Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో కేసిఆర్ గురించి పవన్ ఏమన్నారంటే ?

  • కేసిఆర్ ను కలిసి విష్ చేస్తే తప్పేంటి?
  • కేసిఆర్ స్మార్ట్ సిఎం.. హామీలన్నీ అమలు చేస్తాడనుకుంటున్నా
  • ఓటుకు నోటు కేసులో చూసీ చూడనట్లు వదిలేశాను
  • మా బలమెంతో చూసుకుని పోటీ చేస్తాం
pavan kalyan comments on kcr at karimnagar

తెలంగాణ సిఎం కేసిఆర్ గురించి కరీంనగర్ గడ్డమీద పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసిన పవన్ తన రాజకీయ యాత్రను అక్కడినుంచే ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో అనేక అంశాలపై మాట్లాడారు. తెలంగాణ సిఎం కేసిఆర్, రేవంత్ చిక్కుకుపోయిన ఓటుకు నోటు కేసు విషయంలో పవన్ స్పందించారు. ఆయన మాటల్లోనే  చదవండి.

తెలంగాణ సిఎం కేసిఆర్ ను కలిస్తే తప్పేంటి? నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పడాన్ని తప్పు పడతారా? తెలంగాణ సిఎం కేసిఆర్ స్మార్ట్ సిఎం. ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న నమ్మకం ఉంది. ఓటుకు నోటు కేసులో వివాదం పెద్దది కావొద్దన్న ఉద్దేశంతో నేను సైలెంట్ గా ఉన్నాను. చూసీ చూడనట్లు పోయాను. అన్ని పార్టీలూ అలాగే ఉన్నాయి.

రెండు రాష్ట్రాలకు సంబంధించి సున్నితమైన సమస్యలున్నాయి. ఏ ప్రభుత్వమైనా సరే.. తన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నించాలి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పినప్పుడు గౌరవించాలి. ప్రభుత్వాలతో గొడవ పెట్టుకునేందుకు నేను మాట్లాడడంలేదు. రాజకీయ అస్థిరత కోసం మాట్లాడడం లేదు. గొడవ పెట్టుకోవాల్సిన అంశాలున్నా.. వాటి పరిష్కారం కావాలి తప్ప.. గొడవలు పరిస్కారం కాదని నా భావన. తెలంగాణలో పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో మొదలు పెట్టాము. నా బలమెంత? మేము అన్ని సీట్లలో పోటీ చేసే సత్తా ఉందా? మనకు బలమెక్కడ ఉంది? అన్నదానిపై చివరి రెండు మూడు నెలల్లో తేల్చుకుని పోటీ చేస్తాం.

ఏ విషయంలోనైనా.. నిర్మాణాత్మక ప్రయత్నమే చేస్తాను తప్ప.. వివాదం చేయను., ప్రజలకు బెన్ఫిట్ అయ్యేలా పనిచేస్తాను. చివరి సారి టిడిపికి సపోర్ట్ చేసినా.. ఒక ఆలోచనతోనే చేశాను. రాష్ట్రం విడిపోయినప్పుడు నిర్మాణాత్మక పార్టీ కావడంతో ఆ పార్టీకి సపోర్ట్ చేశాను. తెలంగాణ పోరాటానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అధికార పక్షం ఉంది దానిపై ఎలాగైనా మాట్లాడాలి. నేను సపోర్ట్ చేసిన టిడిపి పై ఎలాగైనా మాట్లాడాలని అన్నట్లు వ్యవహరించను. అధికార పక్షాన్ని విమర్శించాలన్న ఆలోచన నాకు లేదు. సమస్యలను అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వం వద్దకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. అప్పటికీ పరిష్కారం కాకపోతే.. ఆలోచిస్తాం.

2019లో మేము ఇక్కడ పోటీ చేస్తాం.. ఇన్ని సీట్లు కావాలి.. అన్ని సీట్లలో పోటీ చేస్తామని ఇప్పుడే చెప్పలేం. పాతిక సంవత్సరాల కోసం పెట్టిన పార్టీ ఇది. సమయం తీసుకుని పనిచేస్తాం. గతంలో ఒక పార్టీలో పనిచేసి దానినుంచి బయటకొచ్చాను. ఇక్కడ మాకు అభిమానులు ఉన్నారు. తెలంగాణ అంటే నాకు చాలా ప్రేమ. నాకు చాలా ఇష్టం. ఎంత చేయగలం..? ఏం చేయగలం అనేది ఒక్కరోజులో చెప్పేది కాదు. సామాజిక తెలంగాణ ఉండాలి అన్న మాటలు వచ్చింది.. నా స్నేహితుల ద్వారా అలా మాట్లాడాను. తెలంగాణ వాళ్లు చాలా మంది పార్టీలో చేరేందుకు వస్తున్నారు. వారందరూ చేరిన తర్వాత వారి సలహలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతాం. ప్రభుత్వాలు నడపడం అంటే అనేక సవాళ్లు ఎదరువుతాయి. వాళ్లకు ఆశయాలుంటాయి. చాలెంజింగ్ విషయాలుంటాయి. ఇలాంటి సమయంలో గొడవలు పెట్టుకుని అస్థిరత కు కారణమైతే ప్రజలకు న్యాయం చేయలేమనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాను.

సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్రప్రదేశ్, సామాజిక ఇండియా.. ఇవన్నీ రిసోర్సెస్ మేనేజ్ మెంట్ గురించే కదా? వనరులు పంపిణీ సరిగా జరగడంలేదు. అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కువ శాతం మందికి న్యాయం జరిగేలా ఉండాలి. ఉపాధి కల్పించడం ఏ ప్రభుత్వానికైనా చాలెంజింగ్ విషయమే. ఎకౌంటబులిటీ ఉన్న రాజకీయ పార్టీలు కావాలి. నన్ను బిజెపిలోకి రమ్మన్నారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఇక్కడ స్థాయి బట్టి.. నా బలాన్ని పట్టి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది అప్పుడే డిసైడ్ చేస్తాము. ఎవరి మద్దతు అడగను. నా వరకు నేను చేసుకుని పోతాను. కానీ ఎవరి మద్దతు అడగను. తెలంగాణ సున్నితమైనది కాబట్టి సునిశితంగా పర్యటించాలని పార్టీ నేతలు అన్నారు.

ఈనెల 27 నుంచి అనంతపురంలో కరువు యాత్ర మూడు రోజులు పర్యటిస్తా. మూడు రోజుల పర్యటనలో అక్కడ జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒంగోలు లో ఫ్లోరోసిస్ బాధితులు, కిడ్నీ పేషెంట్లను కలుస్తాం. ఆ తర్వాత విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తా. అక్కడ అణు విద్యుత్ కేంద్రం సమస్యలపై అధ్యయనం చేస్తాను.

Follow Us:
Download App:
  • android
  • ios