Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ మోత్కుపల్లి... టిఆర్ఎస్ పనేనా ?

  • రాజకీయాల్లో కలకలం రేపుతున్న మోత్కుపల్లి కామెంట్స్
  • తెలంగాణలో టిడిపిని మూసేద్దామన్న ప్రకటనతో దుమారం
  • మంద కృష్ణ మాదిగను కట్టడి చేసేందుకు టిఆర్ఎస్ స్కెచ్ వేసిందా అన్న చర్చ
  • మోత్కుపల్లికి రాజ్యసభ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం
  • అయోమయంలో తెలుగుదేశం తెలంగాణ శ్రేణులు
Is motkupally being used by trs as damage control after krishna  madiga arrest

తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల్లో మోత్కుపల్లి నర్సింహులు ఎపిసోడ్ సెగలు రేపుతున్నది. ఉండి ఉండి ఎన్టీఆర్ వర్ధంతి నాడే మోత్కుపల్లి బాంబు పేల్చడం వ్యూహాత్మకమా? లేక బాధను దిగమింగుకోలేక చేసిండా అన్న చర్చ ఊపందుకుంది. కానీ మోత్కుపల్లి చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఎపిలోనూ తలనొప్పులు తెప్పిస్తున్నాయి. అసలు మోత్కుపల్లి ఎందుకు ఇంతటి సంచలన కామెంట్స్ చేశారు? తెలుగుదేశం పార్టీని మూసేయాలని ఎందుకు అంతటి కరుకు పదాలు ఆయన నోటినుంచి వచ్చాయి??? మోత్కుపల్లి తనే స్వయంగా కామెంట్స్ చేశారా? లేక వెనక టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఏదైనా ఉందా అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతికే పరిస్థితి లేదు. తక్షణమే టిడిపి ని టిఆర్ఎస్ లో విలీనం చేయడం మంచిది. అని మోత్కుపల్లి ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ప్రకటించారు. నిజానికి తెలంగాణలో టిడిపి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నమాట వాస్తవం. తెలంగాణ వచ్చిన తర్వాత వరుసపెట్టి పార్టీ నేతలంతా బంగారు తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ఇంకా చేస్తున్నారు. గత మూడేళ్లుగా వరుసగా టిఆర్ఎస్ గూటికే టిడిపి నేతలంతా చేరిపోతుండగా ఆ సాంప్రదాయానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. అందరూ టిఆర్ఎస్ గూటికి చేరుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరిపోయారు. రేవంత్ తో పాటు ములుగు సీతక్క, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా అడుగుబొడుగు ఉన్న నాయకులు సైతం కాంగ్రెస్ వైపో.. టిఆర్ఎస్ వైపో వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే మోత్కుపల్లి మాత్రం ఇంతకాలం టిడిపిలోనే ఉన్నారు. కానీ గత కొంతకాలంగా మోత్కుపల్లి ఒక్కో మెట్టు ఎక్కుతూ టిఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా మోత్కుపల్లి కామెంట్ చేయడం వెనుక అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. తనంతట తానే.. టిఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు మోత్కుపల్లి ఈ కామెంట్స్ చేశారని కొందరంటున్నారు. లేదు టిఆర్ఎస్ నుంచి సంకేతాలు అందిన తర్వాతే మోత్కుపల్లి ఇలాంటి కామెంట్స్ చేశారని మరికొందరంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం మోత్కుపల్లి తనకు గవర్నర్ పదవి వస్తుందని ఆశించారు. ఆయనకు గవర్నర్ పదవి ఖాయమని పార్టీ అధినేత ఆశ పెట్టారు. కానీ కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు ఎందుకనో మోత్కుపల్లిని గవర్నర్ గా చేసేందుకు ఇష్టపడినట్లు లేదు. ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి తన నిర్ణయం తాను తీసేసుకున్నారా అన్న చర్చ కూడా జరుగుతున్నది.

ఇంకో హాట్ కామెంట్ కూడా నడుస్తోంది. తెలంగాణలో మాదిగలు టిఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నారు. బలమైన సామాజికవర్గమైనప్పటికీ గడిచిన నాలుగేళ్లుగా మాదిగల విశ్వాసాన్ని టిఆర్ఎస్ సర్కారు పొందలేకపోయింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను పదవినుంచి తొలగించడం, ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగను రెండుసార్లు జైలుపాలు చేయడం హాట్ టాపిక్ అయింది. మంద కృష్ణ అరెస్టు తర్వాత మాదిగలు మరింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికితోడు తెలంగాణ దళితవాడల్లో దరిద్రాన్ని పారదోలేందుకే ఎస్సీ డెలవప్ మెంట్ శాఖను తన వద్ద ఉంచుకుంటున్నట్లు తెలంగాణ వచ్చిన కొత్తలో కేసిఆర్ ప్రకటించారు. కానీ కొద్దిరోజుల తర్వాత ఆ శాఖను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి కూడా అర్హులైన వారికి దక్కలేదు. ఈ విషయంలో మాదిగలు కొంత ఆగ్రహంతో ఉన్నట్లు టిఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు మంద అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గుజరాత్ ఎమ్మెల్యే వచ్చి మందను పరామర్శించి వెళ్లడం గమనార్హం.

ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకిగా ఉన్న మంద కృష్ణను ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలు... ఎవరూ టిఆర్ఎస్ లో లేరని ఆ పార్టీ అంచనాల్లో ఉంది. పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ మంద స్థాయికి సరిపోయే స్థితిలో లేరన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మందకు ధీటైన నేతగా మాదిగ కులానికి చెందిన మోత్కుపల్లిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా మందపై ఎటాక్ చేయించవచ్చని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అందుకోసమే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మోత్కుపల్లికి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం ఊపందుకున్నది. అదే జరిగితే టిడిపి ఇప్పిస్తానని చెప్పిన గవర్నర్ పదవి ఇప్పించకపోయినా.. టిఆర్ఎస్ రాజ్యసభ ఇచ్చింది అని మాదిగ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవచ్చన్న ధోరణితో ఉన్నట్లు చెబుతున్నారు.

మోత్కుపల్లి ఎంతటి వాగ్ధాటి ఉన్న నాయకుడో.. ప్రత్యర్థులను ఎంతగా చిత్తు చేయగలరో అందరికీ తెలిసిందే... గతంలో ఉద్యమ కాలంలో కొన్ని సందర్భాల్లో కేసిఆర్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టిన దాఖలాలున్నాయి. ఈ పరిస్థితుల్లో.. మంద కృష్ణ మాదిగ చేసేది కేవలం స్వ ప్రయోజనాల కోసమే అని జనాల్లో చర్చను లేవనెత్తేందుకే మోత్కుపల్లిని ఆపరేట్ చేస్తున్నారా అన్న అనుమానాలు ఇటు ఎమ్మార్పీఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఈ విషయాన్ని ఒక ఎమ్మార్పీఎస్ నేత ఏషియానెట్ తో ధృవీకరించారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదని మంద కృష్ణ బలమైన వాదన తెస్తున్నారు. కడియం శ్రీహరి ఎస్సీ అయినప్పటికీ ఆయన మాదిగ కాదని మంద ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మందను కార్నర్ చేయాలంటే.. మోత్కుపల్లి లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు కావాలని టిఆర్ఎస్ వ్యూహరచన చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఇంతకాలం టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని మోత్కుపల్లి ఆరాటపడ్డారు. ఆ దిశగా టిడిపి శ్రేణులను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. రానున్న ఎన్నికల్లో అలా పొత్తు పెట్టుకుని గెలవడం ద్వారా కచ్చితంగా మంత్రి కావొచ్చన్న ఉద్దేశంతోనే మోత్కుపల్లి స్కెచ్ ఉందేమో అని టిడిప వర్గాలు అనుమానిస్తున్నాయి. కానీ పొత్తు విషయంలో కేడర్ అనుకూలంగా లేకపోవడం కారణంగా పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయరాదని అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో... ఇక లాభం లేదనుకున్న మోత్కుపల్లి తీవ్రమైన కామెంట్స్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు టిడిపిని ఖతం చేయడం.. అటు తలనొప్పి తెస్తున్న మంద కు చెక్ పెట్టడం రెండూ మోత్కుపల్లి ద్వారా టిఆర్ఎస్ ఆపరేట్ చేసే అవకాశం ఉందని రాజకీయాల్లో ఒకటే చర్చ.

Follow Us:
Download App:
  • android
  • ios