Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో యాపిల్ ఫోన్ల సేల్స్ సవాలే. ట్రిలియన్ డాలర్లకు యాపిల్ ఎం క్యాప్

టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుండ బద్ధలు కొట్టేశారు. భారతదేశ మార్కెట్లో మందగమనం కొనసాగుతున్నదన్నారు. రూపాయి మారకం పతనం, దిగుమతి సుంకం పెంపు అంశాలతో యాపిల్ ఫోన్ల కొనుగోళ్లు తగ్గాయన్నారు. మరోవైపు భారతదేశ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో మరో దఫా చైనీస్ మేజర్ షియామీ మొదటి వరుసలో నిలిచింది.

Tim Cook acknowledges slowdown of business in India
Author
Kolkata, First Published Nov 2, 2018, 1:03 PM IST

కోల్‌కతా: యాపిల్‌ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త ఐఫోన్‌ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. కానీ భారతదేశంలో యాపిల్ ఫోన్ విక్రయాల్లో మందగమనం సాగుతోంది. ఈ సంగతి తమకు తెలుసునని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పడమే కాదు.. భారత్ మార్కెట్ తమకు ఒక సవాల్ అని కూడా పేర్కొన్నారు. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో భారత్ మార్కెట్‌పై యాపిల్ అంచనాలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. 

అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంపై యాపిల్ అంచనాలు షాకింగ్
అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌ లాంటి దేశాల్లో ఐఫోన్ల అమ్మకాలు తగ్గొచ్చని కంపెనీ అభిప్రాయపడింది. దీంతో ఈ ప్రభావం కంపెనీ షేర్లపై పడింది. గురువారం కంపెనీ షేర్ విలువ దాదాపు 7శాతం తగ్గింది. ఈ ఒక్క రోజే కంపెనీ 70 బిలియన్‌ డాలర్లు కోల్పోయి మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ దిగువకు పడిపోయింది.

గత తైమాసికంలో అంతగా రాణించని యాపిల్
గత త్రైమాసికంలో మాత్రం యాపిల్‌ అంతగా రాణించలేదు. ఐఫోన్ల అమ్మకాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు. తాజాగా ఈ త్రైమాసికం ఫలితాలను యాపిల్ విడుదల చేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.75కోట్ల ఐఫోన్లు అమ్ముడవుతాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్‌ 4.69 కోట్ల  ఐఫోన్లను విక్రయించింది. సంస్థ నికర లాభం, ఆదాయం మాత్రం పెరిగాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ 62.9 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. తాజా త్రైమాసికంలోనూ అమ్మకాలు మరింత తగ్గొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో యాపిల్‌ షేర్లు భారీగా పడిపోయాయి. 

కరెన్సీ పతనం.. సుంకాల పెంపుతోనే తంటా
అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, దిగుమతి సుంకాల పెంపుతో యాపిల్ ఫోన్ ధర పెరుగుదలకు కారణమని సంస్థ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. దీర్ఘకాలంలో మాత్రం భారత్ మార్కెట్లో అవకాశాలు ఉన్నాయన్నారు. టర్కీర, బ్రెజిల్, భారత్, రష్యా వంటి దేశాల కరెన్సీలు బలహీన పడి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. వివిధ అంశాలపై భారత ప్రభుత్వంతో జరిపిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయన్నారు. 

స్మార్ట్‌ఫోన్లలో మళ్లీ షామీనే టాప్!
భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ ఫోన్ల హవా కొనసాగుతోంది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ షామీ వరుసగా మూడో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో టాప్‌ 5 జాబితాలో నాలుగు ఫోన్లు చైనాకు చెందినవే కావడం గమనార్హం. దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌ ఫోన్ల అమ్మకాలు మూడో త్రైమాసికంలో స్వల్పంగా తగ్గినా రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విక్రయ కంపెనీగా షామీ నిలిచింది. 

మూడో త్రైమాసికంలో 12 మిలియన్ల షియామీ పోన్ల విక్రయం
మూడో త్రైమాసికంలో దాదాపు 12 మిలియన్ల ఫోన్లకు పైగా అమ్మకాలు జరిపింది. అత్యంత తక్కువ ధరకే షామీ ఫోన్లు అందుబాటులోకి రావడంతో భారత్‌లో వాటికి డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చైనాకు చెందిన వివో 4.5మిలియన్ల ఫోన్ల అమ్మకాలతో మూడోస్థానంలో, ఒప్పో 3.6 మిలియన్‌ యూనిట్ల అమ్మకాలు జరిపి నాలుగోస్థానంలో నిలిచింది. భారత్‌లో మొత్తం 40.4 మిలియన్‌ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios