Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసు మేనిఫెస్టో, ఎపికి బాబు హామీలు: ఉత్తమ్ కు హరీష్ బహిరంగ లేఖ పూర్తి పాఠం

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమా రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కాంగ్రెసు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయలేదనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తెచ్చారు. అలాగే ఎపిలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని కూడా ఆయన అందులో ప్రస్తావించారు. 

Harish Rao writes open letter to Uttam
Author
Hyderabad, First Published Nov 29, 2018, 12:31 PM IST

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత హరీష్ రావు గురువారంనాడు సుదీర్ఘమైన లేఖ రాశారు. గతంలో కాంగ్రెసు తన మానిఫెస్టోలోని అంశాలను ఎలా అమలు చేయలేదనే విషయాన్ని ఆయన ఉత్తమ్ దృష్టికి తెచ్చారు. అలాగే, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని అమలు చేయలేదని విమర్శించారు. హరీష్ రావు రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

                                                                                                                                                                                                                                         29/11/2018,
                                                                                                                                                                                                                                         హైదరాబాద్. 

శ్రీయుత ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,            

అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి.                         
    
నమస్కారములు. 

ప్రజలను మభ్య పెట్టడంలో మీకున్న నేర్పరి తనాన్నంతా రంగరించి పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో మీ పార్టీ తరుఫున 2018 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మానిఫెస్టో ప్రకటించారు. ఇందులో అనేక హామీలు పొందుపరిచారు. అరచేతిలో స్వర్గం ఆవిష్కరించారు. ప్రజలను భ్రమపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దయచేసి సమాధానాలు చెప్పి, మీ చిత్తశుద్దిని చాటుకోగలరని కోరుతున్నాను. 
రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలను ఎందుకు ప్రకటిస్తాయి? ప్రజలకు మాయమాటలు చెప్పి, ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవడానికా? అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికా? 

ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వస్తున్నదంటే, ఇప్పుడు మీరు అనేక హామీలు ఇచ్చినట్లే 2004, 2009 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టోల్లో కూడా అనేక హామీలిచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అనేక హామీలిచ్చింది. కానీ అమలు చేయలేదు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎపిలో అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు మీరూ, చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. మాట నిలబెట్టుకోలేని మీ అసమర్థతకు ప్రాయశ్చిత్తం ప్రకటించండి. గతంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండానే, మళ్ళీ కొత్తగా హామీలివ్వడం ఆత్మవంచన కాదా? మీ అంతరాత్మ సాక్షిగా సమాధానం చెప్పండి. 2004 నుంచి 2014 వరకు మీతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న చాలా మంది నాయకులు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. అప్పుడు ప్రభుత్వంలో ఉండి, ఇచ్చిన హామీలు అమలు చేయని మీకు మళ్లీ కొత్తగా హామీలిచ్చే నైతిక హక్కు ఉంటుందా? ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 

2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను మీరు మరిచిపోయి ఉండవచ్చు. కానీ ఆ హామీలు నమ్మి ఓటేసిన ప్రజలు మాత్రం మరిచిపోలేదు. ఇచ్చిన హామీలను పేజీ నెంబర్లతో సహా మీకు పంపుతున్నాను. వాటిని ఎందుకు అమలు చేయలేదో కారణాలు చెప్పి, అమలు చేయనందుకు, ప్రజలను వంచించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. 
2004 - కాంగ్రెస్ మానిఫెస్టోలోని ముఖ్యాంశాలు

1. ప్రైవేటు రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. (పేజీ నెంబరు 16)
ఎలాంటి చట్టం చేయలేదు. 

2. ఐదేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ. పేజీ నెంబరు 28
చెప్పినట్టు ఉద్యోగాల భర్తీ జరగలేదు. 
ఎపిపిఎస్సీ రికార్డులే సాక్ష్యం. 

3. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో 50 వేల ఎస్సీ, ఎస్టీ, 70 వేల బిసి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. (పేజీ నెంబరు 27)
భర్తీ చేయలేదు. ఎపిపిఎస్సీ రికార్డులే సాక్ష్యం. 

4. తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తాం. (పేజీ నెంబరు 30)
రెగ్యులరైజేషన్ చేయలేదు. 

5. వడ్డెరలు, రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తాం. (పేజీ నెంబరు 17)

చేర్చలేదు. ఇప్పుడు కూడా మళ్లీ అదే హామీ ఇస్తున్నారు. 

6. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. (పేజీ నెంబరు 17)
అసలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు.

7. వృద్దులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ రూ.225కు పెంచుతాం. (పేజీ నెంబరు 27) 
కేవలం 200కు పెంచారు. అందులో కూడా 25 రూపాయలు కోత పెట్టారు. 

8. తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తాం. (పేజీ నెంబరు 27)
ఒక్క తండాను కూడా గ్రామ పంచాయితీ చేయలేదు

9. హైదరాబాద్ నగరంలో భూగర్భ రైలు మార్గం నిర్మిస్తాం. పేజీ నెంబరు 24
నిర్మించలేదు. అసలు ఆ ఊసే లేదు.

10. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందించడానికి పకడ్బందీగా చర్యలు. (పేజీ నెంబరు 20)
పదేళ్లలో ఒక్క ఏడాది కూడా సకాలంలో అందలేదు

11. పరిశ్రమల్లో 50 శాతం ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం. (పేజీ నెంబరు 12)
స్థానికులకు రిజర్వేషన్ కు సంబంధించి ఎలాంటి చట్టం చేయలేదు. జీవో జారీ కాలేదు

12.జనతా చీరలు, దోవతుల పథకం పునరుద్దరణ. (పేజీ నెంబరు 24)
పునరుద్ధరించలేదు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేదు

13.గ్రామీణ యువత కోసం వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు. బోర్డు ద్వారా రుణాలు. (పేజీ నెంబరు 23)
అలాంటి బోర్డు ఏర్పాటు కాలేదు. రుణాలు రాలేదు

14.హైదరబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ల నిర్మిస్తాం. (పేజీ నెంబరు 14)
ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు

15. పట్టణ పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్యాకేజీ. (పేజీ నెంబరు 14)
ఏలాంటి ప్యాకేజి ఇవ్వలేదు

16. మైనారిటీ మహిళా సంక్షేమ సంస్థ ఏర్పాటు. (పేజీ నెంబరు 29)
ఏర్పాటు కాలేదు

17. ప్రతీ ఏటా లక్ష హెక్టార్లకు అదనంగా సాగునీరు. (పేజీ నెంబరు 21)
పదేళ్లలో ఒక లక్ష ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వలేదు. ఉన్న ఆయకట్టు ఊడింది.

18. నిజామాబాద్ లెండి, ఆదిలాబాద్ పెన్ గంగ ప్రాజెక్టుల పూర్తి. (పేజీ నెంబరు 21)
ఆ ఊసే లేదు

19. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపు. (పేజీ నెంబరు 21)
నిల్వ సామర్థ్యం తగ్గింది తప్ప పెరగలేదు. కాల్వలు శిథిలమయ్యాయి. నీరే లేదు. 

20. ఆదిలాబాద్ జిల్లాలో మందాకిని కాలువ నిర్మాణం. (పేజీ నెంబరు 21)
చేయలేదు

21. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాల సత్వర పూర్తి. పేజీ నెంబరు 22
2014 వరకు పదేళ్లు గడిచినా పూర్తి చేయలేదు

22. గోదావరి జలాల సంపూర్ణ వినియోగానికి అత్యధిక ప్రాధాన్యత. (పేజీ నెంబరు 22)
గోదావరిపై ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు

23. ఎల్లంపల్లి, ఇంచంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల సత్వర పూర్తి. (పేజీ నెంబరు 22)
పదేళ్ళు గడిచినా ఏ ఒక్కటీ పూర్తి కాలేదు

24. పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, పెండింగ్ లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను చేపడతాం. (పేజీ నెంబరు 22)
ఏ రాష్ట్రంతో ఏ ఒప్పందమూ చేసుకోలేదు.

25. ఐదేళ్ళలో 1,060 కోట్లతో 5లక్షల హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్. (పేజీ నెంబరు 21)
చేయలేదు

26. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం పారిశ్రామిక పునరావాస బోర్డు ఏర్పాటు. (పేజీ నెంబరు 22)
ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయలేదు. ఒక్క పరిశ్రమను కూడా పునరుద్ధరించలేదు

27. చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు రుణ సౌకర్యం. (పేజీ నెంబరు 22)
అలాంటి ప్రయత్నమే జరగలేదు. దీనికోసం ప్రత్యేక విధానం తీసుకురాలేదు

28. పేదలందరికీ గృహ నిర్మాణం. పేజీ నెంబరు 30
అందరికీ జరగలేదు

2009 కాంగ్రెస్ మానిఫెస్టోలోని ప్రధానాంశాలు

1. జూన్ 1, 2009 నుంచి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తాం. (పేజీ నెంబరు 25)
చేయలేదు. విద్యుత్ కోతలు ఆగలేదు.

2. జూన్ 1, 2009 నుంచి రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తాం. (పేజీ నెంబరు 25)
3-4 గంటలు కూడా ఇవ్వలేదు. 

3. ప్రతీ వ్యక్తికి నెలకు ఆరు కిలోల రేషన్ బియ్యం అందిస్తాం. (పేజీ నెంబరు 25)
నాలుగు కిలోలు మాత్రమే ఇచ్చారు

4. ప్రతీ ఇంటికీ గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం. (పేజీ నెంబరు 25)
పేదలందరికీ ఇవ్వలేదు. లక్షల దరఖాస్తులు పెండింగులో పెట్టారు. 

5. వంటగ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తాం. (పేజీ నెంబరు 25)
83.21 శాతం పెంచారు- 2004లో ధర: 261.60    -2014లో ధర: 479.77

6. కొత్తగా 24.5 లక్షల ఆయకట్టును సృష్టించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తాం. (పేజీ నెంబరు 27)
2004లో చెప్పి, నిలబెట్టుకోలేదు. 2009లో మళ్లీ హామీ ఇచ్చి, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 

7. నాలుగేళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తాం. (పేజీ నెంబరు 16)
2004లో కూడా ఇదే హామీ ఇచ్చారు. అందరికీ ఇండ్లు నిర్మించలేదు

8. కెజి నుంచి పిజి  వరకు ఉచిత విద్య అందిస్తాం. (పేజీ నెంబరు 28)
ఎలాంటి ప్రయత్నం చేయలేదు

9. తండాలను గ్రామ పంచాయితీలుగా మారుస్తాం. 
మానిఫెస్టో విడుదల సందర్భంగా వైఎస్, డిఎస్ ప్రకటించారు. 
2004లో కూడా ఇలాగే చెప్పారు. 2009లో కూడా ఇలాగే చెప్పారు. కానీ చేయలేదు

చంద్రబాబు వైఫల్యాలపై కాంగ్రెస్ పుస్తకం, నిరసన వారం

# తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందినట్లు ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపై ఏకంగా ఓ పుస్తకమే ముద్రించింది.

# చంద్రబాబు పాలన నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2018 జూన్ లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 

# ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు పాలన చేతకావట్లేదు అని తీర్పు ఇచ్చిన మీరు తెలంగాణలో ఆయనను వెంట బెట్టుకుని తిరుగుతున్నరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడెట్ల చెల్లుతది.

# అక్కడ వద్దన్న బాబును ఇక్కడెందుకు రుద్దుతున్నరు? 

# 2004, 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. 

# 2014లో ఆంద్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. 

# ఇప్పుడు ఆ రెండు పార్టీలే జత కలిసి తెలంగాణలో కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకటించారు. 

# అవకాశం ఉన్న చోట, అధికారం ఉన్న చోట హామీలు అమలు చేయని మీకు, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి హామీలిచ్చే నైతిక హక్కున్నదా? తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మేంత అమాయకంగా ఉన్నారా? 

2014లో చంద్రబాబు హామీలు – విస్మరణ

# 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లెక్కలేనన్ని హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 

# రైతులకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉండగా, ఇప్పటికి కేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది. 

# రుణమాఫీ జరుగుతుందని ఆశపడి, రుణాలు చెల్లించని రైతులు ఇప్పుడు డిఫాల్టర్లుగా, నేరస్తులుగా ముద్ర పడ్డారు. వారికి బ్యాంకులు మళ్లీ రుణాలు ఇవ్వడం లేదు. వారికి పావలా వడ్డీ రుణాలు పొందే అవకాశం కోల్పోయారు. వారి పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి. వారి భూములు కుదవపడి ఉన్నాయి.

# ఇలాంటి కూటమి నాయకులు తెలంగాణలో మాత్రం 2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామంటున్నారు. 

# డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్కో మహిళకు సగటున 30వేల రూపాయలు రుణమాఫీ జరగాల్సి ఉండగా, నామమాత్రంగా కేవలం 6వేలు మాత్రమే మాఫీ జరిగింది. దీంతో మహిళలు డిఫాల్టర్లుగా మారారు. వారికి వడ్డీ లేని రుణం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకులకే వెళ్లలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏర్పడింది. 

# బాబు వస్తేనే, జాబు వస్తుంది అని నినాదం ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం కాదు కదా, కనీసం వంద కుటుంబాలకో ఉద్యోగం కూడా రాలేదు. 

# నిరుద్యోగులకు 2వేల భృతి ఇస్తామన్నారు. నాలుగేళ్ల పాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ సారి బడ్జెట్లో మాత్రం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇలాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణలో 3వేల భృతి ఇస్తామంటే ఎవరు నమ్మాలి. 

# కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ ఏమైందని అడిగితే లాఠీలతో కొట్టి, జైళ్లలో పెడుతున్నారు. 

# ఇట్ల చెప్పుకుంటూ పోతే, దాదాపు 600 హామీలిస్తే దేన్నీ అమలు చేయలేదు. 

# అలాంటి బాబు పాలనను మీరు ఆదర్శంగా చూపే ప్రయత్నం చేయడం దారుణం. విడ్డూరం. 

# మాట మీద నిలబడని చంద్రబాబు.. వెన్నుపోటుకు మారుపేరైన చంద్రబాబు... ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు... మాట మార్చడంలో సాటిలేని చంద్రబాబు.. యూటర్న్ లు చంద్రబాబు మీకు ఆదర్శమా? 

మీరు మరోసారి మీరు గతంలో విడుదల చేసిన మానిఫెస్టోలను, ఇచ్చిన హామీలను చదువుకోండి. వాటిని అమలు చేయకపోవడంతో ప్రజల్లో మీరు విశ్వసనీయత కోల్పోయారు. మీరు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీది ప్రజా కూటమి కాదు, దగా కూటమి అని తేలిపోయింది. మీరు ఇచ్చిన హామీలను ఆపద మొక్కులుగానే భావిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేసే పరిస్థితి తెలంగాణలో లేదు.  
                                
తన్నీరు హరీశ్ రావు                

నీటి పారుదల శాఖ మంత్రి

Follow Us:
Download App:
  • android
  • ios