Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి కోదండరామ్?

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కోదండరాంను పోటీ చేయించే యోచనలో స్థానిక టీజేఎస్‌ నేతలు ఉన్నారు. అయితే, కాంగ్రెసు నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతి పోటీకి దించాలని అనుకున్నారు. పద్మావతి పోటీకి సుముఖంగా లేరు.

Kodandaram may contest from Huzurngar
Author
Huzur Nagar, First Published Jun 3, 2019, 8:14 AM IST

నల్లగొండ: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయ్యే హుజూర్ నగర్ శాసనసభ స్థానం నుంచి తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ ను పోటీ దించే ఆలోచన సాగుతోంది. హుజూర్ నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను పోటీకి దించాలని టీజెఎస్ భావిస్తోంది.

గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా పోటీకి దిగాయి. హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఈ నెల 3న రాజీనామా చేయనున్నారు. దీంతో హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కోదండరాంను పోటీ చేయించే యోచనలో స్థానిక టీజేఎస్‌ నేతలు ఉన్నారు. అయితే, కాంగ్రెసు నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతి పోటీకి దించాలని అనుకున్నారు. పద్మావతి పోటీకి సుముఖంగా లేరు. దీంతో ఆమెకు కాకుండా పార్టీలో మరో నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెసు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి శానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దించడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఎన్నికల్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో సైదిరెడ్డికే టికెట్ ఇచ్చి గెలిపించుకుని తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios