Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ యాక్షన్... ఈ ముగ్గురు ఎంపీలకు నో ఛాన్స్

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైపోయాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా కసరత్తు ముగించినట్లుగా తెలుస్తోంది.

cm kcr red signal to 3 sitting mps
Author
Hyderabad, First Published Mar 13, 2019, 9:27 AM IST

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైపోయాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా కసరత్తు ముగించినట్లుగా తెలుస్తోంది.

16 ఎంపీ సీట్లే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో అన్ని రకాల అంశాలను పరిగణనలోనికి తీసుకుంటున్న కేసీఆర్ సిట్టింగులలో ముగ్గురికి మొండి చేయి చూపే అవకాశం కనిపిస్తోంది.

వారిలో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌లకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇందుకు సంబంధించి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి జితేందర్‌రెడ్డి, పొంగులేటి, సీతారాంనాయక్‌లకు ఆహ్వానం పంపలేదు.

ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నందున జితేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చేది అనుమానమే. ఖమ్మం ఎంపీ పొంగులేటిపై కేటీఆర్ కొంత సానుకూలంగా ఉన్నా కేసీఆర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అక్కడ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యాపారవేత్త పేరును దాదాపుగా ఖరారు చేశారు. దీంతో పొంగులేటి నల్గొండ లేదా మల్కాజిగిరి స్థానం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి తనకు అత్యంత సన్నిహితుడైన ఒక రాజకీయపార్టీ అధ్యక్షుని ద్వారా కేసీఆర్‌కి చెప్పించి పని చక్కబెట్టుకోవాలని పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. అయితే మల్కాజిగిరిలో ఇప్పటికే నవీన్‌రావుకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.

నల్గొండలోనూ నర్సింహారెడ్డి, చిన్నపరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత సీఎంను కలిసి మహబూబాబాద్ ‌ఎంపీ టికెట్ అభ్యర్ధించారు. మరోవైపు టీఆర్ఎస్ తొలి జాబితాను బుధవారం లేదా శుక్రవారం విడుదల చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేసీఆర్‌ లక్కీనెంబర్ 6 కలిసి వచ్చేలా 15 వ తేదీన 15 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఖరారైన ఎంపీ అభ్యర్థులు వీరే:

1. బోయినపల్లి వినోద్‌కుమార్- కరీంనగర్
2. కల్వకుంట్ల కవిత- నిజామాబాద్
3. కొత్త ప్రభాకర్‌రెడ్డి- మెదక్
4. బీబీ పాటిల్- జహీరాబాద్
5. బూర నర్సయ్యగౌడ్- భువనగిరి
6. జి.నగేశ్- ఆదిలాబాద్
 

Follow Us:
Download App:
  • android
  • ios