస్తున్నాయి.  

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో ఆనాటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు. అది తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నుంచి రాజకీయ అవగాహన ఉన్న కుర్రోడు సైతం చెప్తున్న మాట. వాస్తవానికి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వ్యూహంతోనే గులాబీ బాస్ ముందస్తుకు వెళ్లారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. 

తెలంగాణ అసెంబ్లీ రద్దు చెయ్యడం, గంటల వ్యవధిలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం ఆ మరుసటి రోజు నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిపోవడం వంటి టీఆర్ఎస్ వ్యూహం పక్కా ప్రణాళికతో జరిగింది. 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవబోతుందంటూ సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 

అంతా టీఆర్ఎస్ ప్రభంజనమేనని చెప్పుకొచ్చారు. తమకు ఎదురే లేదని మళ్లీ సీఎం పీఠం మాదే అని ధీమాగా ఉన్నారు. రాష్ట్రరాజకీయాలే కాదు దేశ రాజకీయాలను సైతం శాసిస్తామంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి స్పందన కూడా వచ్చింది. 

అంతేకాదు వాళ్లు సీట్లు పంచుకునే లోపు స్వీట్లు పంచుకుంటామంటూ చిన్న గులాబీ బాస్ కేటీఆర్, కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు పదేపదే వేదికల్లో చెప్పేవారు. 
ఈ మాటలు, టీఆర్ఎస్ అంచనాలు సెప్టెంబర్ 6 నాటివి. 

నేడు పరిస్థితి మారిందని ప్రజలే చెప్తున్నారు. దరిదాపుల్లోకి కూడా రాదనుకున్న ప్రజాకూటమి దాటెల్లిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదంటూ ప్రచారం జరగుతోంది. ఈ ప్రచారం టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

గులాబీ బాస్ కేసీఆర్ భావించినట్లు నవంబర్ నెలలో ఎన్నికలు వచ్చి ఉంటే కేసీఆర్ అంచనాలు నిజం అయ్యేవని కానీ ఎన్నికలు డిసెంబర్ మాసంలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన అంచనాలు కాస్త చెదిరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్లు సర్ధుబాటులో ప్రజాకూటమి ఆలస్యమైనా ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్ కు ధీటుగానే చేస్తుందని ప్రచారం. 

టీఆర్ఎస్ పార్టీ పక్షాన గులాబీ బాస్ కేసీఆర్ ఒక వైపు ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తుంటే, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ సైతం గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షోలతో ప్రచారంలో హోరెత్తించారు. 

అటు మేనల్లుడు హరీష్ రావు గజ్వేల్, సిద్ధిపేట, కొడంగల్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఇతర నియోజకవర్గాలపైనా దృష్టిసారించారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షో పూర్తైన తర్వాత మళ్లీ కేటీఆర్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఇకపోతే కేసీఆర్ తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం రోడ్ షోలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 

లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్లు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీతో చాలా వెనుకబడిన కాంగ్రెస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అంతేకాదు స్టార్స్ తో, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వారి రోడ్ షోలతో దూసుకుపోతుంది. 

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి రోడ్ షోలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అటు సినీనటి కుష్భూ సైతం తన ప్రచారంతో అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సైతం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 

అలాగే పంజాబ్ మంత్రి మాజీక్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ  సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గులాం నబీ ఆజాద్, కుంతియా వంటి నేతలు సైతం తెలంగాణ ప్రచారంలో ప్రజాకూటమి తరపున హోరెత్తిస్తున్నారు. 

ఇకపోతే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల టూర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. సోనియాగాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ఒక్కసారే పాల్గొన్నా రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణలోనే మకాం వేశారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో మార్మోగిస్తూనే కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. 

అటు తెలుగుదేశం పార్టీ తరుపున టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 
పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మాస్ డైలాగులకు పెట్టింది పేరైన బాలయ్య తన పంచ్ డైలాగులతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బావ బావమరుదులు చంద్రబాబు, బాలకృష్ణలు నువ్వా నేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు జూనియర్ గులాబీ బాస్, మరోవైపు బావ బావమరుదులు చంద్రబాబు, బాలయ్య రోడ్ షోలతో హైదరాబాద్ మహానగరం ఎన్నికల ప్రచారంతో మార్మోగిపోతుంది. 

వీరితోపాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, సీపీఐ జాతీయ నేత నారాయణ సైతం ప్రజాఫ్రంట్ తరపున ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మెుత్తానికి ప్రజాఫ్రంట్ తరపున జరుగుతున్న ఎన్నికల ప్రచారం అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుందని చెప్పాలి. 

ఇకపోతే బీజేపీ సైతం తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తున్న తరుణంలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. బీజేపీ తరపున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పలు దఫాలుగా తెలంగాణలో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 

అటు భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం తెలంగాణలో రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలైన సుష్మాస్వరాజ్ లు సైతం తెలంగాణలో పర్యటించారు. వీరితోపాటు కేంద్రమంత్రి జేపీ నడ్డా, రాం మాధవ్, చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్ తోపాటు ఇతర జాతీయ నేతలంతా పర్యటిస్తున్నారు. 

మెుత్తానికి అన్ని పార్టీల ప్రచారాలతో టీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీంతో పర్యటించిన చోటే మళ్లీ దశలువారీగా పర్యటిస్తూ ఓటర్లన ప్రసన్నం చేసుకునే పడిలో పడింది. అయితే  చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారలో పాల్గొనడం టీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. 

గ్రేటర్ హైదరాబాద్ లో చంద్రబాబు రోడ్ షోలతో హోరెత్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సెటిలర్స్ ఓటర్లను ప్రజాఫ్రంట్ వైపు మళ్లే అవకాశం ఉంది. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ లో రాయలసీమ వాసులు వ్యాపారస్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశాలు నిర్వహించడం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు ఖమ్మం జిల్లాపైనా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 

అన్ని పార్టీలు ఒక్క టీఆర్ఎస్ పార్టీపై ముప్పేట దాడికి దిగుతున్నాయి. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం, ప్రజాకూటమిపై విశ్వాసం లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన స్థానాలను ఇవ్వరని ప్రచారం జరగుతుంది. ఫలితంగా హంగ్ ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

ఒకవేళ హంగ్ ఏర్పడితే తామే కింగ్ మేకర్లం అవుతామని అటు అధికార పార్టీ మిత్ర పక్షం మజ్లిస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీలు భావిస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వాన్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 

ఇప్పటికే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తామే కింగ్ లం కాబోతున్నామని స్పష్టం చేసేశారు కూడా.  కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ముఖ్యమంత్రో నిర్ణయించేది తామేనన్నారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రాన్ని చూపిస్తూ38 సీట్లు గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కాగా లేని 8 సీట్లు గెలిచి ఎంఐఎం ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోలేమా అంటూ బహిరంగ ప్రచారాల్లో ప్రస్తావిస్తున్నారు. 

అందులో భాగంగా ఎంఐఎం పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని మనమే ఉద్యోగాలు ఇద్దామంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంఐఎం సైతం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు బలంగా నమ్ముతుంది. అందుకే ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకుంగే సీఎం ఎవరో తామే నిర్ణయిస్తామని  అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం.  

అటు బీజేపీ సైతం హంగ్ పైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 10 స్థానాల్లో గెలుపొందుతామని ధీమాగా ఉంది. పది స్థానాలు గెలిస్తే తామే కింగ్ మేకర్లమవుతామంటూ ధీమాగా ఉంది. ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమికి సరైన సంఖ్యాబలం రాకుంటే తామే కీలకం అవుతామని కమలనాధులు బహిరంగంగానే చెప్తున్నారు. 

ప్రస్తుతం ఉన్న ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, అప్పుడు తాము కీరోల్ పోషిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. లగడపాటి సర్వే తప్పు అని చెప్పలేను కానీ హంగ్ మాత్రం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు. జీవీఎల్ వ్యాఖ్యలను కొట్టిపారేయ్యలేం ఎందుకంటే గతంలో జీవీఎల్ సెఫాలజిస్టుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.   

ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వతంత్ర్య అభ్యర్ధులు సైతం హంగ్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆంధ్రా అక్టోపస్ గా పేర్గాంచిన లగడపాటి 10 మంది వరకు స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఉన్నాయని లీకులు ఇవ్వడంతో ఆయా పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ టచ్ లో ఉన్నారు. 

అటు ప్రజాకూటమి తరుపున, ఇటు టీఆర్ఎస్ తరుపున పలువురు స్వతంత్రులకు ఫోన్ చేస్తూ తమకు మద్దతుగా ఉండాలంటూ కోరుతున్నారు. అంతేకాదు వారు చేస్తున్న ప్రచార తీరును ఆరా తియ్యడంతోపాటు ఆర్థిక అవసరాలు తీరుస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారట. 

ఒకవేళ తమకు స్పష్టమైన మెజారిటీ రాకపోయినా స్వతంత్రులను కలుపుకుపోయి అధికార పీఠం ఎక్కవచ్చన్న ఆలోచనలో ఇటు అధికార, అటు విపక్ష పార్టీలు ఎన్నికలకు ముందే ఎవరి ఎత్తులు వాళ్లు వేసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అన్నది తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios