Asianet News TeluguAsianet News Telugu

బాబు, మోడీ మన పథకాలు కాపీ కొడుతున్నారు: కేటీఆర్

దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం వరంగల్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ktr comments on Modi and chandrababu in warangal public meeting
Author
Warangal, First Published Mar 7, 2019, 2:49 PM IST

దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం వరంగల్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒక ఆందోళనకారుడు ఒక అద్భుతమైన పరిపాలనాదక్షకుడిగా రూపాంతరం చెందుతున్నారని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తనతో చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో రైతుల గురించి ఆలోచించి, వారి కష్టాలను ఆకలింపు చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. అందుకు తగ్గట్టుగానే రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.

పొద్దున లేచిన దగ్గరి నుంచి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా విధి లేని పరిస్థితుల్లో రైతుబంధును కాపీ కొట్టి ‘‘అన్నదాత సుఖీభవ’’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.

చివరికి దేశ ప్రధాని నరేంద్రమోడీ సైతం ‘‘పీఎం కిసాన్’’ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కేసీఆర్ గారికి వరంగల్ జిల్లా అంటే ఎంతో ఇష్టమైనదన్నారు కేటీఆర్. మనకోసం కేసీఆర్ ఉన్నారని జయశంకర్ అన్నారని కేటీఆర్ తెలిపారు.

ఈ ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలైన రోజులు ఎన్నో ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్రలో చేర్పించి వరంగల్ జిల్లాకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చారని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్‌ అభివృద్ధికి కేసీఆర్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా దేవాదుల నుంచి అత్యధిక స్థాయిలో సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు. రైతు మరణిస్తే... అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. రూ.80 వేల కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చినట్లు... కాళేశ్వరానికి లేదా పాలమూరు-ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్.. ప్రధానిని సభాముఖంగా అడిగారని కానీ ఆయన పట్టించుకోలేదన్నారు.

2014లో ప్రధాని మోడీ ఏదో చేస్తారని ఓట్లేసిన జనానికి ఆయనంటే ఏంటో అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే కేంద్రంలో అధికారం వాటిదేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios