Asianet News TeluguAsianet News Telugu

దేశాలు తిరిగిన అనుభవంతో.. నిరుద్యోగులకు టోపీ

నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 50 మంది దగ్గర రూ.2 కోట్లు వసూలు చేసి విదేశాలకు పారిపోతున్న ఘరానా మోసగాణ్ణి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 

HABITUATED FRADUSTER arrest by hyderabad police
Author
Hyderabad, First Published Nov 6, 2018, 11:29 AM IST

నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 50 మంది దగ్గర రూ.2 కోట్లు వసూలు చేసి విదేశాలకు పారిపోతున్న ఘరానా మోసగాణ్ణి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన వోస గంగాధర్ అలియాస్ గోలివడ్డ గంగాధర్ అలియాస్ కస్తూరి ప్రకాశ్..  ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేశాడు..

అనంతరం 1989లో వర్క్ వీసాపై షార్జాకు వెళ్లాడు. అక్కడ అలికో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫ్యాబ్రికేటర్, గ్లాస్ కట్టర్, టెక్నీషియన్‌గా ఐదేళ్లపాటు పనిచేశాడు. తర్వాత భారత్‌కు తిరిగొచ్చి పెళ్లి చేసుకున్నాడు. బతుకు తెరువు కోసం దుబాయ్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్రినిడాడ్, ఖతార్, బ్యాంకాక్, బహ్రెయిన్, జోర్డాన్, ఇండోనేషియా వంటి దేశాలు చుట్టేశాడు.

వివిధ దేశాలు తిరిగిన అనుభవం ఉండటంతో.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ట్రావెల్ ఏజెంట్‌గా అవతారమెత్తాడు. పలు దేశాలు తిరిగిన అనుభవముండటంతో ఇమ్మిగ్రేషన్, వీసా ఎలా పొందాలనే అంశాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఎలా ఇవ్వాలో బాగా తెలుసు.. ఈ అనుభవంతో అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుని... గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. త్వరగా డబ్బు సంపాదించుకోవచ్చుననే ఆశతో పలువురు నిరుద్యోగులు అతనికి రూ.4 నుంచి 5 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు పాస్‌పోర్టులు కూడా ఇచ్చారు.

ఢిల్లీలో ఉన్న ఇండో-ఇజ్రాయెల్ ట్రావెల్స్ సంస్థ యజమాని పునీత్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయించడం.. హోటల్‌ ఇన్విటేషన్ లెటర్లు ఇప్పించాడు. వాటిని తనకు డబ్బు చెల్లించిన వారికి చూపించి.. రేపు మాపో అంటూ తిప్పించాడు. వాళ్లు తిరిగి తనను ప్రశ్నించకుండా.. అడ్రస్ మార్చేసి.. నంబర్లు మార్చేశాడు.

2015 నుంచి ఈ విధంగా సుమారు 50 మందిని మోసం చేశాడు.. ఇతనిపై పలు కేసులు నమోదవ్వడంతో గంగాధర్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. తన గుట్టు తెలిసిపోవడంతో.. అబిడ్స్‌లోని ఐ లింక్ ట్రావెల్స్ ద్వారా ఈక్వెడార్ నుంచి తెప్పించుకున్న ఆఫర్ లెటర్ల ఆధారంగా కుమారుడిని తీసుకుని పారిపోయేందుకు స్కెచ్ వేశాడు.

ఇతనిపై నిఘా ఉండటంతో... టికెట్లు కొనుగోలు చేసిన చిరునామా ఆధారంగా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం తండ్రి, కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మీద రెండు పాస్‌పోర్టులు, 3 ఆధార్ కార్డులు, రెండు పాన్‌కార్డులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

గంగాధర్ వద్ద నుంచి రెండు పాస్‌పోర్టులు, 3 ఆధార్ కార్డులు, 2 పాన్‌కార్డులు బాధితులకు చెందిన 9 పాస్‌పోర్టులు, రూ.8.6 లక్షల నగదు, 3,100 అమెరికా డాలర్లు, నకిలీ ఎస్ఎస్‌సీ, ఇంటర్ సర్టిఫికేట్లు, ఈక్వెడార్ దేశానికి చెందిన నాలుగు ఇన్విటేషన్ లెటర్లు, రెండు మొబైల్స్, 6 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios