Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు జిల్లాకు గుడ్ న్యూస్

మే 10 తర్వాత జనాల కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయట
good news for mahabubnagar people

గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని తెలంగాణ జిల్లాల్లో పాలమూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. అటువంటి జిల్లాలో మే 10 తారీఖు నాటికి తాగునీళ్లు అందించేందుకు సర్కారు ప్రయత్నం చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 1305 ఆవాసాలకు బల్క్ గా మిషన్ భగీరథ నీళ్లు సరాఫరా అవుతాయన్నారు మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జులై నాటికి ఇంట్రా పనులు పూర్తి చేసి, ఇంటింటికి నల్లాతో నీటిని అందిస్తామన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలోని మిషన్ భగీరథ పనులను ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్.డబ్ల్యు,ఎస్. కార్యదర్శి స్మితాసభర్వాల్, ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి తో కలిసి ముందుగాల మన్యంకొండ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను చూసిన ప్రశాంత్ రెడ్డి, పనులు ఆలస్యంగా చేస్తున్నారని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులపై సీరియస్ అయ్యారు. మొత్తం రాష్ట్రంలోనే ఇక్కడ పనులు చాలా స్లో గా జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజుల్లోగా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ట్రీట్ మెంట్ ప్లాంట్ లో ట్రయల్ రన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పనులకు సమాంతరంగా పైప్ లైన్ గ్యాప్ లను ఫిక్స్ చేయాలన్నారు.

ఆ తర్వాత మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహబూబ్ నగర్ జిల్లా మిషన్ భగీరథ పనులపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాప్ ల సహాయంతో పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులు ఆలస్యం కావడానికి వర్క్ ఏజెన్సీతో పాటు సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లేబర్ ను పెంచి త్వరగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సమీక్ష సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి శుద్ధి చేసిన మంచినీటిని అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ,దైవకార్యం మిషన్ భగీరథను మొదలుపెట్టారని చెప్పారు .ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణతో కేవలం మూడున్నరేళ్లలోనే 43 వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టు పూర్తి కాబోతుందన్నారు. గత పాలకుల వివక్షతో  అన్ని రంగాల్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలను సమగ్రంగా మార్చడానికే సిఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తీవ్ర తాగునీటి కొరతతో అల్లాడే పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథను వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా, ఎవరు కూడా మహబూబ్ నగర్ పట్టణ దాహార్తిని తీర్చలేకపోయారని, కాని కేసీఆర్ పట్టుదలతో ఎల్లూరు నుంచి టౌన్ కు తాగునీరు సరాఫరా అవుతోందన్నారు. ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి తాగునీళ్లు వస్తే, ఇప్పుడు ప్రతీ రోజు నీళ్లు వస్తున్నాయని చెప్పారు.

మహబూబ్ నగర్ తో పాటు జడ్చర్ల కు కూడా బల్క్ గా భగీరథ నీటిని అందిస్తున్నామన్న ప్రశాంత్ రెడ్డి, భవిష్యత్తులో ఎన్నడూ ఈ పట్టణాలకు తాగునీటి కొరత రాదన్నారు. దీంతో పాటు మే 10 నాటికి దశల వారీగా జిల్లాలోని 1305 ఆవాసాలకు బల్క్ గా శుద్దిచేసిన తాగునీరు సరాఫరా అవుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆవాసాల్లో ప్రారంభమైన ఇంట్రా విలేజ్ పనులు మంచి పురోగతిలో ఉన్నాయని, జులై నాటికి ఆ పనులన్నీ పూర్తి అవుతాయన్నారు. ఈలోపు ఎక్కడ పనులు పూర్తి అయితే అక్కడ ఇంటింటికి నల్లాతో తాగునీటిని సరాఫరా చేస్తామన్నారు. బల్క్ సరాఫరా మొదలైన వారం, పదిరోజుల వరకు నీటిని తాగడానికి ఉపయోగించవద్దని పాలమూరు ప్రజలను ప్రశాంత్ రెడ్డి కోరారు. ఆ తర్వాత నిరభ్యంతరంగా తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక పద్దతుల్లో భగీరథ నీరు శుద్ది అవుతుందన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి  చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ తో పాటు భగీరథ ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios