Asianet News TeluguAsianet News Telugu

బిటి బ్యాచ్ పై కెసిఆర్ నజర్

  • పక్క చూపులు చూస్తున్న బిటి బ్యాచ్
  • నిఘా నివేదికల ద్వారా కెసిఆర్ నజర్
  • సర్వే ఫలితాల్లో వెనుకబడ్డ వారిలో కొత్త గుబులు
  • బిజెపి టచ్ నిజమేనంటున్న పార్టీ నేతలు
KCR focus on Bt Batch

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనేక పార్టీల నేతలు పెద్ద ఎత్తున అధికార టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణను బంగారు మయం చేసేందుకు బంగారు తెలంగాణ సాధన కోసమే తాము టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వాళ్లంతా ఘనంగా చెప్పుకున్నారు. అలా వలస వచ్చిన వాళ్లలో చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధికార పార్టీలోకి వస్తే ఏదో చేసుకోవచ్చన్న ఆశతో వచ్చిన వారు తమ ఆకాంక్షలు నెరవేరడంలేదని బెంగ పెట్టుకున్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం వచ్చామంటున్నవారు బంగారు తెలంగాణ సాధన గురించి మరచిపోయి భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు.

ఇటీవల కాలంలో అర డజను మంది ఎంపీలు టిఆర్ఎస్ నుంచి జంప్ చేస్తరని, వారంతా బిజెపిలోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. బిజెపి అగ్రనేతలు తమకు టచ్ లో ఉన్నట్లు మహబూబ్ నగర్ కు చెందిన ఒక ఎంపి బాహటంగానే కామెంట్ చేశారు. దీంతో బిజెపి తెలంగాణ టిఆర్ఎస్ ఎంపిలను బుట్టలో వేసుకునే పనిలో నిమగ్నమైనట్లు టిఆర్ఎస్ అధినేత అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. గత నెల రోజుల క్రితం అమిత్ షా తెలంగాణ పర్యటన చేసిన తరుణంలో ఎంపిల జంపింగ్ వ్యవహారంపై సీరియస్ గానే చర్చలు నడుస్తున్నాయి.

ఇక ఎంపి విషయం ఇలా ఉంటే కాంగ్రెస్, టిడిపి, వైసిపి, సిపిఐ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా టిఆర్ఎస్ గూటికి చేరారు. వారిలో కూడా అసంతృప్తి తీవ్రంగానే ఉన్నట్లు టిఆర్ఎస్ అధిష్టానం నోటీసులో ఉంది. వారిలో ఎవరు ఉంటారు? ఎవరు పోతారన్నదానిపై పార్టీ కీలక  నేతలు ఆరా తీస్తున్నారు.

మరోవైపు బిటి బ్యాచ్ కు అత్యంత గుబులు  పుట్టించే అంశమేమంటే గులాబీ దళపతి చేయిస్తున్న వరుస సర్వేలు. ఈ సర్వేల ఆధారంగా రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. దీంతో సర్వే ఫలితాలు అనుకూలంగా లేని బిటి బ్యాచ్ తీవ్ర ఆందోళన చెందుతున్నారట. సర్వే సర్వేకు మధ్య మార్పు లేని వారికి ఇప్పటి నుంచే భవిష్యత్ సీన్ కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. సర్వేలో కొందరు ఎన్నికల ముందు నుంచి ఉన్న యూటి బ్యాచ్ కూడా వెనుకబడ్డారని చెబుతున్నారు. వారు సైతం పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బిటి బ్యాచ్ పై యూటి బ్యాచ్ లో జోకులు పేలుతున్నాయి. బంగారు తెలంగాణ కోసం వచ్చిన వారంతా బంగారు తెలంగాణ అయిందని పోదామనుకుంటున్నరా? లేక బంగారు భారతం కోసం వాళ్లు బిజెపి వైపు చూస్తున్నరా అర్థం కావడంలేదని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. రేపు ఒకవేళ బిజెపి గూటికి చేరితో వారంతా ఎత్తుకునే పల్లవి బంగారు భారత దేశం కోసమే తాము ఈ పనిచేశామని చెప్పుకోక తప్పదని చెబుతున్నారు.

అలా పక్కచూపులు చూసేవాళ్లపై సిఎం కెసిఆర్ నిఘా నివేదికల ద్వారా నజర్ వేశారని పార్టీలో ప్రచారం సాగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios