Asianet News TeluguAsianet News Telugu

జియో ఎఫెక్ట్: అతిపెద్ద సంస్థగా వొడాఫోన్ ఐడియా.. టెలికం సంస్థలకు తగ్గని నష్టాలు

రిలయన్స్ జియో ప్రభావం టెలికం రంగం ఏమాత్రం తగ్గలేదు. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కార్యకలాపాలే నిలిపేసింది. వొడాఫోన్, ఐడియా కలిసి వొడాఫోన్ ఐడియాగా అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. ఎయిర్ టెల్ సంస్థలో టాటా టెలీ చేరిపోయింది. ఇక జియో లాభాలు గడించడంలో రికార్డులు నెలకొల్పుతుంటే.. నష్టాల నివారణలో ఇతర సంస్థలు నిమగ్నమయ్యారు. మరోవైపు 5జీ విషయమై ప్రయోగాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి. 

Telecom Sector 2018: Ushers In A New Era Of Digitisation And Economic Growth
Author
New Delhi, First Published Dec 29, 2018, 10:50 AM IST

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం టెలికం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో విసిరిన సవాల్‌తో కుదేలైన టెలికం సంస్థలు ఇంకా కోలుకోలేదు. పలు సంస్థలు ఈ ఏడాది కార్యకలాపాలు నిలిపేస్తే, మరికొన్ని ఇతర సంస్థల్లో విలీనమయ్యాయి. దేశీయ మొబైల్‌ రంగంలో 2-3 స్థానాల్లో ఉన్న ఐడియా, వొడాఫోన్‌ ఇండియా కూడా విలీనమై, అతిపెద్ద మొబైల్‌ సంస్థ అవతరించింది.  మరోవైపు ప్రధాన టెలికాం సంస్థల్లో ఉద్యోగాల కోతలు భారీగా సంభవించాయి. ఇక 5జీ సేవల కోసం స్పెక్ట్రమ్‌ ఎంపికకు తోడు ప్రయోగాత్మక పరీక్షలు చేస్తుండగా, మొబైల్‌ఫోన్ల తయారీలో దిగ్గజ సంస్థలు నిమగ్నమయ్యాయి. 

సేవలు ప్రారంభించిన రెండేళ్లలోనే 25 కోట్ల మంది చందాదార్లను చేర్చుకున్న రిలయన్స్‌ జియో సృష్టించిన ప్రకంపకనలు, ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఎయిర్‌సెల్‌ దివాలా తీయగా, అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌-కామ్‌) మొబైల్‌ సేవలు నిలిపేసింది. టాటా టెలిసర్వీసెస్‌, టెలినార్‌ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనమయ్యాయి. టాటా టెలి, టెలినార్‌ విలీనం వల్ల దాదాపు 8 కోట్ల మంది చందాదార్లు ఎయిర్‌టెల్‌కు లభించారు. అయితే వీరంతా అదే నెట్‌వర్క్‌లో కొనసాగుతున్నారా, అంటే చెప్పలేని స్థితి. ఇటీవలే వెలువడ్డ వార్తా కథనాల ప్రకారం ఏడు కోట్ల మంది వినియోగదారులు త్వరలో ‘ఎయిర్ టెల్’కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. రిలయన్స్ జియో మినహా ఎయిర్ టెల్ సహా టెలికం సంస్థలన్నీ నష్టాలనే చవి చూస్తుననాయి. 

టాటా టెలీ సర్వీసెస్, టెలీనార్ సంస్థల నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌ ఎయిర్‌టెల్‌కు లభించింది. దివాలా తీసిన ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్‌, టెలికాం టవర్ల కోసం రిలయన్స్‌ జియో బిడ్లు వేశాయి. ఎయిర్‌సెల్‌ చందాదార్లు మాత్రం వేర్వేరు నెట్‌వర్క్‌లకు మారిపోయారు. ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియా విలీనంతో ఏర్పాటైన వొడాఫోన్‌ ఐడియా 43 కోట్ల మంది చందాదార్లతో దేశీయ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌ 39 కోట్ల మంది వినియోగదారులతో రెండోస్థానానికి పడిపోయింది. వీటికి తోడుగా ప్రభుత్వరంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌, టాటా టెలికి చెందిన టాటా డొకొమొ మాత్రమే రంగంలో మిగిలాయి. 

టెలికం సంస్థల మూసివేతతో పాటు విలీనం వల్ల కూడా భారీగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. వివిధ సంస్థల్లో ఒకే రకమైన విధుల్లో ఉన్న వారిలో అధికులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది. సుమారు 75,000-90,000 మంది ఉపాధి కోల్పోయారని రాండ్‌స్టడ్‌ ఇండియా, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సంస్థలు అంచనా వేశాయి. 

టెలికం కంపెనీలు యాంత్రీకరణకు ప్రాధాన్యమివ్వడం కూడా ఉద్యోగాల కోతకు కారణమవుతోంది. టవర్‌ కార్యకలాపాల విధుల్లోని సిబ్బందికి ప్రత్యామ్నాయం తక్కువగా లభిస్తోంది. టెలికం రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కల వారు  వారు 30 శాతం మంది ఉంటారని అంచనా. 

అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌-కామ్‌)లో ఒకప్పుడు 52,000 మంది ఉద్యోగులుండగా, గత ఆర్థిక సంవత్సరం చివరకు 3,400 మంది మాత్రమే మిగిలారు. అలాగే రెండేళ్లలో ఎయిర్‌టెల్‌ సిబ్బంది సంఖ్య 12 శాతం తగ్గి, 17,200కు పరిమితమైంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ సిబ్బంది కూడా కలిపి 23,000కు తగ్గారు. టాటా డొకొమొ కూడా కార్యకలాపాలు పరిమితం చేసుకుంటోంది. 

దీనికి ప్రతిగా శరవేగంగా చందాదార్లను చేర్చుకుంటున్న జియో మాత్రం కొత్తగా ఉద్యోగాలిస్తోందని ఆయా సంస్థలు తెలిపాయి. ఇప్పటికే 1.60 లక్షల మంది వరకు సిబ్బంది ఉన్నా, మరో 80,000 మంది వరకు నియమించుకోవచ్చని సమాచారం. మొత్తంమీద 5-10 శాతం మందికి ఉపాధి దూరమయ్యే పరిస్థితులే నెలకొన్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 


5జీ, విమానాలు-నౌకల్లో మొబైల్‌ సేవలకు అడుగులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జీ సేవలు లభిస్తున్నాయి. ఇంతకుమించిన వేగంతో డేటా సేవలు అందించేందుకు, రవాణా-ఆరోగ్యసంరక్షణ సహా పలు రంగాల తీరును సమూలంగా మార్చే వీలున్న 5జీ సేవలకు సన్నాహాలు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మక సేవలకు శ్రీకారం చుట్టారు. స్పెక్ట్రమ్‌ వేలం వచ్చే ఏడాది జరగనుంది. విమానాలు, నౌకల్లో ప్రయాణిస్తూ కూడా మొబైల్‌ కాల్స్‌, డేటా వినియోగించుకునే వీలు ఇతర దేశాల్లో ఉండగా, మన దగ్గరా ఈ విధానానికి ఆమోదముద్ర పడింది. కొత్త సంవత్సరంలో ఇవీ సాకారమవుతాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios