Asianet News TeluguAsianet News Telugu

సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు: చంద్రబాబుకు మిగిలేది నిందలే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బొక్కా బోర్లాపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు వేసినా కారు జోరును అడ్డుకోలేకపోయారు. కనీసం చంద్రబాబు ఆశించిన స్థానాలను సైతం కైవసం చేసుకోలేకపోయారు. 
 

Chandrababu may face criticism on Sihasini's candidature
Author
Hyderabad, First Published Dec 11, 2018, 12:14 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బొక్కా బోర్లాపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు వేసినా కారు జోరును అడ్డుకోలేకపోయారు. కనీసం చంద్రబాబు ఆశించిన స్థానాలను సైతం కైవసం చేసుకోలేకపోయారు. 

ఇకపోతే తన మేనకోడలు నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం చంద్రబాబు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో తక్కువ సీట్లతోనైనా పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు. 

అందులో భాగంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తును సైతం పెట్టుకున్నాడు. అంతేకాదు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావించారు. అందుకు తగ్గట్లు ఏ చిన్న అవకాశాన్ని వదులు కోలేదు చంద్రబాబు నాయుడు. 

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి మంచి క్యాడర్ ఉందన్నది వాస్తవం. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోనే చంద్రబాబు అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ క్యాడర్ కాస్త అటు ఇటూ చెదిరిపోయింది. 

అయితే తిరిగి ఆ క్యాడర్ ను తిరిగిరప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలను రచించి ప్రజాకూటమితో కలిసిపోయారు. నందమూరి కుటుంబంపై తెలంగాణ వాసుల అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు, అలాగే నందమూరి కుటుంబంపై తనకు ఎంతో గౌరవం ఉందన్న నమ్మకాన్ని చూపించేందుకు, అలాగే హరికృష్ణ మరణం నేపథ్యంలో ఆ సానుభూతి కలిసివస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు అడుగులు వేశారు. 

కళ్యాణ్ రామ్ ను లేదా జానకిరామ్ భార్యను కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని ప్లాన్ వేశారు. అయితే అందుకు వారు ససేమిరా అనడంతో చంద్రబాబు నాయుడు దివంగత హరికృష్ణ కుమార్తెను బరిలోకి దించారు.  

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉండటంతోపాటు, ఆంధ్రా వ్యాపారస్థులు, సెటిలర్స్ ఓట్లు దక్కుతాయన్న నమ్మకంతో కూకట్ పల్లి బరిలో నందమూరి సుహాసినిని దించారు. అయితే నందమూరి సుహాసిని రాజకీయ ఆరంగేట్రంపై కుటుంబ సభ్యుల్లో భిన్నవాదనలు వినిపించాయి. 

సుహాసిని అభ్యర్థిత్వాన్ని తొలుత సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు తీవ్రంగా వ్యతిరేకించారు. వారే కాదు కుటుంబ సభ్యులు సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోలేదు. అయితే రాజకీయాల్లో అపరచాణుక్యుడిగా పేర్గాంచిన చంద్రబాబు ఎలాగోలా నందమూరి సుహాసినిని బరిలోకి దించారు. 

అయితే ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసిని ఓటమి పాలవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నందమూరి సుహాసిని బరిలోకి దిగిన నియోజకవర్గంలో సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బరిలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. 

మరోవైపు సినీనటుడు సుహాసిని బాబాయ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సోదరుడు తారకరత్న, టీడీపీ మంత్రులు పరిటాల సునీత, ఇతర నేతలు సైతం ప్రచారం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేశారు. 

రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు, నందమూరి సుహాసిని సామాజికవర్గం నేతలు ఎంతో ప్రయత్నించినా తెలంగాణ ఓటర్ల నాడిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఓటర్లను ప్రభావితం చెయ్యలేకపోయారు. 

అయితే సుహాసిని ఓటమి నేపథ్యంలో నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానుల్లోనూ ఆగ్రహం నెలకొంటుంది. ఓడిపోయే సీటు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు సుహాసినిని కూకట్ పల్లి బరిలో దించారని ఆరోపిస్తున్నారు. 

నిజంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి గెలుస్తారన్న నమ్మకం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఎందుకు బరిలోకి దించలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రతీ ఒక్కరి మదిని తొలిచేస్తున్న ప్రశ్నలు. 

నందమూరి కుటుంబంపైనా, హరికృష్ణ కుటుంబంపైనా సానుభూతి ఉంటే చంద్రబాబు నాయుడు సుహాసినిని నారా లోకేష్ లా ఎమ్మెల్సీని చేసి ఏపీ కేబినేట్ లోకి తీసుకోవచ్చు కదా అంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాజకీయపరంగా పలువురు ఇదే అంశాన్ని లేవనెత్తారు కూడా. 

టీఆర్ఎస్ నేత మాజీమంత్రి కేటీఆర్ సైతం హరికృష్ణ కుటుంబంపై ప్రేమ ఉంటే లోకేష్ లా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చెయ్యకపోయారా అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు దమ్ముంటే నారా లోకేష్ ను బరిలోకి దించాలంటూ మరో సవాల్ విసిరారు.  నందమూరి సుహాసినిని ఓడిపోయే సీటిచ్చారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే హరికృష్ణను మానసికంగా చంపేసి ఇప్పుడు వాళ్ల కుటుంబంపై ఏదో ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు బిల్డప్ లు ఇస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా సైతం విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా హరికృష్ణ కుటుంబంపై ప్రేమ ఉంటే కళ్యాణ్ రామ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లను ఎమ్మెల్సీలు గా చేసి కేబినేట్ లో తీసుకోలేకపోయారా అంటూ నిలదీశారు. 

లోకేష్ ను దొడ్డిదారిలో ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత కేబినేట్ లోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరో ఒకరిని లోకేష్ లానే చెయ్యాల్సింది కదా అంటూ ఆమె ప్రశ్నించారు. 

మెుత్తానికి టీఆర్ఎస్ పార్టీ నందమూరి హరికృష్ణ మరణించిన రోజు చాలానే చేసిందని చెప్పాలి. హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే వరకు మంత్రి జగదీష్ రెడ్డిని హరికృష్ణ మృతదేహం వెంటే ఉంచింది. 

ఆ తర్వాత హరికృష్ణ మృతదేహాన్ని స్వయంగా సీఎం కేసీఆర్, కేటీఆర్, తనయ కవితలు నేరుగా వెళ్లి నివాళులర్పించడమే కాకుండా వారిని ఓదార్చారు కూడా. అంతేకాకుండా ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతటి అభిమానాన్ని కనబరచిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తనయు నందమూరి సుహాసినిని బరిలోకి దించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios