Asianet News TeluguAsianet News Telugu

టీవీ చానెళ్ల బిల్లుతో బొమ్మ కనబడుద్ది!!

టీవీ చానెల్ ప్రసారాలపై టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అమలులోకి తెచ్చిన నిబంధనలతో ఒక్కో వినియోగదారుడిపై కేబుల్‌ భారం 25% వరకు పెరగొచ్చని అంచనా. అయితే ప్రధాన, స్థానిక ఆపరేటర్ల మధ్య ఆదాయ పంపిణీ ఎంత అన్న విషయం తేలలేదు. దీంతోనే కేబుల్‌లో యథావిధిగా పేచానళ్ల ప్రసారాలు జరుగుతున్నాయి. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే బుధవారం నుంచి నిలిచిపోయే అవకాశం ఉన్నది. డీటీహెచ్‌తోపాటు కేబుల్‌ కనెక్షన్లూ భారం కానున్నాయి. 

TV subscription bill may go up for most users: Report
Author
Hyderabad, First Published Feb 5, 2019, 11:38 AM IST

టీవీ చానల్‌ ప్రసారాలపై టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) నూతన నిబంధనలు ఈనెల ఒకటో నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందువల్ల నేరుగా ఇంటికే ప్రసారాలు (డీటీహెచ్‌)తో పాటు కేబుల్‌ కనెక్షన్ల ద్వారా టీవీ చానళ్ల ప్రసారాలు తిలకించే వారికి బిల్లు భారం పెరుగుతోందనే చెబుతున్నారు. మాస్టర్‌ ఆపరేటర్‌, స్థానిక ఆపరేటర్ల మధ్య ఆదాయ పంపిణీ వ్యవహార ఇంకా తేలనందున ప్రస్తుతానికి అన్ని చానళ్ల ప్రసారాలు యథాతధంగా సాగుతున్నాయి.  

డీటీహెచ్‌లో కోరుకున్న చానళ్లకు ముందస్తు డబ్బు చెల్లిస్తేనే, తర్వాతీ నెల ప్రసారాలు తిలకించే వీలు ఉంటుంది. కేబుల్‌లో మాత్రం అందుకు భిన్నమైన స్థితి. ప్రసారాలు అనలాగ్‌ నుంచి డిజిటల్‌కు మారి, సెట్‌ టాప్‌ బాక్స్‌ (ఎస్‌టీబీ) ద్వారా అందుతున్నా కూడా, గతంలో మాదిరే నెలవారీ రుసుం వసూలు చేస్తున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా రూ.150 నుంచి రూ. 250 వరకు ఈ రుసుము వసూలు చేస్తున్నారు. ఉచిత చానళ్లతో పాటు చెల్లింపుపై లభించే తెలుగు, హిందీ, ఆంగ్ల వార్తా, ఫైనాన్షియల్‌, సినిమా-వినోద భరిత చానళ్లతోపాటు క్రీడా ప్రసారాలు, పిల్లల కోసం యానిమేషన్‌ చానళ్లన్నీ ప్రసారమవుతున్నాయి. ఒక నెలలో తిలకించాక, మరుసటి నెల తొలి వారంలో చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం జనవరి నెల బిల్లులను కేబుల్‌ ఆపరేటర్లు వసూలు చేసుకుంటున్నారు. కొత్త నిబంధన ఈనెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినా, వినియోగదారులు పేచానళ్లను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 6 వరకు సమయం ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇవ్వమని కేబుల్‌ స్థానిక ఆపరేటర్లు కోరుతున్నారు.

ఇప్పటివరకు సిటికేబుల్‌, హాత్‌వే వంటి కేబుల్‌ ఆపరేటర్లు తమ మాస్టర్‌ ఆపరేటర్‌కు కనెక్షన్‌కు నెలకు రూ.90 చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొత్త విధానంలో 100 ఉచిత చానళ్ల ప్రసారానికి ప్యాకేజీ రూ.130తోపాటు 18 శాతం జీఎస్టీ కలిపి రూ.153 చెల్లించాలని ప్రతిపాదించారు. ఇందులో మాస్టర్‌ ఆపరేటర్‌కు 55%  అంటే రూ.71.50, 45 శాతం కేబుల్‌ ఆపరేటర్‌కు రూ.58.50 ఇవ్వాలని ప్రతిపాదించారు.

ఇళ్లకు కేబుల్‌ వేయడం, తెగినవి మార్చడం, యాంప్లిఫైయర్లు నిర్వహించడం, విద్యుత్ బిల్లులు, నిర్వహణకు ఉద్యోగుల భారం మోసే తమకు ఇది ఏమాత్రం సరిపోదని ఉచిత చానళ్ల ప్యాకేజీ రూ.130 తమకే ఇవ్వాలని కోరుతూ కేబుల్‌ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. ఫలితంగా స్థానిక ఆపరేటర్లకు ఇచ్చే మొత్తాన్ని 60 శాతానికి పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని తెలుస్తున్నది. 

దీని ప్రకారం 60 శాతం కింద స్థానిక ఆపరేటర్‌కు రూ.78, పేచానళ్ల బ్రాడ్ కాస్టర్‌కు 80 శాతం, 10 శాతం మాస్టర్‌ ఆపరేటర్‌, మిగిలిన 10 శాతం కేబుల్‌ ఆపరేటర్‌కు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. వినియోగదారులు కోరుకునే చానళ్లను బట్టి, ఇకపై కేబుల్‌ ఆపరేటర్లకు ఆదాయం లభించనుంది.

తెలుగు పే చానళ్ల విషయంలోనే ప్యాకేజీ ప్లస్ జీఎస్టీ కలుపుకుంటే  రూ.283 బిల్లవుతుంది. బేసిక్‌ చానళ్లకు రూ.130లో రూ.78, పేచానళ్లకు వసూలు చేస్తున్న రూ.110లో రూ.11 కలిపి నెలకు రూ.89 స్థానిక ఆపరేటర్‌ వాటాగా లభిస్తుందని ఆపరేటర్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రాంతాన్ని, అక్కడి ప్రజల ఆర్థిక స్థితితో పాటు ఇతర సంస్థల నుంచి పోటీ వల్ల రూ.150 నుంచే కేబుల్‌ ప్రసారాలు అందుతున్నాయి. ఇకపై ఈ అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతోపాటు పే చానళ్లను యధేచ్ఛగా మార్చుకునే వీలు, డీటీహెచ్‌కు ఉన్నంతగా కేబుల్‌లో ఉండదని భావిస్తున్నారు. కేబుల్‌ ఆపరేటర్‌కు చెప్పి, వారు మాస్టర్‌ ఆపరేటర్‌కు తెలిపి, మార్చే సరికి అధిక సమయం పడుతుంది.
అదే డీటీహెచ్‌లోపౌతే, కోరుకున్న చానల్‌కు చెల్లింపు ఎప్పుడు జరిపితే, వెంటనే తిలకించే వీలు ఉంటుంది.

ఇప్పటివరకు ఉచిత చానళ్లతో పాటు తెలుగు పేమెంట్‌ చానళ్లన్నీ కలిపి రూ.169కి లభిస్తున్నాయి. ఇకపై ఇదే ప్యాకేజీకి రూ.289 అవుతుందని టాటా స్కై ధరల ప్యాక్‌ సూచిస్తోంది. ఉచిత చానళ్లతో పాటు అదనంగా 25 సాధారణ పేమెంట్‌ చానళ్లు కూడా జతచేర్చుకుంటే, ఆ చానళ్ల ధరతో పాటు, రూ.23 నెట్‌వర్క్‌ సామర్థ్య రుసుం (ఎన్‌సీఎఫ్‌) కింద తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే హెచ్‌డీ చానళ్లయితే, ప్రతి 13 చానళ్లకు రూ.23 చొప్పున ఎన్‌సీఎఫ్‌గా చెల్లించాల్సిందే. ఇది మరింత అదనపు భారం కలిగించేదిగానే ఉంటుంది.  

ట్రాయ్‌ కొత్త విధానంలో ఉచిత చానళ్లతోపాటు అగ్రశ్రేణి 10 పేమెంట్‌ చానళ్ల కోసం  రూ.300 వరకు చెల్లించాల్సి వస్తుందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. ప్రస్తుతం నెలకు రూ.230-240 చెల్లిస్తున్న వారిపై 25 శాతం అదన భారం పడుతుందన్నది. టీవీ చానల్‌కు ప్రస్తుతం ఒక చందాదారు నుంచి నెలకు రూ.60-70 వస్తుండగా, ఇది రూ.94కు చేరనుంది. గరిష్ఠంగా ఒక చానల్‌కు రూ.19 చొప్పున లభిస్తుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios