Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోనే కాపురం చేశాడు, ఇప్పుడు వద్దంటున్నాడు: కారణం అదేనా...?

ప్రేమించానన్నాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమె మనసులో స్థానం సంపాదించడమే కాదు ఏకంగా ఇంటిలోనే తిష్టవేశాడు. పెళ్లికాకుండానే ఆమె ఇంట్లో అల్లుడిలా రాచమర్యాదలు అనుభవించాడు. 

a man cheating young girl in hyderabad
Author
Hyderabad, First Published Jan 12, 2019, 2:54 PM IST

హైదరాబాద్ : ప్రేమించానన్నాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమె మనసులో స్థానం సంపాదించడమే కాదు ఏకంగా ఇంటిలోనే తిష్టవేశాడు. పెళ్లికాకుండానే ఆమె ఇంట్లో అల్లుడిలా రాచమర్యాదలు అనుభవించాడు. 

అతగాడు ఆ యువతి ఇంటిలో ఉండటంతో స్థానికులు సూటిపోటిమాటలు అనేవారు. వాటికి చరమగీతం పాడాలని ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఆ యువతి తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చెయ్యడంతో ఇంటి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. 

అప్పుడు తెలిసింది అమ్మాయికి అబ్బాయిగారి నిజస్వరూపం. ఇంకేముంది లబోదిబోమంటూ ఆ యువకుడి ఇంటికి వెళ్లి మెురపెట్టుకుంది. అబ్బాయి తల్లిదండ్రులు అయినా బుద్ధి చెప్పి తనతో పెళ్లి చేస్తారని ఆశించింది. ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి. 

నీతో పెళ్లా నీకులం ఏంటి మా కులం ఏంటి ఛీ పో అంటూ మెడపట్టి గెంటేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. జీవితాంతం తోడుంటానని హామీ ఇచ్చి ఇలా మధ్యలో అర్థాంతరంగా వదిలేస్తున్నాడని పోలీసుల దగ్గర వాపోయింది. 

వివరాల్లోకి వెళ్తే పాతబస్తీ ఛత్రినాకకు చెందిన సందీప్ సేల్స్ ప్రమోటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కాచిగూడలోని ఓ అమ్మాయితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇంటర్ పూర్తి చేసిన ఆ యువతి ఇంటి దగ్గరే ఉంటుంది. దీంతో సందీప్ ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె అతడి ప్రేమలో పడింది.  

ఇంటికి సైతం వచ్చి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాడు. మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అంతేకాదు ఏకంగా వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని తల్లిదండ్రులు సైతం ఏమీ అడ్డు చెప్పలేదు. 

అయితే పెళ్లి చేసుకోవాలని గత ఏడాది జూన్ నుంచి పెళ్లి చేసుకోవాలని యువతి కోరుతోంది. అటు తల్లిదండ్రులు సైతం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచారు. చేసుకుంటానని చెప్పి నెమ్మది ఆ యువతని దూరం పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోయాడు. 

ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు. మళ్లీ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఇటీవలే ఆ యువతి సందీప్ ను పట్టుకుని నిలదీసింది. కులం వేరుకావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. 

దీంతో ఆ యువతి సందీప్ తల్లిదండ్రులు ఉండే ఛత్రినాక వెళ్లింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులను కలిసింది. తాము ప్రేమించుకున్నామని పెళ్లికి అంగీకరించాలని కోరింది. అప్పటికే పెళ్లి విషయంపై రగిలిపోతున్న వారికి ఆ యువతి మాటలు పుండుమీదు కారం చల్లినట్లు అనిపించింది. 

తనకు న్యాయం చెయ్యాలని కోరితే సందీప్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని కులం పేరుతో దూషించారంటూ కాచికూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సందీప్ తోపాటు అతడి తల్లిదండ్రులు, అక్కపై ఎస్సీఎస్టీ అట్రాసిటి కేసు పెట్టింది.నిందితులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నాజకిరెడ్డి స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios