Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ సమ్మే ఎఫెక్ట్.. కేసీఆర్‌కు అదేం ఆషామాషి కాదు

సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందా అనే చర్చ అన్ని వర్గాల్లో నడుస్తుంది. ఒకరేమో హుజూర్ నగర్ లో డిపో లేదు కాబట్టి ఇక్కడ ఆ ప్రభావం ఉండదని అంటుంటే, ఇంకొందరేమో ఆర్టీసీ సమస్య ఎప్పుడో ఆర్టీసీ కార్మికులను దాటి, సామాన్య ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు. 


 

its-a-neck-and-neck-situation-in-huzurnagar
Author
Hyderabad, First Published Oct 16, 2019, 5:55 PM IST

హుజూర్ నగర్: రాష్ట్రంలో వాతావరణం చల్లగానే ఉన్నా రాజకీయాలు మాత్రం మాంచి కాక మీదున్నయ్యి. ఒక వైపేమో ఆర్టీసీ సమ్మె, మరోవైపేమో హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఈ రెండు అంశాల వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు చర్చించుకున్నా అందులో ఖచ్చితంగా ఈ టాపిక్ ఉండి తీరుతుంది. 

సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందా అనే చర్చ అన్ని వర్గాల్లో నడుస్తుంది. ఒకరేమో హుజూర్ నగర్ లో డిపో లేదు కాబట్టి ఇక్కడ ఆ ప్రభావం ఉండదని అంటుంటే, ఇంకొందరేమో ఆర్టీసీ సమస్య ఎప్పుడో ఆర్టీసీ కార్మికులను దాటి, సామాన్య ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు. 

ఇప్పటికిప్పుడు తెరాస మీద డైరెక్ట్ గా ఎంత ప్రభావం చూపనుందో చెప్పలేము కానీ, ప్రతిపక్ష ఓటును చీలకుండా నివారించగలిగిందన్న విషయం అర్థమవుతుంది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్, తెరాస ల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. తెరాస కు ప్రత్యామ్నాయం మేమె అన్న బీజేపీ, వారి స్టార్ క్యాంపెయినర్లయినా మోడీ ని కానీ అమిత్ షా ని కానీ రంగంలోకి దింపకపోవడంతో బీజేపీ ప్రెజన్స్ అంతలా కనపడడం లేదు. 

కమ్యూనిస్టులు బరిలో లేరు. సిపిఐ పోటీలో తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో తొలుత తెరాస కు మద్దతు ఇచ్చినా, ఆర్టీసీ సమ్మెపైన తెరాస వైఖరికి నిరసనగా తమ మద్దతు ఉపసంహరించుకుంది. మరో కమ్యూనిస్టు పార్టీ సీపీయం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో వారి అభ్యర్థిని ఎన్నికల సంఘం బరిలోంచి తప్పించింది. దానితో వారు తెలంగాణ ప్రజా పార్టీకి తమ మద్దతు అని ప్రకటించారు. 

ఇది ప్రధాన పార్టీల పరిస్థితి కాగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న ఒకింత తనదైన ప్రచారశైలితో దూసుకుపోతున్నాడు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అసలు గ్రౌండ్ లెవెల్ లో ఉంటుందా అనేదే ప్రశ్న. ఒకవేళ సోషల్ మీడియా ఫాలోయింగ్ నేరుగా అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయంటే పవన్ కళ్యాణ్ ఈపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రయ్యేవాడు. 

ఇక బీజేపీపై స్వామి భక్తిని ప్రకటించుకోవడానికి, తాము కాంగ్రెస్ తో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకున్నామని చూపెట్టేందుకు టీడీపీ ఇక్కడ ఏకంగా మాజీ పార్టనర్ కాంగ్రెస్ మీదనే అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇప్పటికే క్యాడర్ పూర్తిగా దూరమవడం, సహజంగానే టీడీపీ అంటే తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీగా ప్రజల్లో ఉన్న ఫీలింగ్ కారణం చేత వారు పెద్ద ప్రభావం చూపే ఆస్కారం ఏ కోశానా కనపడడం లేదు. ఇలా అన్ని విషయాలను బట్టి గమనిస్తే అపోజిషన్ పార్టీలు చాలా ఉన్నా బలంగా ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. 

ఈ ఎన్నికలో తెరాస తరుపున గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన శానంపూడి సైది రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరుఫున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ పడుతున్నారు. టీడీపీ తరుపున చావా కిరణ్మయి బరిలో నిలువగా బీజేపీ నుంచి రామారావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

అక్కడ ప్రజల మధ్య చర్చలు జరిగినా ఈ రెండు పార్టీలకు సంబంధించి జరుగుతుంది తప్ప, వేరే ఏ పార్టీ కూడా మనకు తెర మీద కనపడడం లేదు. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. ఒకడుగు ముందుకేసి కొందరైతే ఈ అన్ని పార్టీలకు కలిపి తెరాస కాంగ్రెస్ ల మధ్య ఉండే ఓట్ల తేడా అంత కూడా వీరి ఓట్ల శాతం ఉండదని జోస్యం చెబుతున్నారు. 

ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ ఉప ఎన్నిక 2018 అసెంబ్లీ ఎన్నికల మాదిరి కెసిఆర్ కు రెఫరెండం గా తయారయ్యాయి. కెసిఆర్ ను మెచ్చితే తెరాస కు లేదంటే ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఓటు వేసేలా అక్కడ పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఇమేజ్ కు వచ్చిన ఢోకా ఏమీ లేకున్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె మాత్రం కెసిఆర్ కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా కనపడుతుంది. 

కెసిఆర్, ఆర్టీసీ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న నేపథ్యంలో ఇద్దరు కార్మికులు ఆత్మబలిదానం చేసుకున్న దురదృష్ట సంఘటన మనం చూసాము. ఈ ఆత్మ బలిదానాల వల్ల ఆర్టీసీ కార్మికుల స్థాయిని దాటి ఈ సమ్మె సాధారణ ప్రజల్లోకి కూడా చొచ్చుకుపోయింది. సిపిఐ మద్దతు ఉపసంహరించుకోవడం ఈ విషయాన్నీ మనకు స్పష్టం చేస్తుంది. 

విపక్షాల మధ్య ఓట్లు చీలినప్పుడు కెసిఆర్ కు గెలుపు తేలికవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో ఏ ఒక్కరికి కూడా గంప గుత్తగా ఓట్లు పడకపోవడం, ప్రభుత్వఅనుకూల ఓటంతా తెరాస కె పడడం వల్ల కెసిఆర్ గెలుపు తేలికవుతుంది. 

ఈ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాదు, కరీంనగర్ స్థానాల్లో తెరాస ఓడిపోపోవడానికి బీజేపీ బలం కన్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా బీజేపీ కి పడడం వల్ల గెలవడం సాధ్యపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకున్నప్పటికీ, చంద్రబాబు ఎంట్రీ వల్ల వేరే ఆప్షన్ లేక, తెలంగాణ సెంటిమెంట్ వల్ల ప్రజలు తెరాస కు ఓట్లు వేశారు. 

ఇప్పుడు నెపం తోయడానికి చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిలేడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా ఆర్టీసీ సమ్మె పైన పెద్దగా స్పందించడం లేదు. తద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని కెసిఆర్ కు దక్కకుండా వారు వారి పరిధినెఱిగి నడుచుకుంటున్నారు.  

ఈ కారణాల నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్న విధంగా ఉండబోతుందనడంలో నో డౌట్. గెలిచి తొలి స్థానం సాధించిన పార్టీకి రెండో స్థానంలో నిలిచినా పార్టీకి ఓట్ల తేడా పెద్దగా ఉండదనేది మాత్రం ఖచ్చితం. ఈ తరుణంలో పోల్ మానేజ్మెంట్ ఎవరు పక్కాగా ప్లాన్ చేసుకుంటారో వారినే విజయం వరిస్తుంది. రేపటి కెసిఆర్ మీటింగ్ పైన్నే తెరాస శ్రేణులు ఆశలు పెట్టుకోగా, ఆర్టీసీ సమ్మెపైన కాంగ్రెస్ పార్టీ భారీస్థాయిలో ఆశలను పెంచుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios