Asianet News TeluguAsianet News Telugu

ఒక్క సీటు మిత్రుడు అసద్‌కీ: 16 సీట్లపై కన్నేసిన టీఆర్ఎస్

రాష్ట్రంలోని నాలుగు ఎంపీ స్థానాలపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది

trs targets on 16 mp segments in telangana for upcoming elections
Author
Hyderabad, First Published Feb 28, 2019, 2:35 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు ఎంపీ స్థానాలపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. హైద్రాబాద్ స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ ధీమాతో ఉంది.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది.  ఈ దఫా మరో ఐదు ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని టీఆర్ఎస్  వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించనుందని టీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది. ఎంఐఎం టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతోంది.ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎంకు టీఆర్ఎస్ ఓ స్థానాన్ని కూడ ఇచ్చింది.

గత ఎన్నికల్లో చేవేళ్ల  స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి మల్లారెడ్డి విజయం సాధించారు. 

ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. మల్లారెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  మేడ్చల్ అసెంబ్లీ  స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.తాజాగా కేసీఆర్ కేబినెట్‌లో మల్లారెడ్డికి మంత్రి పదవి కూడ దక్కింది.

 మల్కాజిగిరి నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మైనంపల్లి హన్మంతరావు పోటీ చేసి మల్లారెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

నల్గొండ ఎంపీ స్థానం నుండి గత ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

ప్రస్తుతం సుఖేందర్ రెడ్డి  రైతు సమన్వయ సమితి ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు.సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతోందనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఇప్పటికే జగదీష్ రెడ్డికి చోటు కల్పించారు. అదే సామాజిక వర్గానికి చెందిన సుఖేందర్ రెడ్డికి చోటు దక్కుతోందా  లేదా అనే చర్చ కూడ లేకపోలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నల్గొండ నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ కారణంగానే నల్గొండను కేసీఆర్ దత్తత తీసుకొన్నారనే ప్రచారం కూడ సాగుతోంది.సుఖేందర్ రెడ్డికి కేబినెట్ స్థాయి హోదా ఉంది. 

సికింద్రాబాద్ స్థానం లో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా  బండారు దత్తాత్రేయ పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా టీ.బీంసేన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీకి చాలామంది ఆసక్తిని చూపుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికలతో పోలిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో చాలా వ్యత్యాసం వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ మాత్రమే విజయం సాధించారు.2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆరు సెగ్మెంట్లను  టీఆర్ఎస్ విజయం సాధించింది.

ప్రస్తుతం నల్గొండ, మల్కాజిగిరి, చేవేళ్ల,సికింద్రాబాద్ స్థానాలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది.   మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నాయకత్వం బలమైన నాయకుల కోసం అన్వేషిస్తోంది. 

చేవేళ్ల ఎంపీ స్థానం నుండి శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ పోటీకి ఆసక్తిగా ఉన్నారు. తాను ఈ స్థానం నుండి పోటీకి సిద్దమని నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. ఇదే స్థానం నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios