Asianet News TeluguAsianet News Telugu

జియోతో పోటీకి సై అంటున్న వొడాఫోన్ ఐడియా

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ జియోను ఢీ కొట్టేందుకు వొడాఫోన్ ఐడియా సంసిద్ధమవుతున్నది. అందుకోసం వొడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూపులు రూ.18 వేల కోట్ల నిధులు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా సమకూర్చనున్నాయి.

Vodafone Idea prepares Rs 25,000-cr war chest to fight Mukesh Ambani
Author
Hyderabad, First Published Jan 24, 2019, 11:27 AM IST

వొడాఫోన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు తమ ఉమ్మడి సంస్థ ‘వొడాఫోన్‌ ఐడియా’లోకి రూ.18,000 కోట్ల నిధులను పంపనున్నాయి. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోతో ఎదురవుతున్న పోటీని తట్టుకోవడం కోసం రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ పని చేయనున్నాయి. అర్హత గల వాటాదార్లకు రైట్స్‌ ఇష్యూ జారీ చేయడం ద్వారా రూ.25,000 కోట్ల నిధులను సమీకరించాలని వొడాఫోన్‌ ఐడియా డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 

ఒక వేళ రైట్స్‌ ఇష్యూకు సరైన స్పందన లభించకపోతే ప్రమోటర్ వాటాదార్లు స్పందన లభించని ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటారు. వొడాఫోన్‌ ఐడియాలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26% వాటా, ఐడియా వాటాదార్లకు 28.9 శాతం చొప్పున వాటా ఉంది. ముకేశ్‌ అంబానీకి చెందిన జియోతో పోటీ పడడం కోసమే ఈ నిధుల సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే జియో రాకతో చాలా వరకు టెలికం కంపెనీలు డీలా పడ్డ సంగతి తెలిసిందే. 2016లో ఫ్రీ వైర్ లెస్ సర్వీసులను నెలల తరబడి అందుబాటులోకి తేవడంతో జియో వినియోగదారులను భారీగా ఆకర్షించగలిగింది. తత్ఫలితంగా అదే ఏడాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ గల సంస్థగా జియో నిలిచింది. ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో 28 కోట్ల మంది మొబైల్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉండటంతోపాటు లాభాల బాటలో దూసుకెళ్తున్నది. 

జియో తీసుకొచ్చిన 4జీ డేటా, వేగం, ధరలతో పోటీ పడడం కోసం గతేడాది వొడాఫోన్‌, ఐడియా విలీనం అయిన సంగతి తెలిసిందే.తద్వారా ప్రస్తుతానికి దేశీయంగా అతిపెద్ద మొబైల్ ఫోన్ ప్రోవైడర్‌గా నిలిచింది కూడా. ఈ రైట్స్ ఇష్యూ జారీ ద్వారా వొడాఫోన్ రూ.11 వేల కోట్లు, భారతదేశానికి చెందిన ఆదిత్యా బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్ల నిధులను వొడాఫోన్ ఐడియా సంస్థకు చేర్చనున్నాయి. ఇంకా విడిగా వొడాఫోన్ ఐడియా తనకు ఇండస్ టవర్స్ లిమిటెడ్ సంస్థలో గల 11.5 శాతం వాటాను విక్రయించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ ఇండస్ సంస్థ భారతీ ఇన్ ఫ్రా టెల్, ఆదిత్యా బిర్లా టెలికం సంస్థల ఉమ్మడి ఆస్తి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios