Asianet News TeluguAsianet News Telugu

టీసీఎస్ భేష్: జాతి వివక్షకు చోటే లేదు.. అమెరికా కోర్టు తీర్పు

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అమెరికా కోర్టులో విజయం లభించింది. టీసీఎస్ ఎటువంటి జాతి వివక్షకు పాటుపడలేదని తేల్చి చెప్పింది. 

TCS wins US lawsuit over alleged staff discrimination
Author
New York, First Published Nov 30, 2018, 10:45 AM IST

న్యూయార్క్‌: భారత్ ఐటీ దిగ్గజం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు అమెరికా కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ సంస్థ దక్షిణాసియేతర ఉద్యోగులపట్ల జాతి వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ కాలిఫోర్నియా కోర్టులో దాఖలైన కేసులో టీసీఎస్‌కు అనుకూలంగా జ్యూరీ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. టీసీఎస్‌ వివక్షాపూరితంగా వ్యవహరించడం లేదని తొమ్మిది మంది సభ్యులతో కూడిన జ్యూరీ స్పష్టం చేసింది. దీంతో 120 బిలియన్ల డాలర్ల విలువైన భారత ఐటీ సేవల పరిశ్రమకు గొప్ప విజయమని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

టీసీఎస్‌లో తమకు తక్కువ పని అవకాశాలు కల్పించడమేకాక తమ జాతి మూలాలతో కావాలని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపిస్తూ క్రిస్టోఫర్‌ స్లైట్‌, సయ్యద్‌ అమిర్‌ మసౌది, నోబెల్‌ మందిలి అనే వ్యక్తులు కంపెనీపై కేసు వేశారు. అమెరికాలో దక్షిణాసియాయేతర ఉద్యోగులను టీసీఎస్‌ 10.6 శాతం మందిని తొలగిస్తే.. దక్షిణాసియా ఉద్యోగులను మాత్రం ఒక్క శాతం కంటే తక్కువ మందిని తీసివేసిందని పేర్కొన్నారు. ఈ దావాను ఈ నెల 5న విచారణ చేపట్టిన జ్యూరీ.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత టీసీఎస్‌ వివక్షాపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. 2011 నుంచి స్థానికుల నియామకాలను 400 శాతం పెంచినట్లు టీసీఎస్‌ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. టీసీఎస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.
 
ఉద్యోగుల నియామకాలతోపాటు వారిని కొనసాగించే నిర్ణయాలు ఆయా ఉద్యోగులకు ఉండే సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయే తప్ప వారి నేపథ్యం, జాతి మూలాలపై కాదని టీసీఎస్‌ తెలిపింది. టీసీఎస్‌ విజయానికి ఉద్యోగుల ప్రతిభ, నైపుణ్యాలు, పరిజ్ఞానమే కారణమని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. కస్టమర్ల వృద్ధి, పరివర్తనలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తమ సిబ్బంది కోసం పెట్టుబడి పెడుతూనే ఉంటామని, వారికి డిజిటల్‌ శిక్షణ ఇచ్చి టీసీఎస్‌లో విజయం సాధించడానికే కాక కస్టమర్లు విజయం సాధించేందుకు కృషి చేసేలా చూస్తామన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రపంచంలోనే బిజినెస్‌, టెక్నాలజీ లీడర్‌గా ఉందని, కంపెనీకి ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

ఉద్యోగుల నియామకం, అట్టిపెట్టుకోవడం వంటి నిర్ణయాలు పూర్తిగా సామర్థ్యాల ఆధారంగా ఉంటాయని, వ్యక్తుల జాతీయతకు ఇందులో చోటులేదని టీసీఎస్‌ వెల్లడించింది. ‘మేము ఎల్లప్పుడు ప్రమాణాలు పాటిస్తూనే ఉంటాం. ఈ కేసులో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. జ్యూరీ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకొంది. ఉద్యోగుల నియామకాన్ని సామర్థ్యాల ఆధారంగానే చేపడుతున్నాం. మా వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలందిస్తాం’ అని టీసీఎస్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం, ఉద్యోగుల పరిజ్ఞానం వల్లే టీసీఎస్‌ విజయాలు సాధిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

ఎస్బీఐలో ఆన్‌లైన్ సేవలకు మొబైల్ నంబర్ నమోదుకు నేటితో ముగియనున్న గడువు
మీరు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులుగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వినియోగించుకుంటూ ఉంటే ఒక్కసారి పరిశీలించుకోండి.. మీ మొబైల్‌ నెంబర్ ఖాతాకు జత చేసి ఉంటేనే శనివారం నుంచి  ఆన్‌లైన్‌ లావాదేవీలు కొనసాగుతాయి. లేకపోతే, డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోతాయి. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు అనుగునంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకుంటున్న ఖాతాదారులంతా తమ మొబైల్‌ నంబర్‌ను బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి. ఇప్పటికీ నమోదు చేసుకోని వారు, ఇప్పుడు తప్పనిసరి చేసుకోవాల్సిందే. ఇందుకోసం తన ఖాతా ఉన్న బ్యాంక్‌ శాఖకే కాదు.. ఎస్బీఐలోని ఏ శాఖలోనైనా చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం వారికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవచ్చు’ అని ఎస్బీఐ తెలిపింది.

గతేడాది జులై 6న బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం.. బ్యాంకులన్నీ తమ ఖాతాదారుల మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్‌ (ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌) లావాదేవీలు నిర్వహించే వారి ఖాతాల భద్రత కోసం, ప్రతి లావాదేవీకి సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) పంపాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ- మెయిల్‌ ఐడీ కూడా నమోదు చేసుకుంటే, దానికి మెయిల్‌ పంపాలి. ఎస్బీఐ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగిస్తున్న వారు ఎస్బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా, మొబైల్‌ నెంబర్ నమోదైందా, లేదా అనేది పరిశీలించుకోవచ్చు. onlinesbi.com  వెబ్‌సైట్‌కి వెళ్లి, బ్యాంకింగ్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌తో ఓపెన్‌ చేయాలి. మై అకౌంట్స్‌లో, ప్రొఫైల్‌ను క్లిక్‌ చేస్తే, మొబైల్‌ నంబర్ నమోదై ఉంటే కనపడుతుంది. లేకపోతే మాత్రం సమీప బ్యాంక్‌ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ మొబైల్‌ నెంబర్ మార్చుకోవాలనుకుంటే, ఓటీపీ/ఏటీఎం/కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా చేసుకోవచ్చు. దేశీయంగా అయితేనే ఇది సాధ్యమవుతుందని ఎస్బీఐ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios