Asianet News TeluguAsianet News Telugu

మర్రి శశిధర్ రెడ్డికి ఎసరు పెట్టింది చంద్రబాబే?

కాంగ్రెస్ పార్టీలో వారి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచే తెలుగు రాష్ట్రాలకు ఒకరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఆ కుటుంబం నుంచే జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ వంటి కేంద్రకేబినేట్ స్థాయి పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చారు. 

Chnadrababu played main role in denying ticket to Marri Sashidhar Reddy?
Author
Hyderabad, First Published Nov 17, 2018, 3:53 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వారి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచే తెలుగు రాష్ట్రాలకు ఒకరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఆ కుటుంబం నుంచే జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ వంటి కేంద్రకేబినేట్ స్థాయి పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చారు. 

అలాంటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వక పోవడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దశాబ్ధాల రాజకీయ నేపథ్యం కలిగిన ఆకుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మెుండి చెయ్యి చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా ఇంకెవరు మర్రిశశిధర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన డా.మర్రి చెన్నారెడ్డి తనయుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు అనడంలో ఎలాంటి సందేహమే లేదు.

అలాంటి మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది. నిన్న మెున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు వచ్చాయి మర్రి శశిధర్ రెడ్డికి టిక్కెట్ రాకపోవడం ఏంటి అని మీరనుకుంటున్నారా...అది వాస్తవమే. కానీ దాని వెనుక పెద్ద గూడుపూట రహస్యం ఉంది. ఆ రహస్యమే చంద్రబాబు. 

మర్రిశశిధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వనిది కాంగ్రెస్ అయితే రాకుండా అడ్డుకున్నది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నది నగ్న సత్యం. అదెలా అనుకుంటున్నారా. తెలంగాణలో ఎలాగైనా పాగా వెయ్యాలని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా మహాకూటమిలో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తో ఎన్నికలకు సై అంది. 

తొలుత కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణకు మాత్రమే పరిమితం అన్నట్లు వ్యవహరించిన చంద్రబాబు ఆ తర్వాత తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. తెలంగాణలో ఏర్పడి పొత్తును బూచిగా చూపించి ఢిల్లీలో పాగా వేశారు. దీంతో టీడీపీలో కాదు ఏకంగా కాంగ్రెస్ లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం, కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించడం, ఆ తర్వాత రాహుల్ దూతగా అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబును కలవడం, సీట్ల సర్దుబాటు, కేటాయింపులపై చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఒకానొక దశలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మారిపోయిందని అమరావతికి షిఫ్ట్ అయిపోయిందన్నంతగా.  

అది పచ్చి నిజం. మహాకూటమిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్,టీజేఎస్,సీపీఐలు అయితే కలిసింది టీడీపీ. అయితే ఆ పొత్తును కూడా చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎంత అనుకూలం అంటే ఆయనే స్వయంగా టిక్కెట్ల కేటాయింపుల్లో జోక్యం చేసుకునేటంత. కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డుచెప్పకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ముఖ్యభూమిక పోషించారు.  

మహాకూటమిలో ఎక్కువ సీట్లు అడగకుండా గెలిచే స్థానాల్లోనే పోటీ చెయ్యాలని చంద్రబాబు చాలా చాకచక్యంగా వ్యూహం రచించారు. అందులో భాగంగా సర్వేలు చేయించుకుని మరీ స్థానాలు దక్కించుకున్నారు. 

అందులో ఒకటి సనత్ నగర్ నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా రాజీపడిన చంద్రబాబు సనత్ నగర్ విషయంలో మాత్రం రాజీపడలేదు. సనత్ నగర్ లో పోటీ చేసి కచ్చితంగా గెలవాలని చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు. ఎందుకు ఈ పట్టుదల అనుకుంటున్నారా. దానికి ఓ కథ ఉంది. ఆ కథే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఓడించడం.   

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎలాగైనా గెలిపించుకోవాలన్న కసితో చంద్రబాబు ఉన్నారు. 

టీడీపీ గెలిచే నియోజకవర్గమైన సనత్ నగర్ పై కన్నేసిన చంద్రబాబు అప్పటి వరకు ఆ టిక్కెట్ ఆశించిన కూన వెంకటేష్ గౌడ్ ను సికింద్రాబాద్ నియోజకవర్గానికి పంపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సనత్ నగర్ నుంచి బరిలోకి దింపారు. తలసాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై గెలుపొందారు. 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చారు. టీఆర్ఎస్ లోకి జంప్ అయి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ వ్యవహారం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

టీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి పొందిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీపై నిప్పులు చెరిగే వారు. తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాను టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే తనను మోసం చేసింది కాకుండా తిడతాడా అంటూ రగిలిపోతున్నారట. 

ఇటీవలే వైఎస్ జగన్ పై దాడి ఘటనలోనూ తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ను పరామర్శించిన తలసాని చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. దాడి జగన్ అభిమానే చేశాడని చంద్రబాబు అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు తలసాని. 

తన రాజకీయ శత్రువును పరామర్శించింది కాకుండా తననే తప్పుబట్టడంతో చంద్రబాబు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారట. దీంతో ఈసారి ఎలాగైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే సనత్ నగర్ స్థానాన్ని పట్టుబట్టి మరీ ఇచ్చుకున్నారు. 

గతంలో ఈ టిక్కెట్ ఆశించి భంగపడ్డ కూన వెంకటేష్ గౌడ్ ను బరిలోకి దించాలని ప్లాన్ వేశారు. కూన వెంకటేష్ గౌడ్ కు నియోజకవర్గంలో ప్రజల అండదండలతోపాటు సానుభూతి ఉందని ఆయన గెలుపుకు అవకాశాలు ఉన్నాయని భావించారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను వాస్తవం చేశారు. 

ఈ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డిది కావడంతో ఎలాగైనా ఆయనను తప్పించి తలసానికి చెక్ పెట్టాలని భావించారు. గతంలో శశిధర్ రెడ్డి ఓటమి చెందిన విషయాన్ని కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు వివరించారు. అంతేకాదు గత ఎన్నికల్లో శశిధర్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారన్న విషయాన్ని కూడా చంద్రబాబు బూచిగా చూపిస్తున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీడీపీ గెలుపు ఈజీ అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెటిలర్ల ఓట్లు అత్యధికంగా ఉండటం గెలుపును నిర్ణయించేది కూడా వారి ఓట్లే కావడంతో గెలుపుపై భారీ అంచనాలతో ఉన్నారు చంద్రబాబు. అందువల్లే సనత్ నగర్ నియోజకవర్గం ఇవ్వాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారికంగా కూన వెంకటేష్ గౌడ్ ను ప్రకటించింది.

అయితే కాంగ్రెస్ పార్టీలో హై ప్రొఫైల్ ఉన్న శశిధర్ రెడ్డిని కాదని టీడీపీకి ఈ స్థానం కేటాయించడం కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మూడు జాబితాలలో సనత్ నగర్ నియోజకవర్గాన్నిపెండింగ్ లో పెట్టింది. 

అయితే కొత్త మిత్రుడు చంద్రబాబు ఒత్తిడి మేరకు సనత్ నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించి మర్రి శశిధర్ రెడ్డికి మొండిచేయి చూపిస్తుందా లేక మర్రికి ఏదైనా నియోజకవర్గం కేటాయిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. లేకపోతే ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో సైలెంట్ గా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

ఇకపోతే మర్రి శశిధర్ రెడ్డి మాత్రం మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు. నియోజకవర్గంలో తన కమిట్‌మెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఓ నిర్ణయానికొస్తానని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారాయి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ లో సీట్ల లొల్లి: పార్టీ మారే యోచనలో మర్రి శశిధర్ రెడ్డి...?

మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

Follow Us:
Download App:
  • android
  • ios