Asianet News TeluguAsianet News Telugu

బలవంతంగా రైతు భూమి రిజిస్ట్రేషన్: నయిం ముఠా సభ్యుల అరెస్ట్

బెదిరింపులకు పాల్పడి, భూమిని స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయిమ్ ముఠాకు చెందిన సభ్యులను యాదగిరిగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు

4 members of nayeem gang arrest in bhongir
Author
Bhongir, First Published Mar 25, 2019, 8:43 AM IST

బెదిరింపులకు పాల్పడి, భూమిని స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయిమ్ ముఠాకు చెందిన సభ్యులను యాదగిరిగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడకు చెందిన నయిమ్ కోడల్ సయ్యద్ నిలోఫర్, హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన గిట్టా మల్లిఖార్జున్, యాదగిరి గుట్టకు చెందిన కంసాని రాము, కేలపు సంతోష్‌లు మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన కడెం నర్సింహులు అనే రైతుకు చెందిన భూమి కోర్టు వివాదంలో ఉంది.

విలువైన ఈ భూమిపై కన్నేసిన నయిమ్ ముఠా సభ్యుడు కొజ్జ రవికుమార్ అలియాస్ గోపరాజు రవి.. నయిమ్‌ చెప్పిన వారి పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని లేకుంటే చంపేస్తానని 2012లో రైతును బెదిరించాడు.

ముఠా సభ్యులైన భువనగిరికి చెందిన పాశం శ్రీను, హైదరాబాద్ మౌలాలీకి చెందిన శ్రీనివాస్, మల్లిఖార్జున్, సయ్యద్ నిలోఫర్, యాదగిరిగుట్టకు చెందిన లింగాల సతీశ్, కంసాని రాము, కేలపు సంతోష్‌ రైతు భూమిలో అక్రమంగా హద్దురాళ్లు నాటారు.

తర్వాత రైతు నర్సింహులను ఆయన తండ్రి అంజయ్య, తమ్ముడు రమేశ్‌లను బలవంతంగా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం శ్రీనివాసులు, మల్లిఖార్జున్‌ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు.

ఆ తర్వాత సయ్యద్ నిలోఫర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నయిమ్ ముఠాకు భయపడిన రైతు నర్సింహులు ఫిర్యాదు చేయలేకపోయాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ధైర్యం చేసి యాదగిరిగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడానికి బృందాలుగా విడిపోయారు. మిర్యాలగూడలో ఉంటున్న నయిమ్ బావమరిది సాదిక్‌, అతడి భార్యను భువనగిరి పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.

సాదిక్ బంగారుగడ్డ ప్రాంతంలో లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె పేరిట నయిమ్ కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఉంచినట్లు సమాచారం. ఈ కేసులో పరారీలో ఉన్న రవికుమార్, పాశం శ్రీను, శ్రీనివాస్, లింగాల సతీశ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios