Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గౌడ్స్ కు కేసిఆర్ వరాల జల్లు

  • హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలంలో గౌడ భవన్ నిర్మాణం
  • 5 కోట్లు నిధులు విడుదల చేస్తాం
  • ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
  • కల్లు దుకాణాలు హైదరాబాద్ లో తెరిపించినం
  • పరిహారాన్ని 5 లక్షలకు పెంచినం
  • పెన్షన్ ను 200 నుంచి 1000 కి పెంచినం
  •  
kcr announces good news for telangana gouds

తెలంగాణ గౌడ్ కులస్తులకు సిఎం కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. గురువారం అసెంబ్లీలో గౌడ కులస్తుల సంక్షేమంపై సిఎం ప్రకటన చేశారు. సిఎం చేసిన పూర్తి ప్రకటన కింద ఉంది చదవండి.

తెలంగాణా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు  ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది.  ప్రధానంగా  వ్యవసాయ అభివృద్ధి, నీటి  వనరుల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం  వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నది.  గ్రామీణ వనరులను ఆశ్రయించి ఎన్నో కులాలకు  జీవిక లభిస్తున్నది. వారి జీవికను కాపాడటం, మెరుగుపరచడం కోసం ప్రభుత్వం  అనేక  రకాల పథకాలను అమలుచేస్తున్నది.  కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజిక వర్గం ప్రధానమైనది. కల్లు గీత వృత్తిగా జీవించే గౌడ కులస్తులు  ససమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు నిర్లక్ష్యానికి గురయ్యారు.       

తెలంగాణ గ్రామీణ జీవితం పై అవగాహన, పట్టింపు లేని సమైక్య   పాలకుల చర్యల మూలంగా  కల్లుగీత వృత్తి మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నుండి   గీత కార్మికులకు ఎలాంటి అండదండ లభించలేదు.  కనీసం వారి మానాన వారు బతికే అవకాశాన్ని  కూడా లేకుండా చేశారు. లిక్కర్ లాబీల ప్రలోభాలకు,  వత్తిడికి తలొగ్గి, హైదరాబాద్ లో కల్లు దుకాణాలను నిర్ధాక్షిణ్యంగా మూసేశారు. సమైక్య పాలకులు చేసిన ఈ దుర్మార్గాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోకపోగా, వంత పాడడం దౌర్భాగ్యం.   మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతుంటే వీళ్లే కండ్లప్పగించి వేడుక చూశారు.  సమైక్య  పాలకులు సృష్టించిన ఈ సామాజిక విధ్వంసం వల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోయింది. ఇటు కల్లు గీత వృత్తి కల్లోలంలో పడింది.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే ప్రస్తావించాం. తెలంగాణ ఏర్పడి, మేము అధికారంలోకి వస్తే మూసేసిన కల్లు దుకాణాలను తెరిపిస్తామని ఉద్యమ నేతగా ఆనాడు నాకు నేనుగా ప్రకటించాను. ప్రజా ఉద్యమం ఫలించి, తెలంగాణ ఏర్పడింది. ప్రకటించిన విధంగానే హైదరాబాద్ లో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించాము. గౌడ కులస్తులకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాం. గౌడ కులస్తుల  సంక్షేమం కోసం మరెన్నో చర్యలు తీసుకున్నాం.

కల్లు  గీసే సమయంలో చెట్టుపై నుంచి పడి మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది.  తెలంగాణ ఏర్పడే నాటికున్న మూడేళ్ల బకాయిలు  మొత్తం 6.38 కోట్ల రూపాయలను మేము అధికారంలోకి రాగానే  వెంటనే ఏకకాలంలో చెల్లించాము.

అంతేకాకుండా అప్పటిదాకా అరకొరగా ఇస్తున్న పరిహారాన్ని  మానవీయ దృక్పథంతో పెంచినం. గతంలో చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి రెండు లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి 50వేలు మాత్రమే  ఇచ్చే వారు.  తెలంగాణా ప్రభుత్వం   ప్రమాద వశాత్తూ  మరణించిన శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు ఇచ్చే  పరిహారాన్ని 5 లక్షలకు పెంచింది. 

ఈ రోజు మీ అందరి సమక్షంలో గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని మానవీయ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను.

గీత కార్మికులకిచ్చే పెన్షన్ ను 200 నుంచి 1000 రూపాయలకు పెంచాం. ఇప్పటి వరకూ  కల్లు గీత సొసైటీ సభ్యులకు మాత్రమే పెన్షన్ లభిస్తున్నది. ఇక నుంచి టి.ఎఫ్.టి. కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 30వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుంది.

టి.ఎఫ్.టి. నుంచి టి.సి.ఎస్. లోకి మారాలని దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులను ఆదేశించాం.

Follow Us:
Download App:
  • android
  • ios